నన్ను నన్నుగా చూసేది అమ్మ మాత్రమే!

ABN , First Publish Date - 2022-05-08T05:30:00+05:30 IST

అందరిపిల్లల్లానే నేను కూడా. అల్లరెక్కువ. వేసవి సెలవలు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూసేవాడ్ని.

నన్ను నన్నుగా చూసేది అమ్మ మాత్రమే!

మీ బాల్యం ఎలా గడిచింది? చిన్నప్పటి జ్ఞాపకాల్ని నెమరేసుకుంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది?

అందరిపిల్లల్లానే నేను కూడా. అల్లరెక్కువ. వేసవి సెలవలు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూసేవాడ్ని. ఎందుకంటే... వేసవి సెలవల్లో అస్సలు ఇంట్లోనే ఉండేవాడ్ని కాదు. నాన్నగారితో పాటు షూటింగులకు వెళ్లేవాడ్ని. వేసవి వస్తే.. నాన్నగారి షూటింగులన్నీ ఊటీలోనే జరిగేవి. అక్కడకి నన్ను కూడా తీసుకెళ్లేవారు. వాతావరణం చల్లగా ఉండేది. రోజంతా సెట్లోనే ఉండేవాడ్ని. సెట్లో అందరూ నన్ను ఓ రాకుమారుడిలా చూసేవారు. ముద్దు చేసేవారు. ఆ క్షణాల్ని బాగా ఆస్వాదించేవాడ్ని. నాన్నతో మర్చిపోలేని జ్ఞాపకాలన్నీ ఊటీలోనే. ఎందుకంటే మిగిలిన రోజుల్లో.. ఆయన ఇంటి పట్టున ఉండేవారు కాదు. నేను నిద్రలేచే సమయానికి ఆయన షూటింగులకు వెళ్లిపోయేవారు. షిఫ్టుల లెక్కన పనిచేసేవారు కాబట్టి, ఎప్పుడు వచ్చేవారో కూడా నాకు తెలిసేది కాదు. అందుకే వేసవి కోసం నేనూ, నాన్నగారు.. ఇద్దరూ వెయిట్‌ చేసేవాళ్లం. 


మీ అమ్మగారి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..?

అమ్మంటే ప్రేమ. ఆప్యాయత. అనురాగం. నేను చూసిన నిస్వార్థమైన వ్యక్తుల్లో అమ్మ ముందు వరుసలో ఉంటారు. మానసికంగా చాలా స్ర్టాంగ్‌. కుటుంబం అంటే చాలా ఇష్టం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తను ముందుంటారు. కంప్లీట్‌ వుమెన్‌ అంటే.. అమ్మే!


మీ అమ్మగారిలో మీకు కనిపించిన గొప్ప లక్షణం ఏది?

మనం ఎలా ఉన్నా.. స్వీకరించే గొప్ప మనసు అమ్మకే ఉంటుంది. షరతులు లేని ప్రేమ అంటారే... అది అమ్మ దగ్గరే చూడగలం. నన్ను నన్నుగా చూసేది అమ్మ మాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒకేలా ఉండగల గుండె నిబ్బరం అమ్మలో చూశాను. ఆ లక్షణం నన్ను కట్టిపడేస్తుంది. మా అమ్మ నుంచి నేను నేర్చుకున్న విషయాల్లో ప్రధానమైంది అదే. నా కెరీర్‌లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అమ్మ పాత్ర చాలా కీలకం. ఆమె నా మూలస్థంభం.


చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారట కదా. మరి ఆమె ఎప్పుడైనా గట్టిగా మందలించేవారా?

నాకు తెలిసి అలాంటి సందర్భమే లేదు. మా అమ్మగారే కాదు.. నాన్న కూడా ఎప్పుడూ గొంతు పెంచి ఒక్క మాట అన్నదే లేదు. కొట్టిన సందర్భాలూ లేవు. పిల్లల్ని చాలా గారాబంగా పెంచారు. ఎవరైనా ఒక్క మాట అన్నా ఊరుకునేవారు కాదు. అలాగని మేం కూడా హద్దులు దాటలేదు. అల్లరైనా ముద్దుగానే ఉంటే అందం. 


తొలి సినిమా చేసినప్పుడు.. మీరు విజయాల్ని అందుకుంటున్నప్పుడు ఓ తల్లిగా ఆమె ప్రతి స్పందన ఎలా ఉండేది?

బిడ్డ విజయాల్ని చూసి ఈ సృష్టిలో అందరికంటే ఎక్కువ ఆనందించేది తల్లే కదా..? మా అమ్మ కూడా అంతే. నా హిట్‌ సినిమాలే కాదు, ఫ్లాప్‌ సినిమాలూ ఆమెకు నచ్చుతాయి. నా సినిమాలన్నీ చాలా పాజిటీవ్‌గా చూస్తారామె. నెగిటవ్‌ విషయాల గురించి అస్సలు మాట్లాడరు. నా సినిమా నే  కాదు.. ఏ సినిమా చూసినా అంతే. 


మీది ప్రేమ వివాహం కదా? మీ ప్రేమ సంగతి తెలిసి ఆమె ఎలా స్పందించారు?

ఆమె నుంచి ఎలాంటి అభ్యంతరాలూ లేవు. మా ప్రేమని, మా నిర్ణయాన్ని ఆమె గౌరవించారు. నమ్రత అంటే.. మా అమ్మకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే నాకంటే.. తనతోనే ఎక్కువ చనువుగా ఉంటుంది. వారిద్దరూ అత్తా కోడళ్లులా కనిపించరు. అంతకు మించిన ఆత్మీయత వాళ్లలో ఉంటుంది. స్నేహితుల్లా కలిసి మెలసి ఉంటారు. వారిద్దరినీ అలా చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. 


మీ అమ్మగారి నుంచి మీరేం నేర్చుకున్నారు?

సేవాగుణం.. జాలి, దయ.. ఇవన్నీ. కష్టపడి పనిచేసే తత్వం, పాజిటీవ్‌ థింకింగ్‌  అమ్మ నుంచే అలవాటు చేసుకున్నా. నా పిల్లలకు కూడా ఈ విషయాలే నేర్పుతున్నా.


ఫ సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Read more