Priyanka Jawalkar: పవన్‌తో అవకాశం వచ్చిన సినిమా చేయను
ABN, First Publish Date - 2023-01-15T13:51:13+05:30
పుట్టి పెరిగింది అనంతపూర్‌లో. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొంది. షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
పుట్టి పెరిగింది అనంతపూర్‌లో. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొంది. షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇదీ... క్లుప్తంగా ప్రియాంక జవాల్కర్ గురించిన ఇంట్రడక్షన్. అయితే తన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఆమె మాటల్లోనే...
కాలేజీ రోజుల్లో క్రష్..
‘‘పవన్‌కల్యాణ్ అంటే నాకు పిచ్చి. ‘తమ్ముడు’ 20సార్లు చూసుంటా. ‘ఖుషీ’లో ప్రతి డైలాగూ నాకు గుర్తే. అంత పెద్ద స్టార్ అయి ఉండి.. ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. ఒకవేళ భవిష్యత్తులో నాకు పవన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినా.. నేను చేయను. ఎందుకంటే ఆయన హీరో, నేను ఆయన అభిమానిని... అంతే. నేను ఆయన్ని దూరం నుంచే చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోతా. అంతకు మించి ఏం కోరుకోను. బన్నీ డాన్స్ నాకు బాగా ఇష్టం. తనపై కాలేజీ రోజుల్లో క్రష్ ఉండేది. ‘ఆర్య’ నాకు భలే ఇష్టం. ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ చూసి పడిపోయా.’’
భయపడుతూనే చూస్తా...
‘‘మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన ప్రేమ కథల్ని భలే తీస్తారు. అవకాశం, అదృష్టం రెండూ కలిసి వస్తే ఆయన సినిమాల్లో చిన్న పాత్ర దొరికినా చాలు. హారర్ సినిమాల్ని ఎక్కువగా చూస్తా. కానీ... ఆ రాత్రి నిద్ర పట్టదు. అలాంటప్పుడు హనుమాన్ చాలీసా వింటాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే పైలట్, లేదంటే చెఫ్ అయ్యేదాన్ని. మరాఠీ స్టైల్‌లో చికెన్ బాగా వండుతా.’’
సహనం... ఓపిక అవసరం
‘‘టాక్సీవాలా సుదీర్ఘ ప్రయాణం చాలా పాఠాల్ని నేర్పింది. ఆ సినిమా రెండేళ్ల పాటు సెట్స్‌పైనే ఉండిపోయింది. రిలీజ్ డేట్ విషయంలోనూ చాలా ఒడుదొడుకులు ఏర్పడ్డాయి. అసలు రిలీజ్ అవుతుందా? లేదా? అనే బెంగ వచ్చేది. ‘ఇది ఓటీటీ సినిమానే..’ అని నిరుత్సాహపరిచేవారు. అయితే ఎట్టకేలకు ఆ సినిమా విడుదల అవ్వడం... విజయవంతం కావడంతో ఊపిరి పీల్చుకొన్నా. ‘చిత్రసీమలో ఎదగాలంటే ప్రతిభతో పాటు సహనం, ఓపిక ఉండాలి’ అనే విషయం నాకు తొలి సినిమాతోనే అర్థమైపోయింది.’’
ప్రపోజ్ చేశారు... కానీ...
‘‘సింపుల్‌గా ఉండటమే ఇష్టం. ‘నేనేదో హీరోయిన్ అయిపోయాను’ అని ఎప్పుడూ అనుకోను. ఖాళీ సమయంలో స్నేహితులతో కూర్చుని చిల్ అవుతా. ఈ రోజుల్లో ఎవరికి వాళ్లే సెల్‌ఫోన్‌తో బతికేస్తున్నారు. రోడ్డు మీద కూడా తలెత్తుకొని చూసేవాళ్లు కనిపించడం లేదు. కాలేజీ రోజుల్లో చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. కానీ నేను స్పందించలేదు. ప్రేమంటే చాలా పెద్ద చాప్టర్. అదింకా నాకు అర్థం కాలేదు. అందుకే సింగిల్‌గానే ఉన్నా.’’
తొలి ఆడిషన్‌తో...
‘‘సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశా. నిజానికి నాకు అంతకు ముందే సినిమా ఛాన్సులు వచ్చాయి. కానీ ‘స్ర్కీన్‌పై నేను ఎలా కనిపిస్తానో..?’ అనే భయంతో ఒప్పుకోలేదు. పైగా అప్పటికి నా చదువు పూర్తి కాలేదు. షార్ట్‌ఫిల్మ్స్ వల్ల నాపై నాకు నమ్మకం కలిగింది. నా తొలి ఆడిషన్ ఇచ్చింది ‘టాక్సీవాలా’కే. సెలక్టయ్యాను. పైగా ఆ సినిమా హిట్టయ్యింది. దాంతో ‘నాకూ ఇండస్ర్టీలో కొంచెం చోటు దొరికింది’ అనిపించింది.’’
ఐష్‌ను చూసి...
‘‘చిన్నప్పుడు ‘జీన్స్’ సినిమాకెళ్లా. తెరపై ఐశ్వర్యరాయ్‌ని చూసి ఫిదా అయిపోయా. ‘అయితే.. గియితే.. ఐష్‌లా అయిపోవాలి’ అనుకొనేదాన్ని. సినిమాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి కూడా అప్పుడే పుట్టింది. ఇంట్లో చెబితే ‘చదువుకో.. ఫస్టు..’ అంటూ క్లాసు పీకారు. దాంతో చదువుపై శ్రద్ధ పెట్టా. బాగానే చదివేదాన్ని. అలాగని టాపర్ కాదు. కాలేజీలో అల్లరి ఎక్కువ చేస్తున్నానని లాస్ట్ బెంచ్ నుంచి ఫస్ట్ బెంచీకి తీసుకొచ్చారు.’’
Updated Date - 2023-01-15T14:03:09+05:30 IST