IPL 2024: ముంబై బాటలో సన్ రైజర్స్? కొత్త కెప్టెన్ నేతృత్వంలో బరిలోకి దిగుతుందా?
ABN, Publish Date - Mar 03 , 2024 | 08:37 PM
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభం కాబోతోంది. ఈ నెల 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కాబోతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు బరిలో దిగుతున్న ఈ టోర్నీలో రెండు జట్లు కొత్త వాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2024 (IPL 2024) ప్రారంభం కాబోతోంది. ఈ నెల 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కాబోతోంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు బరిలో దిగుతున్న ఈ టోర్నీలో రెండు జట్లు కొత్త వాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అందించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలు అప్పగించనుంది. అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) టీమ్ కూడా కొత్త నాయకుడితో బరిలోకి దిగబోతోందట.
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ అందించిన ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్ టీమ్‌ను నడిపించనున్నాడట. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్ (Pat Cummins) కోసం సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఏకంగా 20.5 కోట్లు వెచ్చించింది. ఈ నేపథ్యంలో అతడే కెప్టెన్ అని వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీకి దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్‌రమ్ నాయకత్వం వహించాడు. మార్క్‌రమ్‌ను తప్పించి ప్యాట్ కమ్మిన్స్‌కు బాధ్యతలు అప్పగించే విషయమై హైదరాబాద్ టీమ్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సన్‌రైజర్స్ టీమ్ తరుచుగా కెప్టెన్లను మారుస్తూనే ఉంది. డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఆ టీమ్ గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలు చేసింది. ఆ తర్వాత విలియమ్సన్ కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత మార్క్‌రమ్ పగ్గాలు అందుకున్నాడు. అయినా సన్‌రైజర్స్ రాత మారలేదు. గత సీజన్‌లో సన్ రైజర్స్ టీమ్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట్లోనే విజయం సాధించింది. మరి, ఈ ఏడాదైనా సన్ రైజర్స్ పరిస్థితి మారుతుందేమో చూడాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
Updated Date - Mar 03 , 2024 | 08:37 PM