బాలలకు భరోసా
ABN, First Publish Date - 2023-02-21T22:44:47+05:30
పన్నెండేళ్ల బాలిక... మైకా గనుల్లో మగ్గిపోతోంది. బాల్యం మసిబారి... భవిష్యత్తు సూన్యం అయిన వేళ ఓ స్వచ్ఛంద సంస్థ చెయ్యి అందించింది....
పన్నెండేళ్ల బాలిక... మైకా గనుల్లో మగ్గిపోతోంది. బాల్యం మసిబారి... భవిష్యత్తు సూన్యం అయిన వేళ ఓ స్వచ్ఛంద సంస్థ చెయ్యి అందించింది. అది పట్టుకొని నిలబడిన ఆ బాలిక... ఆరేళ్లుగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటుపడుతోంది. బాల్య వివాహాల రద్దుకు పట్టుబట్టి... వారి హక్కుల గళమై నినదిస్తోంది. జార్ఖండ్ డైనమైట్... ‘డయానా అవార్డు’ విన్నర్... పదిహేడేళ్ల చంపా కుమారి కథ ఇది...
ఆడపిల్లలంటే సమాజమే కాదు, ఇంట్లో వాళ్లకు కూడా చిన్నచూపు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఎన్ని కష్టాలు పడైనా ప్రతి అమ్మాయీ తప్పనిసరిగా చదువుకోవాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి.
‘‘కలలు అందరూ కంటారు. కానీ మాకు ఆ స్వాతంత్య్రం కూడా లేదు. ఎందుకంటే ముఖంపై పసితనం ఛాయలు పోకముందే మైకా (అభ్రకం) గనుల్లో పని మొదలుపెడతాం. ఊహ తెలిసింది మొదలు అదే మాకు లోకం అయిపోతుంది. ఇక కలలు కనే సమయం, భవిష్యత్తు గురించి ఆలోచన ఎక్కడుంటుంది? జార్ఖండ్ రాష్ట్రం గిరిడీహ్ జిల్లాలోని జమ్దార్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం మాది. నాకు సోదరి, నలుగురు సోదరులు. మా ఊరికి మరో పేరు కూడా ఉంది... ‘మూడో ప్రపంచం’ అని! కారణం... బాగా వెనుకబడిన ప్రాంతం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా. ఇక్కడ అధిక శాతంమంది జీవనాధారం... మైకా గనుల్లో లభించే వ్యర్థాలు సేకరించడం. పగలంతా వాటిని సేకరించి, విక్రయిస్తే పదో పరకో వస్తుంది. దాంతో గంజి కాచుకొని ప్రాణాలు నిలుపుకోవడం ఇక్కడ సర్వసాధారణం. వ్యర్థాలు ఎంత ఎక్కువ సేకరిస్తే అంత ఆదాయం వస్తుంది. దాని కోసం పది పన్నెండేళ్ల పిల్లల్ని కూడా గనులకు వెంటబెట్టుకుని వెళతారు తల్లితండ్రులు. ఒక్కోసారి గనుల లోపల ఊపిరి అందక పిల్లలే కాదు, పెద్దలూ మరణిస్తుంటారు. అలాంటి సంఘటనలు అనేకం. కానీ ఇక్కడివారికి అది తప్ప వేరే జీవనాధారం లేదు. నా బాల్యం కూడా అలానే గనుల్లో మగ్గిపోయింది. పన్నెండేళ్లప్పుడు మైకా గనుల్లో పని మొదలుపెట్టాను. బడికి వెళతానని ఎంత మొత్తుకున్నా అమ్మా నాన్న వినకుండా నన్ను తీసుకువచ్చి పనిలో పడేశారు.
వెలుగు చూపిన ర్యాలీ...
