అమృత్‌ సరోవర్‌ సాధ్యమేనా?

ABN , First Publish Date - 2022-05-11T05:28:37+05:30 IST

ప్రతీ వాన చినుకును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా కేంద్రం అమృత సరోవర్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 93 ప్రాంతాలను కుంటలకు, నీటి నిల్వ కేంద్రాలకు అనువైనవిగా బీష్మాచార్య స్పేస్‌ అప్లికేషన్‌ శాటిలైట్‌ (బైశాట్‌) ద్వారా గుర్తించారు. వీటి స్థల పరిశీలనకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉపాధి హామీ పథకం కింద పనులను ప్రారంభించి, ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అమృత్‌ సరోవర్‌ సాధ్యమేనా?
అమృత్‌ సరోవర్‌కు ఎంపిక చేసిన చెరువు

భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చెరువుల నిర్మాణానికి ప్రణాళిక

శాటిలైట్‌ ద్వారా స్థలాల గుర్తింపు

జిల్లాలో 93 ప్రాంతాల్లో నిర్మాణం

కనీసం 75 నిర్మించాలని లక్ష్యం

సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన


దుబ్బాక, మే 10: ప్రతీ వాన చినుకును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా కేంద్రం అమృత సరోవర్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకు క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 93 ప్రాంతాలను కుంటలకు, నీటి నిల్వ కేంద్రాలకు అనువైనవిగా బీష్మాచార్య స్పేస్‌ అప్లికేషన్‌ శాటిలైట్‌ (బైశాట్‌) ద్వారా గుర్తించారు. వీటి స్థల పరిశీలనకు క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఉపాధి హామీ పథకం కింద పనులను ప్రారంభించి, ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తించిన ప్రాంతాల్లో గ్రామం, పట్టణం తేడా లేకుండా ఎకరా స్థలాన్ని సేకరించి, 15 క్యూబిక్‌ మీటర్ల మేర ఉపాధి కార్మికుల ద్వారా తవ్విస్తారు. దీని ద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఉపాధి హామీ కూలీలకు సుమారు 4 నెలల పాటు పని దినాలు పెరుగుతాయి. కాగా ప్రతీ జిల్లాలో 75 ప్రాంతాలకు తగ్గకుండా నీటి నిల్వలకు పనులు చేపట్టాలని, అగస్టు 15వరకు పనులు పూర్తి చేసి, అక్కడ జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా చెరువులు, కుంటలు అందుబాటులో లభ్యం కాకుంటే, పాత చెరువుల్లోనే పనులు చేపట్టాలని సూచించింది. చెరువుకు రక్షణగా వెదురు, టేకు మొక్కలను నాటి, హద్దులను సూచించే విధంగా పనులను చేపట్టాలి. దీంతో చెరువులు కబ్జాకు గురికాకుండా ఉండడంతో పాటు చెరువు ఎఫ్‌టీఎల్‌ రక్షించబడుతుంది. 


గుర్తించిన స్థలాలపై అభ్యంతరాలు

జిల్లాలో గుర్తించిన 93 ప్రాంతాల్లోని 75 ప్రాంతాల్లో అమృత సరోవర్‌ ద్వారా పనులు తప్పకుండా చేపట్టాలని  ప్రభుత్వం సూచించింది. అయితే గుర్తించిన అన్ని గ్రామాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేవని అధికారులు చెబుతున్నారు. దుబ్బాక మండలంలో గుర్తించిన 5 ప్రాంతాల్లో నీటి నిల్వకుంటలు ఏర్పాటు సాధ్యంకాదని  తెలిసింది. ప్రైవేటు భూముల్లో నీటి నిల్వ కుంటలు తవ్వడానికి భూ యజమానులు ఒప్పుకోవడం లేదు. అలాగే ప్రభుత్వ భూమి, కుంటలు కబ్జాకు గురికావడంతో కబ్జాల నుంచి విడిపించడానికి అవకాశం లేకుండా పోయింది. అమృత్‌ సరోవర్‌ ద్వారా కుంటలను పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటీకీ, వివాదం జోలికి వెళ్లడానికి అధికారులు జంకుతున్నారు. అంతేగాక నీటిపారుదలశాఖ, రెవెన్యూశాఖ, జాతీయ ఉపాది హామీ సంస్థ, డీఆర్‌డీఏల సమన్వయం ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. 

Read more