బుద్ధ మురళి ఇదేం బుద్ధి?

ABN , First Publish Date - 2022-05-10T08:27:16+05:30 IST

‘‘చంద్రబాబు అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీ, కాఫీ కూడా తాగరు’’.. ‘‘లోకేష్‌ మాట్లాడటం ఇప్పుడే నేర్చుకుంటున్నాడు’’..

బుద్ధ మురళి ఇదేం బుద్ధి?

  • రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు 
  • పార్టీలను విమర్శిస్తూ నిత్యం వ్యాఖ్యలు 
  • చర్చనీయాంశంగా మారిన ప్రధాన 
  • సమాచార కమిషనర్‌ బుద్ధ మురళి తీరు 
  • ‘అనుచిత ప్రవర్తన’ అనిపిస్తే.. గవర్నర్‌కు తొలగించే అధికారం 


హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబు అనుమతి లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీ, కాఫీ కూడా తాగరు’’..  ‘‘లోకేష్‌ మాట్లాడటం ఇప్పుడే నేర్చుకుంటున్నాడు’’.. ఇలా టీడీపీ నుంచి మొదలుకొని కాంగ్రెస్‌, బీజేపీ, వైఎస్సార్‌ టీపీ, ప్రజాశాంతి దాకా అన్ని పార్టీల నాయకులపై నిత్యం విమర్శలు చేస్తుంటారాయన. అలా అని రాజకీయ నాయకుడు కాదు!! రాజకీయ విశ్లేషకుడు అంతకన్నా కాదు!! టీఆర్‌ఎస్‌ మినహా రాజకీయ పార్టీలపై వ్యాఖ్యల వర్షాన్ని కురిపించే ఆ వ్యక్తి మరెవరో కాదు.. తెలంగాణ సమాచార కమిషన్‌ ప్రధాన కమిషనర్‌ బుద్ధ మురళి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందునరాజకీయాలకు దూరంగా మెదలాల్సిన ఈయన..రాజకీయనేతల గురించి సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. 


బుద్ధ మురళి 2017 సెప్టెంబరులో రాష్ట్ర సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన మొట్టమొదటి సమాచార కమిషనర్‌ ఈయనే. ఆయనకు జర్నలిజం నేపథ్యం ఉండటంతో కమిషన్‌లో ఆ అనుభవం మరింత ఉపయోగపడుతుందని, రాష్ట్రంలో చట్టం మరింత పకడ్బందీగా అమలవుతుందని స.హ  చట్టం ఉద్యమకారులు భావించారు. కానీ బుద్ధ మురళి మాత్రం రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ సోషల్‌ మీడియా వేదికగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతోపాటు.. వారికి వ్యతిరేకంగా టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రధాన సమాచార కమిషనర్‌గా ఉన్న రాజా సదారాం ఆగస్టు 2020లో పదవీ విరమణ చేయడంతో.. నాటి నుంచి ఆ అదనపు బాధ్యతలను కూడా బుద్ధ మురళి నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా రూ.3.17 లక్షల ప్రజాఽధనాన్ని వేతనంగా పొందుతున్న బుద్ధ మురళి ప్రధాన సమాచార కమిషనర్‌ అన్న విషయాన్ని కూడా మర్చిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


  సమాచార కమిషనర్లు రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి. పార్టీలపై వ్యాఖ్యలు చేయకూడదని సమాచార హక్కు చట్టంలో స్పష్టం చేశారు. గతంలో రాజకీయ పార్టీ సభ్యత్వం ఉంటే రాజీనామా చేసి కమిషనర్‌గా చట్టంలో పేర్కొన్న విధంగా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ వీటన్నింటిని తోసిరాజని బుద్ధ మురళి అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, నిత్యం ప్రతిపక్ష నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. చట్టం ప్రకారం దీన్ని అనుచిత ప్రవర్తనగా పేర్కొంటారు. ఇలాంటి కమిషనర్లను సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 15 సబ్‌ సెక్షన్‌ (6) ప్రకారం తొలగించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వెళ్లి ఫిర్యాదుచేసిన రాష్ట్ర గవర్నర్‌.. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రధాన సమాచార ప్రధాన కమిషనర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలూఉదయిస్తున్నాయి.    



Read more