ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు
ABN, First Publish Date - 2023-07-02T03:20:59+05:30
తెలుగు సినీ రంగంలో సంచలనాలు రేపుతున్న యువ నటుల్లో నిఖిల్ ఒకరు. తాజాగా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమా విడుదలయిన సందర్భంగా ఆయనతో ‘నవ్య’ ముచ్చటించింది. ఆ విశేషాల్లోకి వెళ్తే...
సండే సెలబ్రిటీ
తెలుగు సినీ రంగంలో సంచలనాలు రేపుతున్న యువ నటుల్లో నిఖిల్ ఒకరు.
తాజాగా నిఖిల్ నటించిన ‘స్పై’ సినిమా విడుదలయిన సందర్భంగా
ఆయనతో ‘నవ్య’ ముచ్చటించింది. ఆ విశేషాల్లోకి వెళ్తే...
‘స్పై’కు ఎలాంటి ఆదరణ లభిస్తోంది?
చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంత మంచి ఓపెనింగ్స్ ఇచ్చినందుకు ముందుగా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. దేశభక్తితో కూడిన థ్రిల్లర్ సినిమా ఇది. ఒక మంచి సినిమాను చూశామని ప్రేక్షకులు భావిస్తున్నారు.
‘కార్తికేయ-2’ విజయం తర్వాత మీపై ఒత్తిడి పెరిగిందా?
అసలు ఇలాంటి సినిమాలు చేయగలుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆడుతూ పాడుతూ ఉండే హ్యాపీ సినిమాలు చేసుకొనే సమయంలో ఎక్కువ ఒత్తిడి ఉండేది కాదు. ప్రేక్షకులు కార్తికేయ-2ను పెద్ద హిట్ చేయటంతో మొత్తం సీన్ మారిపోయింది. కలెక్షన్స్.. గ్రాస్.. నెట్.. ఇలా నంబర్స్ భయపెడుతున్నాయి. నాకే ఇలా ఉంటే నాలుగైదు వందల కోట్ల బిజినెస్ చేసే హీరోలపై ఇంకెంత ఒత్తిడి ఉంటుందా అనిపిస్తోంది. ఆ ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో అర్థం కావటం లేదు. వాళ్లపై గౌరవం మరింత పెరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో- ఒక మంచి సినిమా తీస్తే సరిపోదు. దానిని ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాలి. వారు చూసేలా చేయాలి. అదే సమయంలో సినిమాను కొన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌కు కూడా మంచి లాభాలు రావాలి. వీటన్నింటి వల్లా ఒత్తిడి బాగా పెరిగింది.
మీకు అలాంటి షాక్‌లు తగిలాయా?
అదృష్టవశాత్తు నాకు అలాంటి షాక్‌లు తగలలేదు. ఇక్కడ ఒక విషయాన్ని తప్పనిసరిగా చెప్పాలి. నేను అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశా. ఆ తర్వాతే హీరో అయ్యా! అందువల్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే విషయం బాగా తెలుసు. అయినా సినిమా ప్రపంచమనేది ఒక పెద్ద మహా సముద్రం. అది కొత్త కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ఎవ్వరూ దానిని పూర్తిగా అర్ధం చేసుకోలేరు. అంతా అర్థమయిందనుకొనే సరికి కొత్త గుణపాఠం ఎదురవుతుంది. కొన్నిసార్లు ప్రేక్షకులు షాక్ ఇస్తారు. ఇంకొన్ని సార్లు ఇండస్ట్రీ షాక్ ఇస్తుంది. ఇది సృజనాత్మక రంగం కదా! ఏదీ శాశ్వతం కాదు.
ఇప్పుడు చాలా మంది యువ హీరోలకు టీమ్‌లు ఉంటున్నాయి. మీకు అలాంటి టీమ్ ఉందా?
లేదు. వేర్వేరు వ్యక్తులతో పనిచేయటానికి నేను ఎక్కువగా ఇష్టపడతా! స్టైలిస్ట్‌ల దగ్గర నుంచి పోస్టర్ డిజైనర్స్ దాకా అందరూ మారిపోతూ ఉంటారు. అయితే అదృష్టవశాత్తు నా చుట్టూ మంచి డైరక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చందు, సుధీర్‌వర్మ, ఆనంద్, చైతన్య వంటి డైరక్టర్స్- అభిషేక్ అగర్వాల్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, ఠాగూర్ మధు వంటి ప్రొడ్యూసర్స్, రాజా రవీంద్ర వంటివారు ఉన్నారు. వీరందరూ నాకు ఎప్పటికప్పుడు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు.
