Hyderabad శివారు ప్లాట్లకు మరోసారి వేలం..

ABN , First Publish Date - 2022-05-10T20:50:11+05:30 IST

ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ మరోసారి సిద్ధమైంది. రెండు నెలల క్రితం నగర శివారులోని వివిధ

Hyderabad శివారు ప్లాట్లకు మరోసారి వేలం..

  • అమ్ముడుపోగా మిగిలినవి ..
  • తొర్రూర్‌, బహదూర్‌పల్లితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ..
  • ఈ వారం చివరలో నోటిఫికేషన్‌
  • వచ్చే నెల 15న ఈ - వేలానికి కసరత్తు

ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ మరోసారి  సిద్ధమైంది. రెండు నెలల క్రితం నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్లాట్ల ఈ-వేలంలో మిగిలిన ప్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ కార్యాచరణ ప్రారంభించింది. తొర్రూర్‌, బహదూర్‌పల్లితో పాటు ఇతర ప్రాంతాల్లో మిగిలిపోయిన ప్లాట్ల వేలానికి ఈ వారం చివరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి. వచ్చే నెల 15న ప్లాట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలిసింది.


హైదరాబాద్‌ సిటీ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తొర్రూర్‌, మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ గండిమైసమ్మ మండలం బహదూర్‌పల్లిలో రాజీవ్‌ స్వగృహ భూముల్లో ఏర్పాటు చేస్తున్న లే అవుట్లలోని ప్లాట్లను మార్చి 14 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో వేలం వేశారు. తొర్రూర్‌లో 220 (223కు గాను) ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 77 (101కు గాను) ప్లాట్లు అమ్ముడుపోయాయి. తొర్రుర్‌లో మూడు ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 22 ప్లాట్లు మిగిలి ఉన్నాయి. తొర్రూర్‌లోని అమ్ముడుపోని ప్లాట్లతో పాటు మరో 200 ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేస్తోంది. 


బహదూర్‌పల్లిలో..

బహదూర్‌పల్లిలోని సర్వే నెంబర్‌ 239, 240, 247, 249లో రాజీవ్‌ స్వగృహ హౌసింగ్‌ బోర్డుకు చెందిన 40.3 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ వేసిన లే అవుట్‌లో తొలివిడతగా 101 ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. 77 ప్లాట్లు అమ్ముడుపోగా 22 మిగిలిపోయాయి. 500 చ.గజాలు, ఆపైన విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు అమ్ముడుపోలేదు. దీంతో ఈ ప్లాట్లను చిన్న ప్లాట్లుగా మార్చి మరోసారి విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలు చేపడుతోంది. 


కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారే..

తొర్రూర్‌, బహదూర్‌పల్లిలో మిగిలిన ప్లాట్లు, అందుబాటులో ఉన్న ప్లాట్లు మొత్తం సుమారు 300 ప్లాట్లను ఆన్‌లైన్‌లోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎ్‌సటీసీ ఈ కామర్స్‌ ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. తొర్రూర్‌లో చ.గజానికి అప్‌సెట్‌ ధరను  రూ.20 వేలుగా, బహదూర్‌పల్లిలో రూ.25 వేలుగా గతంలో మాదిరిగానే నిర్ధారించారు. అమ్మకం కోసం ఈ వారం చివరలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 15 నుంచి రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు కొనుగోలుదారులకు సుమారు నెల రోజులు గడువు ఇవ్వనున్నారు. వచ్చే నెల 15 నుంచి ప్లాట్లను ఈ - వేలం వేసేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Read more