Taj Mahalను ఎవరు నిర్మించారో చెప్పడానికా మేమున్నది?: హైకోర్టు

ABN , First Publish Date - 2022-05-12T22:45:23+05:30 IST

తాజ్ మహల్‌లో మూసివేసి ఉన్న 22 గదులను తెరచి, వాటిలో

Taj Mahalను ఎవరు నిర్మించారో చెప్పడానికా మేమున్నది?: హైకోర్టు

లక్నో : తాజ్ మహల్‌లో మూసివేసి ఉన్న 22 గదులను తెరచి, వాటిలో ఏముందో చూడాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం గురువారం తోసిపుచ్చింది. బీజేపీ అయోధ్య విభాగం మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 


తాజ్ మహల్ గురించి తప్పుడు చరిత్రను బోధిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. దీనిలో మూసివేసి ఉన్న గదులను పరిశీలించి సత్యాన్ని తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఆ గదుల్లోకి వెళ్ళి, పరిశోధన చేయడానికి తనకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి డివిజన్ బెంచ్ స్పందిస్తూ, ఇలాంటి చర్చలు డ్రాయింగ్ రూమ్‌లో మాట్లాడుకోవడానికేనని, న్యాయస్థానంలో మాట్లాడటానికి కాదని పేర్కొంది. 


పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ, దేశ ప్రజలు తాజ్ మహల్ గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఓ కమిటీని నియమించి, నిజాన్ని బయటకు తీసుకురావాలని కోరారు. 


దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ‘‘రేపు మీరు వచ్చి ఈ న్యాయస్థానంలో న్యాయమూర్తుల చాంబర్స్‌లోకి వెళదామంటారా?’’ అని ప్రశ్నించారు. ‘‘తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదంటారా? దీని మీద తీర్పు చెప్పడానికి ఉన్నామా మేము? దయచేసి మీరు నమ్మే చారిత్రక వాస్తవాలవైపు మమ్మల్ని తీసుకెళ్లవద్దు’’ అని మండిపడింది. ఇలాంటి అంశాలపై తీర్పులిచ్చే నైపుణ్యం న్యాయమూర్తులకు ఉంటుందా? అని ప్రశ్నించింది. ఈ అంశం కోర్టు పరిధిలోకి రాదని తెలిపింది. దీనిని చరిత్రకారులకు వదిలేయాలని తెలిపింది.


ఈ పిటిషన్‌ను ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇదే అంశంపై ఆగ్రా (Agra) కోర్టు విచారణ జరుపుతోందని తెలిపింది. 


Read more