ఈ మధ్య అందరికీ పాన్ ఇండియా క్రేజ్ పెరిగింది?
ఈ క్రేజ్‌ను మీరెలా చూస్తారు?
మార్కెట్ పరంగా చాలా మంచిది. ఉదాహరణకు ‘కార్తీకేయ2’ను తీసుకుందాం. ఇతర భాషల్లో విడుదల చేయటం వల్ల మరింత ఆదాయం వచ్చింది. మళయాళం, తమిళం భాషల్లో పెద్ద హిట్ అయింది. అంతే కాదు... అన్ని భాషల్లో విడుదల చేయటం వల్ల ఓటీటీ, శాటిలైట్ మార్కెట్స్‌లో కూడా మంచి రాబడి ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి . అన్ని సినిమాలూ పాన్ ఇండియా సినిమాలు కావు. సబ్జెక్ట్ ఆధారంగా- అది పాన్ ఇండియా సినిమా అవునా? కాదా? అనే విషయం నిర్ధారించుకోవాలి.
‘18 పేజీస్’ సినిమాను తీసుకుందాం. అది రీజినల్ సినిమా. స్పై తీసుకుంటే అది పాన్ ఇండియా సినిమా. అందుకే దానిని అన్ని భాషల్లో విడుదల చేశాం. మూవీ టూ మూవీ.. స్ర్కిప్ట్ టూ స్ట్రిప్ట్ - జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
సివిఎల్‌ఎన్ ప్రసాద్
ఒకప్పుడు హీరోలపై ఇంత ఒత్తిడి ఉండేది కాదేమో..?
ఒకప్పుడు ఎక్కువ మంది హీరోలు షూటింగ్.. తమ నటన.. స్ర్కిప్ట్ వరకే చూసుకొనేవారు. కానీ నా వరకు నేను అలా ఆలోచించను. థియేటర్‌కు ప్రేక్షకులకు వస్తున్నారంటే అది హీరో వల్లే కదా! మొన్న తిరుపతి వెళ్లా. అక్కడ కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కలిశారు. ‘‘మీ సినిమా అంటే బావుంటుంది. మీ మీద నమ్మకంతో సినిమా కొన్నాం’’ అన్నారు. అంటే వారు నా మీద నమ్మకంతో కొన్నారు. వారికి నష్టం రాకూడదంటే- ఆ సినిమా బావుండేలా నేనే చూసుకోవాలి. నన్ను నమ్మే ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు కదా! అయితే కొన్ని సార్లు షూటింగ్ ముందు చేయాల్సి రావటంవల్లో... ఇతర కారణాల వల్లో సినిమా సరిగ్గా రాదు. అప్పుడు హీరోనే అందరూ తప్పుపడతారు. అలాంటప్పుడు షాక్ తగులుతుంది.
స్వయంభూ
వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులు నా సినిమాలు చూడాలి. అందుకే నా సినిమాలన్నీ ఇతర భాషల్లోకి డబ్ చేస్తున్నాం. నా రాబోయే సినిమాలన్నీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చేస్తున్నాం. వచ్చే నెల నుంచి ‘స్వయంభూ’ ప్రారంభమవుతుంది. ఇది చాలా మంచి ప్రాజెక్ట్. దీనిలో ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారు.
గ్రేట్ కాంప్లిమెంట్
‘కార్తికేయ 2’ ప్రమోషన్స్ కోసం అహ్మదాబాద్‌కు వెళ్లినప్పుడు కొందరు మహిళలు వచ్చి హగ్ చేసుకున్నారు. ‘థాంక్యు’ అన్నారు. ‘కార్తికేయ2’లాంటి సినిమాకు ఇచ్చినందుకు వారు నాకు చెప్పిన థాంక్యు అది.. అదొక గొప్ప కాంప్లిమెంట్!
నా సపోర్ట్..
నా భార్య పల్లవి నాకున్న పెద్ద సపోర్ట్. ఇన్ని రకాల ఒత్తిళ్లలో ఆమె నాకు ఇచ్చే మద్దతు గొప్ప వరం. తను ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నేనూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది.
నాన్న లేని లోటు..
ఎనిమిది నెలల క్రితం నాన్న చనిపోయారు. అది చాలా బాధకరమైన మూమెంట్! ఇప్పటికీ నాకు ఆయన కలలోకి వస్తూ ఉంటారు. అప్పుడు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తూ ఉంటా.
Updated Date - 2023-07-02T03:20:59+05:30 IST