ఒక రోజు పనికి వెళుతుంటే రోడ్డుపై ర్యాలీ కనిపించింది. ‘బచ్‌పన్ బచావో ఆందోళన్’ ర్యాలీ అది. బాల కార్మికులను కనిపెట్టి, వారికి విద్యాబుద్ధులు నేర్పించే ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం. ఇప్పుడది ‘కైలాష్ సత్యర్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్’ (కేఎస్‌సీఎఫ్)గా రూపాంతరం చెందింది. ఆ ర్యాలీ దగ్గరకు వెళ్లి... ‘నేను కూడా చదువుకోవాలను కొంటున్నాను’ అని చెప్పాను. వాళ్లు సంతోషపడ్డారు. ‘మా నాన్నకు చెప్పి ఒప్పించండి’ అని ఆ బృందాన్ని ఇంటికి తీసుకువెళ్లా. చదువుకోవాలనే బలమైన కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ నాన్న అడ్డం పడ్డారు. మళ్లీ అదే పరిస్థితి. ఈసారి కూడా చదువుకొంటానంటే నాన్న వద్దన్నారు. ‘ఒకవేళ బడికి పంపాలంటే నా కొడుకులను పంపిస్తాను... నా కూతుళ్లను కాదు’ అని నాన్న వాళ్లకు తెగేసి చెప్పారు. పని చేయడానికైతే ఆడపిల్లలు కావాలి కానీ చదువుకోవడానికి పనికిరారా? ఇదే నన్ను బాధించింది. అయితే నేను పట్టు విడవలేదు. ఫౌండేషన్ వారి సాయంతో ఎలాగో నాన్నను ఒప్పించాను. బడికి వెళ్లడం ప్రారంభించాను. ఆ తరువాత నా జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. భవిష్యత్తుపై ఆశలు మొలకెత్తాయి. అందుకే ఆ ర్యాలీ నాకు ఒక వెలుగు దివ్వెలా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఆరుతో మొదలు...
పన్నెండేళ్లప్పుడు ఆరో తరగతితో నా విద్యాభ్యాసం ప్రారంభమైంది. తరువాత 81 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాను. లాయర్ కావాలన్నది నా కల. తద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణకు మరింత కృషి చేయవచ్చు కదా! అయితే ఈ పని నేను స్కూల్లో చేరిన మరుసటి రోజు నుంచే మొదలుపెట్టాను. ‘కేఎస్‌సీఎఫ్’తో కలిసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాను. మా ప్రాంతంలో బాల్య వివాహాలను అడ్డుకున్నాను. గనుల్లో పనిచేస్తున్న చిన్నారులకు బాల కార్మిక వ్యవస్థ నుంచి, దాన్ని విస్తరిస్తున్న ముఠా నుంచి విముక్తి కల్పించి, వారిని బడిలో చేర్పించగలిగాను. అలా తొమ్మిది వేల మందికి పైగా సాయం అందించాను. మా ప్రాంతంలోనే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత మార్పు తేగలిగాను. ఇదంతా ఎవరి మెప్పు కోసమో కాదు... నాలాంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం.
ముర్ము నుంచి అవార్డు...
ఎక్కడైనా బాలల హక్కులకు భంగం కలిగినట్టు నా దృష్టికి వస్తే వెంటనే అక్కడకు వెళతాను. వారి తరుఫున నిలబడతాను. దీని కోసం కేఎస్‌సీఎఫ్ వారి ‘బాల పంచాయత్’లో చేరాను. దానికి నన్ను మా ప్రాంత ‘ముఖ్య’గా నియమించారు. ఆ తరువాత సంవత్సరం ‘బాల పంచాయత్’కు రాష్ట్ర ‘ముఖ్య’ అయ్యాను. దీని ఆధ్వర్యంలో గనుల్లో మగ్గుతున్న వంద మందికి పైగా బాల కార్మికులకు విముక్తి కల్పించగలిగాను. ఇది నాకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది. వీటన్నిటినీ గుర్తించి 2019లో ‘డయానా అవార్డు’ ప్రకటించారు. నాటి జార్ఖండ్ గవర్నర్, ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మేదుగా నాడు ఆ అవార్డు అందుకున్నాను.
ఇంట్లో ఒత్తిడి చేసినా...
ఆడపిల్లలంటే సమాజమే కాదు, ఇంట్లో వాళ్లకు కూడా చిన్నచూపు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఎన్ని కష్టాలు పడైనా ప్రతి అమ్మాయీ తప్పనిసరిగా చదువుకోవాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. పోరాడే తత్వం అలవాటు చేసుకోవాలి. నా విషయమే తీసుకొంటే... నేను చదువుతానంటే ఇంట్లోవాళ్లు వద్దన్నారు. పదమూడేళ్లకే మా మామ కొడుకును పెళ్లి చేసుకోమని నా మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చారు. వేటికీ నేను లొంగలేదు. ఇప్పుడు మా అమ్మా నాన్నలే కాదు... ఊళ్లోవాళ్లు కూడా నన్ను ‘మా అమ్మాయి’ అంటూ గొప్పగా చెప్పుకొంటున్నారు. తమ పిల్లలను బడికి పంపుతున్నారు. ఈ మార్పు అంతటా రావాలి. ఇలాంటి మార్పే నేను కోరుకున్నది.
Updated Date - 2023-02-21T22:44:48+05:30 IST