Flight journey: విమాన ప్రయాణంతో చెవి నొప్పి?.. డాక్టర్ సమాధానమిదే..
ABN, First Publish Date - 2023-07-12T23:13:15+05:30
ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘బ్యారో అటైటిస్’ అంటారు. ఇది చెవిలో ఒత్తిడికి సంబంధించిన సమస్య. ‘బ్యారో’ అంటే ఒత్తిడికి సంబంధించిన అనీ, ‘అటైటిస్’ అంటే, చెవి ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం....
డాక్టర్! నేను తరచూ విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటాను. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో నా చెవిలో పోటు మొదలవుతూ ఉంటుంది. ఈ సమస్యకు ఏదైనా చికిత్స ఉందా?
- ఓ సోదరి, హైదరాబాద్.
ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘బ్యారో అటైటిస్’ అంటారు. ఇది చెవిలో ఒత్తిడికి సంబంధించిన సమస్య. ‘బ్యారో’ అంటే ఒత్తిడికి సంబంధించిన అనీ, ‘అటైటిస్’ అంటే, చెవి ఇన్‌ఫ్లమేషన్ అని అర్థం. 11 కిలోమీటర్ల ఎత్తు నుంచి విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మధ్య చెవికి సంబంధించిన ఈ సమస్య కొందర్లో వేధిస్తూ ఉంటుంది. బాహ్య వాతావరణానికి మన ఇంట్రా క్రేనియల్ ప్రెజర్ అడ్జస్ట్ కావలసి ఉంటుంది. చెవి దిబ్బెడ, నొప్పి, లేదా మన మాటలు మనకే బిగ్గరగా వినపడే ఆటోఫొనీ లాంటి లక్షణాలతో ఈ సమస్య వేధించవచ్చు. జలుబు చేసినా, అలర్జీలు ఉన్నా, ముక్కు నుంచి చెవికి ఉండే కనెక్షన్ ఒత్తిడికి తగ్గట్టు సంకోచ, వ్యాకోచాలకు గురి కాకపోయినా బ్యారో అటైటిస్ సమస్య వేధిస్తుంది. అయితే ఈ సమస్యను ప్రారంభంలో చిన్నపాటి చిట్కాలతో అదుపులోకి తెచ్చుకోవచ్చు.
ముక్కు మూసుకుని బుగ్గ ఊదడం: వేళ్లతో ముక్కు మూసుకుని బెలూన్‌ను ఊదినట్టుగా నోట్లోకి గాలిని లాక్కుని బుగ్గలు ఉబ్బేలా చేస్తే, గాలి చెవిలోకి చొరబడి, ఆ ఒత్తిడికి ముక్కు నుంచి చెవికి ఉండే కనెక్షన్ సంకోచ, వ్యాకోచాలకు లోనై సమస్య అదుపులోకి వస్తుంది. సాధారణంగా విమాన ప్రయాణాల్లో టాఫీలు, చూయింగ్ గమ్‌లు అందించడం వెనకున్న కారణం ఇదే!
ఆవిరి తీసుకోవడం: బ్యారో అటైటిస్ సమస్య ఉన్న వాళ్లు విమాన ప్రయాణానికి ముందు ఆవిరి తీసుకోవడం మంచిది. అలాగే హాజ్‌మోలా లాంటి వాటిని వెంట బెట్టుకుని విమానం ల్యాండ్ అయ్యే ముందు చప్పరించడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.
చికిత్సలు: ఈ సమస్య పదే పదే వేధిస్తుంటే, అందుకు కారణాలను సరిదిద్దుకోవాలి. అలర్జీలను యాంటీ హిస్టమిన్ మందులతో సరిదిద్దుకోవాలి. జలుబు, తుమ్ములు ఉంటే విమానం ఎక్కే ముందే యాంటీ హిస్టమిన్లు వేసుకోవాలి. విదేశాలకు విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు విమానం ల్యాండ్ అయ్యే అర గంట ముందు తీసుకోవాలి. వీటితో కూడా సమస్య పరిష్కారం కాకపోతే యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ హిస్టమిన్లు కలిపి తీసుకోవడం ద్వారా మూల కారణాలను సరిదిద్దుకోవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరికి ఈ సమస్య మూలంగా కర్ణభేరి కూడా పగిలిపోవచ్చు. కాబట్టి పరిస్థితి తీవ్రమై వినికిడి శక్తి కోల్పోకుండా ఉండాలంటే ఈ సమస్యను అశ్రద్ధ చేయకుండా వైద్యులకు చూపించుకుని సరిదిద్దుకోవాలి.
డాక్టర్ టి. సుధీర్ రెడ్డి, ఇ.ఎన్.టి సర్జన్,
త్రీ సెన్సెస్ ఇ.ఎన్.టి స్పెషాలిటీ క్లినిక్,
హబ్సిగూడ, హైదరాబాద్.
Updated Date - 2023-07-13T10:53:57+05:30 IST