సత్తా చాటేలా!

ABN , First Publish Date - 2022-05-14T04:57:55+05:30 IST

తుక్కుగూడలో నేడు జరగనున్న భారీ బహిరంగసభను

సత్తా చాటేలా!
అమిత్‌షా సభకు సిద్ధమవుతున్న వేదిక

  • నేడు తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభ
  • బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు
  • భారీగా జన సమీకరణకు నేతల సన్నాహాలు
  • హాజరు కానున్న అమిత్‌షా


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : తుక్కుగూడలో నేడు జరగనున్న భారీ బహిరంగసభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి సత్తా చాటేలా బీజేపీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండోవిడత చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర నేటితో ముగియనుంది. ఈసందర్భంగా తుక్కుగూడలో సాయంత్రం నిర్వహించే బహిరంగసభకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ శివార్లలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ముందుగా మహేశ్వరం నియోజకవర్గాన్ని టార్గెట్‌ చేసింది. ఈ మేరకు అనునిత్యం ఏదో కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహిస్తోంది. ఈ విషయంలో బీజేపీ ఇప్పటివరకు కొంత సఫలీకృతమైంది. స్థానికసంస్థల ఎన్నికల్లో ఇది రుజువైంది కూడా. నేడు తుక్కుగూడలో నిర్వహించే బహిరంగ సభద్వారా తన సత్తా చాటాలని భావిస్తోంది. అంతేకాక వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయ ఎజెండా ఖరారుకు ఈ సభ వేదిక కానుంది. బీజేపీ నాయకత్వం ఈ వేదిక ద్వారా కీలక ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు. బీజేపీ ఈ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో అధికార పార్టీకి తామే ప్రత్యర్థులమనే సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయి సన్నద్ధమవుతున్న బీజేపీ.. ఈ సభ ద్వారా రాజకీయంగా మరింత  దూకుడు పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా కీలకమైన నగర శివార్లలో పాగా వేసేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాలపై బీజేపీ నాయకత్వం ఎక్కువగా ఫోకస్‌ చేసింది. గ్రేటర్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో శివారు ప్రాంతాలపై కన్నేసి చాపకింద నీరులా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. మరోవైపు రాజకీయ ప్రాధాన్యత ఉన్న ఈ బహిరంగసభను అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. ముందు లక్షన్నర వరకు జనసమీకరణ చేయాలని భావించినప్పటికీ కాంగ్రెస్‌ వరంగల్‌ సభ తరువాత నిర్ణయం మార్చుకుంది. కాంగ్రెస్‌ సభను తలదన్నేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల నుంచి జనాన్ని భారీగా సమీకరిస్తున్నారు. ఈ మేరకు స్థానిక నియోజకవర్గ నేతలకు టార్గెట్లు పెట్టారు. ఒక్క మహేశ్వరం నియోజకవర్గం నుంచే దాదాపు 50వేల మందికిపైగా సమీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో డివిజన్ల వారీగా టార్గెట్‌లో పెట్టారు. సభ విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా నేతలందరూ తలో బాధ్యత తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు జనార్దన్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌, అందెల శ్రీరాములు యాదవ్‌, సామా రంగారెడ్డి తదితర స్థానిక నేతలంతా ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేశారు. అలాగే వికారాబాద్‌ జిల్లా నుంచి మాజీమంత్రి చంద్రశేఖర్‌ తదితరులు భారీగా జనసమీరణ చేస్తున్నారు. సభను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యనేతలంతా ప్రతిరోజూ సభా ప్రాంగణానికి విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ విజయవంతమైతే నగర శివార్లలో మరిన్ని భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరోవైపు అమిత్‌షా రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.



Read more