అన్నదాత ఇంట... మృత్యు గంట

ABN , First Publish Date - 2022-05-06T05:20:37+05:30 IST

అందరికీ అన్నం పెట్టే రైతన్న ఇంట మృత్యుగంట మోగుతోంది. పంటల సాగు కోసం తెచ్చిన రుణం రైతు పాలిట మరణశాసనంగా మారుతోంది.

అన్నదాత ఇంట... మృత్యు గంట
ఆంజనేయులు కుటుంబం నివశిస్తున్న ఇళ్లు

అప్పుల బాధతో బలవన్మరణాలు

నష్టపరిహారంలోనూ.. అలసత్వమే..

కుటుంబాలకు దొరకని ఆసరా..


అందరికీ అన్నం పెట్టే రైతన్న ఇంట మృత్యుగంట మోగుతోంది. పంటల సాగు కోసం తెచ్చిన రుణం రైతు పాలిట మరణశాసనంగా మారుతోంది. సాగు నష్టమై బతుకుభారమై నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి అప్పు తీర్చే మార్గం కానరాక.. సహాయం చేసేవారు కరువై పంట పొలాల్లోనే పురుగుల మందు తాగి ఉసురు తీసుకుంటున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు మరణించడంతో.. చిన్న పిల్లలను చదివించుకోలేక, ఆడ పిల్లలకు పెళ్లిల్లు చేయలేక ఆ ఇళ్లల్లో మహిళా రైతుల అవస్థలు వర్ణణాతీతంగా మారుతున్నాయి. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి) : 

అతను తన చెమటను ధారపోస్తాడు.. కండలు కరిగిస్తాడు.. రేయనక.. పగలనక.. ఎండనక.. వాననక. గొడ్డుకష్టం చేస్తాడు. అంత కష్టంతో పాటు.. మరెంతో త్యాగం చేస్తాడు.. ఈసారైనా.. అనే ఆశతో.. అప్పులు చేస్తాడు. ఈసారైనా.. అనేది ఎప్పటికీ జరగక.. అప్పుల ఊబిలోకి జారిపోతాడు.. అగాథమైన ఆ అప్పుల ఊబి నుంచి బయటకు రాలేక.. ఏ ఉరితాడో.. పురుగుల మందుతోనో ఈ లోకాన్నే విడిచిపోతున్నాడు.. అతనే అన్నదాత.. అతని శ్రమతోనే.. మన నోట్లోకి ఐదు వేళ్లు వెళతాయని తెలిసినా.. అతనంటే.. ప్రభుత్వాలకు ఎందుకనో అలుసు.. అతడి బాగు కోసం ఏదో చేస్తామంటారే కానీ... అదీ మాటలకే పరిమితం అవుతోంది. ప్రభుత్వాల నుంచి ఆశించిన సాయం రాక.. ప్రాణాలు తీసుకున్న అతడి కుటుంబానికి  నష్టపరిహారం ఇవ్వడంలోనూ.. ఆలసత్వం కనిపిస్తోంది. తాను బతికుండగా.. ఎలాగూ కుటుంబం.. సుఖపడలేదు.. కనీసం చస్తే అయినా.. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోక పోతుందా..? అనే ఆశతో మృత్యుఒడికి చేరిన రైతన్న కుటుంబానికి ఆసరా దొరకడం లేదు. అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేక.. అప్పుల వాళ్ల దగ్గర మాటలు పడలేక.. కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం దక్కలేదు.


రైతుకేదీ భరోసా

నేల తల్లిని నమ్ముకున్న రైతుకు వ్యవసాయమే జీవనాధారం. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటున్నా ఈసారి రాత మారుతుందన్న ఆశతో పంటలు సాగు చేస్తారు. పంట సాగు వ్యయాన్ని లెక్కించి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకులు పంట రుణాన్ని ఇవ్వాల్సి ఉంది. అయితే బ్యాంకులు ఆ ప్రకారం రుణం ఇవ్వడం లేదు. దీంతో పంటల సాగు కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ నూటికి రూ.2 నుంచి రూ.3లు వడ్డీకి అప్పు తీసుకొని పంటలు పెడుతున్నారు. 


మద్దతు ధర ఏదీ..

మార్కెట్‌లో విక్రయించే ప్రతి వస్తువుకు తయారీదారుడే ధర నిర్ణయించుకుంటారు. అయితే రైతు మాత్రం తాను పండించిన పంటకు ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదు. సాగు పెట్టుబడికి అదనంగా 50 శాతాన్ని కలుపుకుని మద్దతు ధర ప్రకటించాలని స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. ఉదాహరణకు ఎకరాకు లక్ష రూపాయలు సాగు పెట్టుబడి పెడితే రైతు శ్రమ, ఇతర వాటిని అదనంగా 50 శాతం కలిపి ఒకటిన్నర లక్షగా నిర్ధారించి మద్దతు ధర ప్రకటించాల్సి ఉంది. ఆ సిఫారస్సులు బుట్టదాఖలయ్యాయి. దీంతో పంట దిగుబడుల అమ్మకాల్లో దళారుల పెత్తనం పెరిగిపోయింది. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు వ్యాపారులు ఎక్కడా కొనుగోలు చేయడం లేదు. వరి క్వింటా రూ.1680గా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా రూ.1500 కూడా కొనడం లేదు. పప్పుశనగ మద్దతు ఽధర రూ.5,250 అయితే రూ.4600 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి లేదు.


