లాకర్ల నిర్వహణ బాధ్యత బ్యాంకులదే

ABN , First Publish Date - 2021-02-20T07:03:18+05:30 IST

బ్యాంకు లాకర్ల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీటిలోని వస్తువుల పరిరక్షణ బాధ్య త ముమ్మాటికీ బ్యాంకులదేనని స్పష్టం చేసింది. లాకర్ల నిర్వహణ ఖాతాదారుల బాధ్యత తప్ప, తమది కాదని బ్యాంకులు చేతులు దులిపేసుకోవడం

లాకర్ల నిర్వహణ బాధ్యత బ్యాంకులదే

ఆరు నెలల్లో నియంత్రణనిబంధనలు జారీ చేయండి 8 ఆర్‌బీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు 


న్యూఢిల్లీ: బ్యాంకు లాకర్ల నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీటిలోని వస్తువుల పరిరక్షణ బాధ్య త ముమ్మాటికీ బ్యాంకులదేనని స్పష్టం చేసింది. లాకర్ల నిర్వహణ ఖాతాదారుల బాధ్యత తప్ప, తమది కాదని బ్యాంకులు చేతులు దులిపేసుకోవడం కుదరదని పేర్కొంది. వీటి నిర్వహణకు సంబంధించి ఆరు నెలల్లో స్పష్టమైన నిబంధనలు జారీ చేయాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)ని ఆదేశించింది. జస్టిస్‌ ఎంఎం శంతనగౌడర్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ప్రజలు తమ చరాస్తులను ఇళ్లలో ఉంచుకునేందుకు వెనుకాడుతున్న ప్రస్తుత సమయంలో బ్యాంకు లాకర్ల నిర్వహణ మరింత ప్రాధాన్యత సంతరించుకుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం మనం నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతున్నామని, ఈ సమయంలో ప్రజలు చరాస్తులను చేతుల్లో ఉంచుకునేందుకు ఇష్టపడటం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో వారి నుంచి లాకర్లకు డిమాండ్‌ పెరుగుతోందని..అలాంటి వారికి బ్యాంకులు కచ్చితంగా నాణ్యమైన సేవలందించాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది.


సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకువస్తే స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా వీటిని వినియోగించుకునేందుకు ముందుకువస్తారని పేర్కొంది. అంతేకాకుండా రెండు తాళం చెవులతో ఉపయోగించే లాకర్ల నుంచి ఎలకా్ట్రనిక్‌ విధానంలో నిర్వహించే లాకర్లకు మారే సమయం ఆసన్నమైందని ధర్మాసనం తెలిపింది. పాస్‌వర్డ్స్‌ లేదా ఏటీఎం పిన్‌ వంటి వాటి ద్వారా పాక్షికంగా లాకర్లను ఉపయోగించే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. అత్యుత్తమ టెక్నాలజీని వినియోగించి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లేకపోతే ఖాతాదారులకు తెలియకుండా లేదా వారి అనుమతి లేకుండానే నేరస్థులు వారి లాకర్లను ఖాళీ చేసే ప్రమాదం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. 

Read more