చెత్త... మానవాళికి ముప్పు

ABN , First Publish Date - 2022-05-14T06:06:02+05:30 IST

ప్రజలు వాడి పడేస్తున్న చెత్తను సేకరించడంలో, ప్రాసెస్‌ చేయడంలో మన ప్రభుత్వాలు చాలా వెనుకబడి ఉన్నాయి. చాలా నగరాలు, పట్టణాలు, గ్రామాలలో చెత్త సేకరణ స్థానిక సంస్థలకు సవాలుగా మారుతోంది...

చెత్త... మానవాళికి ముప్పు

ప్రజలు వాడి పడేస్తున్న చెత్తను సేకరించడంలో, ప్రాసెస్‌ చేయడంలో మన ప్రభుత్వాలు చాలా వెనుకబడి ఉన్నాయి. చాలా నగరాలు, పట్టణాలు, గ్రామాలలో చెత్త సేకరణ స్థానిక సంస్థలకు సవాలుగా మారుతోంది. ఇందుకు ప్రజల అవగాహనా రాహిత్యం, సహాయ నిరాకరణ ఒక ముఖ్యమైన కారణం. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యమైన దేశంగా వెలుగొందుతున్న భారత్‌లో అంత త్వరగా ఫలితాలు ఊహించడం కష్టమే. ఇందుకు కారణాలలో అధిక జనాభా ఒకటి. దాదాపు దశాబ్దం క్రితమే మెట్రో నగరాలలో తడిచెత్త–పొడిచెత్త వంటి విషయాలపై కార్పొరేషన్‌లు అవగాహన కల్పించాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి నగరంలో తడిచెత్త–పొడిచెత్త వేరువేరుగా వేయడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం ఇంటింటికీ చెత్త బుట్టలను కూడా అందజేసింది. అయితే తడి–పొడి చెత్తలను వేరుచేసి చెత్త బండికి అందజేయాలన్న ప్రభుత్వాల వినతిని ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వాల లక్ష్యం నెరవేరడం లేదు. 


2021 సంవత్సరం లెక్కల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 10వేల టన్నులు, హైదరాబాద్‌లో 5500 టన్నులు, ముంబైలో ఎనిమిది వేలు, బెంగుళూరు ఆరు వేలు, చెన్నైలో 5600, అహమ్మదాబాద్‌లో మూడువేల టన్నుల చెత్త రోజూ వస్తోంది. ఇలా సేకరించిన చెత్తలో దాదాపు 30 నుంచి 40 శాతం కూడా ప్రాసెస్‌ కాకుండా డంపింగ్‌ యార్డులకు తరలుతోంది. ఇది రాబోయే రోజుల్లో పర్యావరణానికి అతి పెద్ద విఘాతం. 


మనదేశంలో దాదాపు 84వేల మున్సిపల్‌ వార్డులు ఉంటే, అందులో దాదాపు 65వేల మున్సిపాలిటీలలో 100 శాతం ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించే ఏర్పాట్లున్నాయి. అయితే ప్రజలు తడి–పొడి చెత్తలను వేరుచేయకపోవడం వల్ల ప్రాసెసింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఇప్పటికే దేశంలో చెత్తను ప్రాసెస్‌ చేయడంలో ఛత్తీస్‌ఘడ్‌ 74%, తెలంగాణ 67%, సిక్కిం 66%, గోవా 62%, ఢిల్లీ 55%, త్రిపుర 57%, మేఘాలయ 58%, మణిపూర్‌ 50%, కేరళ 45% రాష్ట్రాలు మొదటి 10 స్థానాలలో ఉన్నాయి.


ఒక నాలుగైదు రాష్ట్రాలలో 30 నుంచి 50 శాతం ప్రాసెస్‌ చేస్తున్నారు. ఇక ఒడిస్సా, బీహార్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు కనీసం 20% కూడా ప్రాసెస్‌ చేయడం లేదు. తెలుగు రాష్ట్రాలలో సాధారణ మున్సిపాలిటీల నుంచి కార్పొరేషన్‌ల వరకు తడి–పొడి చెత్త బుట్టలను అందించినా సేకరణ సులభసాధ్యం కావడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం ముఖ్య కారణం. అసలే చాలా నగరాలకు, మున్సిపాలిటీలకు సరియైన డంపింగ్‌ యార్డులు కూడా లేని పరిస్థితులలో ఇష్టారాజ్యంగా చెత్తను ఉత్పత్తి చేస్తున్న ప్రజలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. లేకుంటే ప్రభుత్వాల అభివృద్ధి ప్రణాళికను సరిగ్గా అర్థం చేసుకోలేని ప్రజలు ప్రభుత్వాలనే నిందిస్తారు. అంతేకాకుండా అభివృద్ధి త్రిశంకుస్వర్గంలో తేలియాడుతున్న మానవాళి భవిష్యత్తు తరాలకు ఈ చెత్త అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తుంది.

 మోతె రవికాంత్‌ (వ్యవస్థాపక అధ్యక్షులు, సెఫ్‌)

Read more