రూ.7 లక్షలతో సరిపెట్టేస్తున్నారు

ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం రూ.7 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. పరిహారం అందించడంలో జాప్యం కావడంతో ఆ రైతు కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. కుటుంబ పెద్ద పోతే ఆ ఇల్లు రోడ్డున పడ్డట్లే. ఆ కుటుంబం కోలుకోవాలంటే ఇంటిలో ఉన్న పిల్లలు ప్రయోజకులు కావాలి. ఇంటిలో ఉన్న మహిళా రైతులు పిల్లలను చదివించడానికి నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి చేతులు దులిపేసుకుంటోందని పలు విమర్శలు ఉన్నాయి.


ఏడాదిలో ముగ్గురు ఆత్మహత్యలు

అన్నమయ్య జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రాయచోటి, చిట్వేలి, పుల్లంపేట మండలాలలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు ఒక్కొక్కరిది ఒక దీనగథ..రాయచోటి మండలం పెద్దకాల్వపల్లెకు చెందిన రైతు దంపతులు ఆంజనేయులు, నాగలక్ష్మిలకు ఒకటన్నర ఎకరా పొలం ఉంది. సరైన వర్షాలు లేకపోవడం.. పంట దిగుబడి రాకపోవడంతో.. ఇద్దరు పిల్లలను ఇక్కడే పెద్దల దగ్గర వదిలి ఇద్దరూ కువైత్‌కు వెళ్లారు. అక్కడా వీరిని దురదృష్టం వెంటాడింది. ఆంజనేయులుకు అక్కడి సేట్‌ ఒకటన్నర సంవత్సరం జీతం ఇవ్వలేదు. కేవలం నాగలక్ష్మి జీతంతోనే.. ఇల్లు గడుపుకొచ్చారు. ఇంక అక్కడ ఉండీ ఉపయోగం లేదని.. రెండు సంవత్సరాల తర్వాత..ఇంటికొచ్చి సేద్యం చేసుకుని బతుకుదామని అనుకున్నారు. దీంతో ఆంజనేయులు రెండు బోర్లు వేశాడు. దీనికోసం రూ.4 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీరే మార్గం కనిపించలేదు. దీంతో తనతో పాటు కష్టాల మార్గంలో నడిచిన భార్యాబిడ్దలను అనాథలుగా వదిలి.. 23/6/2021న ఉరేసుకుని చనిపోయాడు. రైతు బతికున్నప్పుడు ఎలాగూ.. పెట్టుబడికి సహకారం. గిట్టుబాటు ధరల విషయంలో తక్షణ సాయం చేయని ప్రభుత్వం.. చనిపోయిన తర్వాత కూడా అతడి కుటుంబాన్ని ఆదుకోవడంలో అలసత్వమే చూపిస్తోంది. అతడికి ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నట్లు నివేదికల్లో ఉన్నాయి. అయితే అతను చనిపోయి పదకొండు నెలలు గడుస్తున్నా.. ఇంకా అతడి కుటుంబానికి నష్టపరిహారం అందలేదు. 


గేదెలు మేపుకుని పిల్లలను పోషించుకుంటున్నా..

- నాగలక్ష్మి, పెద్దకాల్వపల్లె

నా భర్త ఆంజనేయులు చనిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం చాలా కష్టంగా ఉంది. కొడుకు వంశీ డిప్లమో చేస్తున్నాడు. కూతురు ఇందు ఇంటర్‌ చదువుతోంది. వీళ్లను చదివించుకోవడం కోసం గేదెలను మేపుకుంటున్నా. ఆ పాలతో ఇల్లు గడుస్తోంది. నా భర్త చనిపోవడంతో నష్టపరిహారం రూ.7 లక్షలు వచ్చినట్లు వలంటీరు వచ్చి చెప్పినాడు.. ఇంకా చేతికి తీసుకోలేదు. 


- చిట్వేలి మండలం మైలపల్లెకు చెందిన ఎం.సుధాకర్‌రెడ్డి కౌలు రైతు. ఇతడికి సొంతంగా ఎకరా పొలం ఉంది. ఇదేకాక మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని బొప్పాయి సాగు చేశాడు. అందుకోసం అప్పులు చేసి రూ. లక్షలు ఖర్చు చేశాడు. అయితే ఽధరలు లేక.. అప్పులు మాత్రమే మిగిలాయి. ఈ అప్పులు తీరే మార్గం లేక..  గత ఏడాది సెప్టెంబరు 14న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య టైలర్‌గా పనిచేస్తూ.. పిల్లలను పోషించుకుంటోంది. ఇతడి కుటుంబానికి ఇంకా నష్టపరిహారం అందలేదు. వచ్చిందని అధికారులు చెప్పినట్లు ఆమె చెప్తోంది. 

- పుల్లంపేటకు చెందిన రైతు ఎన్‌.చిన్నపరెడ్డి గత ఏడాది సెప్టెంబరు 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతడి కుటుంబం ప్రస్తుతం పుల్లంపేటలో లేదు. ఎక్కడికో వలస వెళ్ళి పోయింది. మండల వ్యవసాయాధికారితో మాట్లాడితే.. వారి కుటుంబానికి నష్టపరిహారం వచ్చినట్లు చెప్పారు. వారికి ఇవ్వాల్సి ఉందన్నారు. 



Read more