Bank of Barodaలో రూ.23.53 లక్షలు మిస్సింగ్‌పై క్యాషియర్ ఏమన్నాడంటే..

ABN , First Publish Date - 2022-05-13T16:02:39+05:30 IST

బ్యాంక్‌లో రూ.23.53 లక్షల నగదు మాయం ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది.

Bank of Barodaలో రూ.23.53 లక్షలు మిస్సింగ్‌పై క్యాషియర్ ఏమన్నాడంటే..

  • బ్యాంక్‌ డబ్బులతో నాకు సంబంధం లేదు
  • క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ సెల్ఫీ వీడియో

హైదరాబాద్ సిటీ/మన్సూరాబాద్‌ : బ్యాంక్‌లో రూ.23.53 లక్షల నగదు మాయం ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ తనకేమీ తెలియదంటూ కుటుంబసభ్యులు, స్నేహితులకు సెల్ఫీ వీడియోలు పంపాడు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సాహెబ్‌నగర్‌ బ్రాంచిలో రూ.23.53 లక్షలు లెక్కల్లో తేడా రావటం.. క్యాషియర్‌ ప్రవీణ్‌కుమార్‌ పరారీ కావటం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే గురువారం మధ్యాహ్నం ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడిన సెల్ఫీ వీడియోలు బయటికి వచ్చాయి.


వెళ్లిపోయిన రోజున తన స్నేహితులకు మాత్రం.. తాను బ్యాంక్‌ నుంచి వెళ్లిపోతున్నానని, డబ్బు అడ్జస్ట్‌ చేయలేపోతే ఇన్స్యూరెన్స్‌ ద్వారా తీసుకోవాలని మెసేజ్‌ పంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అతని సెల్ఫీ వీడియోలను బట్టి చూస్తే.. నగదు మాయం ఒక్క రోజులో జరిగినది కాదని తెలుస్తుంది. రోజుల తరబడి కొద్ది కొద్దిగా నగదు మాయమైనట్లు తెలుస్తుంది. కాగా ప్రవీణ్‌కుమార్‌ చెడు వ్యసనాల బారిన పడ్డాడని, క్రికెట్‌ బెట్టింగులు పెట్టడం లాంటి కారణంగా.. అతనే నగదు మాయం చేశాడని బ్యాంక్‌ అధికారులు చెప్పినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. ప్రవీణ్‌కుమార్‌ దొరిగితే గానీ అన్ని విషయాలు బయటికి వస్తాయని ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.


అందులో ప్రవీణ్‌కుమార్‌ ‘అర్జెంట్‌ పని ఉందని చెప్పి బ్యాంక్‌ నుంచి బయటికి వెళ్లాను. వెళ్లేటప్పుడు బ్యాగ్‌ కానీ, నగదు కానీ తీసుకెళ్లలేదు. నేను డబ్బులు తీసుకెళ్లినట్లు మీడియాలో రావటంపై బాధకలిగించింది. రెండు మూడు నెలల నుంచే బ్యాంక్‌లో నగదు లెక్కల్లో తేడాలొస్తున్నాయి. ఇన్ని రోజులుగా సర్దుకొచ్చినప్పటికీ.. తేడా మరింత పెరగటంతో తట్టుకోలేక వెళ్లిపోయాను’ అని పేర్కొన్నాడు. బ్యాంక్‌లో ఇతర సిబ్బంది తీరుపై అనుమానాలు వ్యక్తం చేశాడు. పని వేళలు ముగిసిన తరువాత.. శని, ఆదివారాల్లోనూ కొందరు బ్యాంక్‌లోకి వెళ్లేవారని.. వారికి సెలవు దినాల్లో బ్యాంక్‌లో ఏం పని అంటూ ప్రశ్నించాడు. నగదు భద్రపరిచే బీరువా వద్ద సీసీ కెమెరా పని చేయటం లేదని తెలిపాడు.

Read more