Rana దంపతులకు బెయిల్

ABN , First Publish Date - 2022-05-04T20:28:31+05:30 IST

హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు..

Rana దంపతులకు బెయిల్

ముంబై: హనుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు ముంబైలోని ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో బెయిల్‌పై విడుదల చేసేందుకు అనుమతించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో మళ్లీ ఇదే నేరాన్ని పునరావృతం చేయరాదని, ఈ కేసుకు సంబంధించిన ఏ అశంపైన మీడియాతో మాట్లాడరాదని సెషన్స్ కోర్టు ఆదేశించింది.


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రైవేటు నివాసమైన 'మాతోశ్రీ' వెలుపల హనుమాన్ చాలీసా పఠనం చేస్తామంటూ రాణా దంపతులు బహిరంగ ప్రకటన చేయడంతో ఏప్రిల్ 23న ముంబై పోలీసులు వారిని అరెస్టు చేశారు. దేశద్రోహం, ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో సహా ఐపీసీలోని పలు నిబంధలన కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బెయిలు కోసం వారు దాఖలు చేసుకున్నారు. బెయిల్ దరఖాస్తుపై గత వారం ఇటు ప్రాసిక్యూషన్, అది డిఫెన్స్ వాదనలు  పూర్తయ్యాయి. శత్రుత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాము హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపునివ్వలేదని రాణా దంపతులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఎం నివాసం ఎదుట హనుమాన్ చాలీసా చదువుతామంటూ ప్రకటించడంతో శివసేన కార్యకర్తలు రాణా దంపతుల ఇంటి వద్ద నిరసనకు దిగడం, ఆ తర్వాత క్రమంలో ప్రధాని మోదీ ముంబై పర్యటనను దృష్టిలో పెట్టుకుని తమ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నట్టు వారిరువురు ప్రకటించడం వంటివి చోటుచేసుకున్నాయి. అనంతరం రాణా దంపతులను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

Read more