ఇంకా అలాగే..

ABN , First Publish Date - 2022-05-04T06:21:01+05:30 IST

నంద్యాల జిల్లా ఆవిర్భవించి నేటికి నెల రోజులు కావస్తోంది.

ఇంకా అలాగే..

నంద్యాల జిల్లా ఏర్పడి నేటికి నెల

తాత్కాలిక భవనాల్లో కూడా పూర్తి కాని పనులు  

గాడిన పడని పాలన

 ప్రజల సమస్యలకు పరిష్కారం కరువు


నంద్యాల (ఆంధ్రజ్యోతి)

నంద్యాల జిల్లా  ఆవిర్భవించి నేటికి నెల రోజులు కావస్తోంది. అన్నింటా ఇంకా కొత్తగానే ఉంది.  పాలన గాడిన పడలేదు. వివిధ ప్రభుత్వ శాఖల తాత్కాలిక భవనాల పనులు కూడా పూర్తి కాలేదు. ఏ శాఖలో... ఏ అధికారి... ఎక్కడ పని చేస్తున్నారో ప్రజలకు సమాచారం   లేదు. కేటాయించిన భవనాల్లో ఏర్పాట్లు లేకపోవడంతో సిబ్బంది అక్కడ విధుల్లో ఉండటం లేదు.  తమ సమస్యలు చెప్పుకోవడానికి  ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.  



అయ్యేదెన్నడో..!


ఇరవై రోజుల కిందట జిల్లా అధికారులతో కలెక్టర్‌ మన్‌జిర్‌ జిలాని సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు కేటాయించిన తాత్కాలిక భవనాల అంశం అక్కడ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. వాటి పనులు రెండ్రోజుల్లో పూర్తి చేయాలని, ఉద్యోగులు సక్రమంగా పని చేసేందుకు వీలుగా కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్డీవో స్థాయి అధికారిని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన సమయం గడిచిపోయింది. కానీ ఉద్యోగులకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. 12 శాఖలకు కేటాయించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో ఇంకా రిపేర్లు జరుగుతున్నాయి. విద్యుత్‌, పెయింటింగ్‌, ప్లంబింగ్‌ పూర్తి కాలేదు. ఫర్నీచర్‌ ఇంకా రావాల్సి ఉంది. వీటిని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ పరిస్థితి అలా కనిపించడం లేదు. అంత సులభంగా పూర్తయ్యేలా లేదు. ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులు ఎప్పటి నుంచి నిర్వహిస్తారనే స్పష్టత రావడం లేదు. డీఎంహెచ్‌వో కార్యాలయాన్ని నంద్యాల జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయానికి రావాల్సిన ఫర్నీచర్‌ కర్నూలు నుంచి ఇంకా రాలేదు. 


 ఇలా అయితే ఎలా..?


తాత్కాలిక భవనాల్లో మౌలిక వసతుల కల్పన సంగతి పక్కన పెడితే... ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కూడా గందరగోళ పరిస్థితి ఉంది.  ఉపాధి హామీ పనులను పర్యవేక్షించడడంతో పాటు ఇతర కీలక విధులు నిర్వర్తించే డ్వామాకు ఇంత వరకు సిబ్బందినే కేటాయించలేదు. డీఆర్‌డీఏది కూడా ఇదే పరిస్థితి. మిగతా శాఖలకు నిష్పత్తి ప్రకారం సిబ్బందిని కేటాయించామని ప్రభుత్వం చెబుతున్నా.. అదేమీ నిజం కాదని తెలుస్తోంది. అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని కేటాయించి అదే నిష్పత్తి అని ప్రభుత్వం చెబుతోందని ఉద్యోగులు అంటున్నారు. ఇదంతా ఉద్యోగుల పంపిణీలో గందరగోళాన్ని తేటతెల్లం చేస్తోంది. రబీ సీజన్‌ ధాన్యంతో పాటు ఇతర పంటలు దిగుబడి వచ్చే సమయమిది. ఇంతవరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టతలేదు. ఇతర పంటలకు మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగాల్సి ఉంటుంది. రైతులు వివిధ సమస్యలపై రైతుభరోసా కేంద్రాలకు వెళ్లినప్పుడు అక్కడ సిబ్బంది కూడా కొత్త జిల్లాలో ఇంకా ఆన్‌లైన్‌ సంబంధ ప్రక్రియ పూర్తి కాలేదని చెబుతున్నట్లు సమాచారం.  


