సేవలోనే సార్థకత...
ABN, First Publish Date - 2023-04-19T22:40:31+05:30
క్రీడాకారిణిగా అనేక బంగారు పతకాలు... రైల్వే్‌సలో ఉన్నత పదవి... వీటిలో దొరకని సంతృప్తిని సామాజిక సేవలో వెతుక్కున్నానంటారు లతా సుందరం....
క్రీడాకారిణిగా అనేక బంగారు పతకాలు... రైల్వే్‌సలో ఉన్నత పదవి... వీటిలో దొరకని సంతృప్తిని సామాజిక సేవలో వెతుక్కున్నానంటారు లతా సుందరం. ఆమె నేతృత్వంలోని ‘ఆరామ్ ట్రస్ట్’ వేలాది బాలలు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పదకొండేళ్ళుగా లత సాగిస్తున్న సేవా ప్రస్థానం గురించి ఆమె మాటల్లోనే...
‘‘నేను పుట్టిందీ పెరిగిందీ తమిళనాడులోని సేలం నగరంలో. చదువు, ఆటలూ... చిన్నప్పుడు ఇదే నా లోకం. ప్రత్యేకించి వాలీబాల్ బాగా ఆడేదాన్ని. 1981లో ‘ప్రెసిడెంట్స్ లెవెన్’ వాలీబాల్ జట్టులో సభ్యురాల్ని. ‘1982 ప్రీ-ఏషియన్ గేమ్స్’లో రైల్వే వాలీబాల్ జట్టు తరఫున ఆడాను. సౌత్ జోన్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాను. ఎన్నో బంగారు పతకాలు సాధించాను. ఆ తరువాత ఇండియన్ రైల్వేస్ ఉద్యోగంలో, కుటుంబ బాధ్యతల్లో బిజీ అయిపోయాను. అయితే సమాజం కోసం ఏదైనా చెయ్యాలనే తపన మాత్రం నాలో బలంగానే ఉండేది. కానీ నా ఆలోచనలు స్పష్టమైన రూపు తీసుకోవడానికి కొంతకాలం పట్టింది. కొంతమంది స్నేహితులతో కలిసి 2012లో ‘ఆరామ్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను చాలా చిన్న స్థాయిలో ప్రారంభించాను. పిల్లలు, మహిళల సంక్షేమం కోసం పని చెయ్యాలనేది మా ప్రాథమిక లక్ష్యం.
143 పాఠశాలల్లో తరగతులు...
‘ప్రపంచంలో ఫలానా దేశం అత్యంత సంతోషకరమైనది’ అంటూ అప్పుడప్పుడు పత్రికల్లో వార్తలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే సంతోషకరమైన సమాజానికి బీజం పడుతుందనేది నా విశ్వాసం. అందుకే పిల్లల్లో సర్వతోముఖమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని భావించాను. బాల్యం సంతోషంగా ఉంటేనే పిల్లల్లో సానుకూలమైన ఎదుగుదల ఉంటుంది. అప్పుడే వారు చదువులోనూ, జీవితంలోనూ విజయం సాధించగలుగుతారు. ఇప్పుడైతే కార్పొరేట్ పాఠశాలలు కొన్నిటిలో జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. కానీ మా ట్రస్ట్ ఆరంభించిన సమయంలో ఇటువంటివి మన దేశంలోనే చాలా అరుదు. ఇక ప్రభుత్వ పాఠశాలల సంగతి చెప్పనక్కర్లేదు. వాటిలో చదివేది ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు భరించలేని సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలు. వారికి బోధించాల్సిన, నేర్పించాల్సిన అంశాలతో ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకున్నాం. గత పదేళ్ళుగా ఎప్పటికప్పుడు ఆ ప్రణాళికను సమీక్షించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నాం. క్రమశిక్షణ, విలువలు, నాణ్యమైన విద్య, జీవన నైపుణ్యాలు, ఆత్మరక్షణ, పౌర హక్కులు, విధులపై అవగాహన, దురుద్దేశంతో కూడిన స్పర్శపై బాలికల్లో చైతన్యం... ఇలా చాలా అంశాలు వీటిలో ఉన్నాయి. కోయంబత్తూరు జిల్లాలో, నగర పాలక సంస్థ పరిధిలో 143 పాఠశాలల్లో మేము తరగతులు నిర్వహిస్తున్నాం. కిందటి ఏడాది రైల్వేస్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశాక... నా పూర్తి సమయాన్ని ట్రస్టుకే కేటాయిస్తున్నాను. ఈ బోధనలన్నీ మా ట్రస్ట్ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా సాగుతున్నాయి.
చైతన్యం పెరిగేలా...
ప్రస్తుతం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న పదహారు ప్రాజెక్టుల్లో నేను భాగంగా ఉన్నాను. ఛైల్డ్ కేర్ రెస్పాన్స్ సెంటర్, స్మార్ట్ క్లాస్ రూమ్ హెల్ప్, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అత్యున్నత స్థానానికి ఎదగాలనుకొనే పిల్లల కోసం ఏరో, ఆస్ట్రో క్లబ్, యాక్టివ్ సిటిజన్‌షి్‌ప ట్రైనింగ్, మహిళల కెరీర్‌కు మార్గదర్శకత్వం అందించే కేంద్రం లాంటివి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ సమస్యను వీలైనంతగా నివారించడానికి ప్రయత్నిస్తున్నాం. కిందటి ఏడాది 105 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 30వేల మందికి పైగా విద్యార్థులకు కౌన్సెలింగ్, టెలీసర్వే నిర్వహింంచాం. కొవిడ్ సమయంలో 79 పాఠశాల్లో అన్‌లైన్ స్టూడియోలు ఏర్పాటు చేసి, తరగతులు నిర్వహించాం. కాలేజీ విద్యార్థులకు కూడా ప్రొఫెషనల్ కోర్సుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారిలో ఏడుగురు ‘నీట్’లో ఉత్తీర్ణులయ్యారు. అలాగే కొవిడ్ నియంత్రణ కోసం భద్రతా పరికరాలు, ఐసియు సౌకర్యాలు, ఆహారం, ఇతర అవసరాల కోసం జిల్లా అధికారులకు మా వంతుగా సహకారం అందించాం. ఇక, మహిళలు, బాలికల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధానంగా మా ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. తోటి విద్యార్థుల వల్లనే కాదు, ఇంట్లో, వీధుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడే చైతన్యం వారిలో కల్పిస్తున్నాం. ఎందరినో బాల్య వివాహాల బారి నుంచి తప్పించాం. అనేకమంది డ్రాపవుట్స్‌ను పాఠశాలల్లో చేర్పించాం. ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, బయోడీగ్రేడబుల్ నేప్‌కిన్ల పంపిణీ లాంటి చర్యలు చేపడుతున్నాం. మరోవైపు మహిళలకు వృత్తి శిక్షణ, ఉపాధి కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నాం. ట్రస్ట్ ద్వారా నేను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ‘నారీ శక్తి’, ‘ఉమెన్ అఛీవర్స్ అవార్డ్’తో సహా అనేక పురస్కారాలు అందుకున్నాను. క్రీడాకారిణిగా, ఉద్యోగిగా పొందిన సంతోషం కన్నా మా ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాల్లోనే ఎక్కువ ఆనందం దొరుకుతోంది. కొన్ని వేల మందికి ఒక దారి చూపించడం కన్నా... ఏ జీవితానికైనా సార్థకత ఏముంటుంది?’’
Updated Date - 2023-04-20T10:01:41+05:30 IST