2 నెలల కనిష్ఠానికి సెన్సెక్స్ 16000 దిగువకు నిఫ్టీ
ముంబై: మార్కెట్ పతనం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగింది. అమెరికాలో ద్రవ్యోల్బణం చుక్కలనంటిందన్న వార్తలతో ప్రపంచ మార్కెట్లన్నీ పతనం కావడం ఇందుకు దోహదపడింది. వడ్డీ రేట్ల పెంపు భయాలు కూడా వాటికి జోడయ్యాయి. ఒకపక్క విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు భారీగా ఉపసంహరిస్తుండగా దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్ల ధోరణి పట్ల అప్రమత్తం కావడం మార్కెట్‌ను వరుస పతనాల బాటలో నడుపుతున్నదని విశ్లేషకులంటున్నారు. దీంతో గురువారం సెన్సెక్స్ 1158.08 పాయింట్ల నష్టంతో రెండు నెలల కనిష్ఠ స్థాయి 52,930.31 వద్ద ముగిసింది. నిఫ్టీ కీలక మానసిక అవధి 16000 కన్నా దిగజారింది. 359.10 పాయింట్లు నష్టపోయి 15,808 వద్ద ముగిసింది. ఐదు సెషన్లుగా నిరాఘాటంగా సాగుతున్న పతనంలో ఇన్వెస్టర్లు రూ.18.74 లక్షల కోట్ల మేరకు సంపద నష్టపోయారు. బీఎ్‌సఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 18,74,689.39 కోట్లు దిగజారి రూ.2,40,90,199.39 కోట్లకు పడిపోయింది.