 క్యాంపుల పేరుతో..


కొత్త జిల్లాలో చాలా విభాగాల జిల్లా అధికారులు విధులను ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ సరైన వసతులు లేనందున సంతకం పెట్టి క్యాంపుల పేరుతో బయటికి వెళుతున్నారు. మరి కొంతమంది అధికారులు కర్నూలు-నంద్యాల డైలీ సర్వీస్‌ చేస్తున్నారు. నంద్యాల్లో నివాసం ఏర్పాటు చేసుకునే ఆలోచన చేయడం లేదు. మరోవైపు జిల్లా స్థాయి అధికారుల్లో కొందరు వారికి కేటాయించిన చాంబర్‌ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరిన్ని సౌకర్యాల కోసం కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


నిధులు ఇచ్చేది ఎవరో..


నంద్యాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే సమయంలో ఉద్యోగుల మౌలిక వసతులకు  నిధులు ఎక్కువగా ఏమీ కేటాయించలేదు. ఫర్నీచర్‌ కోసం మాత్రమే దాదాపు రూ.3 కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఈ కొద్దిపాటి నిధులు కలెక్టరేట్‌, ఎస్పీ వంటి భవనాల అవసరాలకు అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిని వాటికి నిధులు లేకపోవడంతో తాత్కాలిక భవనాల్లో వసతులు కల్పించలేకపోయారు.  చేసిన పనులకు బిల్లులు సక్రమంగా ఇస్తారనే గ్యారెంటీ లేకపోవడంతో  కాంట్రాక్టర్లు ధైర్యం చేసి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.  ఒకవేళ వచ్చినా ప్రభుత్వం ఇస్తామన్న రేటు ప్రకారం పనులు పూర్తి చేయడం కష్టమే అనే అభిప్రాయం ఉంది. పూర్తి స్థాయిలో పనులు చేయాలంటే సంబంధిత అధికారుల జేబు నుంచి ఖర్చు పెట్టుకోవలసిందే అనే వాదన వినిపిస్తోంది. నిధులు లేకుండా పనుల్లో పురోగతి కనపడాలంటే ఎలా? అని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.   చివరికి ఆఫీస్‌ స్టేషనరీ కూడా సొంత డబ్బులతో సమకూర్చుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. 


ఎక్కడో తెలియదు..


వివిధ  శాఖల కార్యాలయాలకు  బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో   గదులు కేటాయించారు.  అక్కడ   కార్యాలయ బోర్డులు  తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. లేదు. అక్కడ ఉండాల్సిన ఉద్యోగులు ఎక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నారో తెలియడం లేదు. పనుల నిమిత్తం అక్కడికి వెళ్లిన ప్రజలకు అధికారులు కనిపించక వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. అసలు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యాలయం ఉన్నదీ ప్రజలకు ఇప్పటికీ తెలియదు. ఏశాఖలో ఎంతమంది పనిచేస్తున్నారనే విషయం  అధికారులకు సైతం తెలియదు.  బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో  ఒకటి రెండు శాఖల ఉద్యోగులు మినహా మిగతా అన్ని శాఖల క్వార్టర్స్‌ ఖాళీగా ఉన్నాయి. ఆ శాఖల్లో కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులు లేరని తెలుస్తోంది. ఉద్యోగులంతా తమ శాఖకు సంబంధించిన అర్బన్‌ కార్యాల యాల్లో ఉండి పని చేస్తున్నారని తాత్కాలిక భవనాల్లో ఉండే ఒకరిద్దరు ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్డీవో కార్యాలయానికి కూడా ఇదే బీఎస్‌ఎన్‌ఎల్‌ క్వార్టర్స్‌లో రూములు కేటాయించారు. ఇక్కడ పనులు పూర్తి కాకపోవడంతో ఆర్డీవో కలెక్టరేట్‌లోని ఓ గదిలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని  ముఖ్య అధికారుల్లో ఒకరి పరిస్థితే ఇలా ఉందంటే మిగతా శాఖల పరిస్థితి ఊహించుకోవచ్చు. వసతులు లేక ఉద్యోగులు విధులు నిర్వహించడానికి ఇబ్బందిపడుతున్నారు.  ఏ సౌకర్యాలు లేకుండా విధులు నిర్వహించాలంటే ఎలా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Read more