స్ఫూర్తి గానం
ABN, First Publish Date - 2023-09-13T23:53:30+05:30
‘ఉద్యోగంలో స్థిరపడ్డాక క్షణం తీరిక దొరకదని అనుకొంటాం. కానీ... చిన్నప్పటి నుంచే మనం మార్కుల రేస్‌లో బిజీగా ఉంటాం. కెరీర్ గోల్స్ పెట్టుకొని...
సంగీతం ఆమె అభిరుచి. వేదికలెక్కి రాగయుక్తంగా ఆలపించాలనుకున్నారు.కానీ చదువు... ఆపై పోలీసు ఉన్నతాధికారిగా కొలువు... కర్తవ్య నిర్వహణలో పడి అభిరుచి మాయమైంది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత తనలోని గాయనిని తట్టి లేపారు. ఇప్పుడు ఆహూతుల సమక్షంలో ఆలాపనలే కాదు... సంగీత ప్రధానంగా సాగే డాక్యుమెంటరీ డ్రామాలోనూ నటించి మెప్పించారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే... గళ మాధుర్యంతో అభిమానధనం సంపాదించుకున్న ముంబయి డీసీపీ రూపాలి అంబూరె ప్రయాణం ఇది.
‘‘ఉద్యోగంలో స్థిరపడ్డాక క్షణం తీరిక దొరకదని అనుకొంటాం. కానీ... చిన్నప్పటి నుంచే మనం మార్కుల రేస్‌లో బిజీగా ఉంటాం. కెరీర్ గోల్స్ పెట్టుకొని... వాటిని ఛేదించే తాపత్రయంలో మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయని, అవీ ముఖ్యమేనని మరిచిపోతుంటాం. అందరిలా నాదీ అదే కథ. మహారాష్ట్ర రాజధాని ముంబయి మహానగరం మాది. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. దానికి కారణం... మా నాన్న గాయకుడు కావడమే. ఆయనను చూస్తూ నాకు కూడా సంగీతంపై రోజు రోజుకూ ప్రేమ ఎక్కువైంది. కొన్నేళ్లు సాధన కూడా చేశాను. కాకపోతే పై తరగతులకు వెళ్లేసరికి చదువుపైనే పూర్తి శ్రద్ధ పెట్టాల్సిరావడంతో సంగీతాన్ని పక్కన పెట్టేశాను. చదువు అయిపోగానే 2005లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ అమరావతి (మహారాష్ట్ర) రూరల్‌లో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా. ఆ తరువాత బీట్ ఇన్‌చార్జి, పీఎస్ ఇన్‌చార్జి, పలు కమిషనరేట్స్‌లో సబ్‌డివిజనల్ పోలీస్ అధికారిగా మహారాష్ట్ర అంతటా వివిధ హోదాల్లో పని చేశాను. నాసిక్‌లోని ‘మహారాష్ట్ర పోలీస్ అకాడమీ’లో అసిస్టెంట్ డైరెక్టర్- అవుట్‌డోర్స్ (ఏడీఓడీ)గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిని నేనే. ప్రస్తుతం థానే పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఎడతెరిపిలేని పని ఒత్తిడిలో నాకంటూ ఒక జీవితం ఉండాలనే విషయమే గుర్తుకురాలేదు.
ఫిట్‌నెస్ కోసం...
వృత్తి జీవితంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే నా వివాహం అయింది. మాకు ఇద్దరు పిల్లలు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక అస్సలు ఖాళీనే ఉండేది కాదు. ఇంటి పనులు, పిల్లలతో సరిపోయేది. వాళ్లు కాస్త పెరిగి పెద్దయ్యాక కానీ నాకు ఇంట్లో తీరిక దొరకలేదు. ఉద్యోగంలో చేరే వరకు ఫిట్‌నెస్ మీద శ్రద్ధ పెట్టేదాన్ని. బడి రోజుల్లో నేను మంచి రన్నర్‌ను కూడా. చాలా మారథాన్‌లలో పాల్గొన్నాను. పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకొనే సమయంలో రోజూ ఉదయం, సాయంత్రం డ్రిల్స్ తదితర ఫిజికల్ ట్రైనింగ్ సెషన్స్ ఉండేవి. ఎప్పుడైతే పోస్టింగ్ ఇచ్చారో... ఇక అప్పటి నుంచి పనిలో పడి నన్ను నేను మరిచిపోయాను. ఇది సరైంది కాదనిపించింది. ఫిట్‌నెస్ పెంచుకోవాలనుకున్నాను. జిమ్‌కు వెళితే... అక్కడ అందరూ మగవారే. వాళ్ల మధ్య నేనొక్కదాన్నే మహిళను. వింతగా చూసేవారు. నా గురించి ఏవేవో మాట్లాడుకొనేవారు. ఏవీ పట్టించుకోలేదు.
స్ఫూర్తి నింపాలని...
నాలాగా ఇంకా ఎంతో మంది మహిళలు జిమ్‌కు రావాలనుకొంటారు. కానీ చుట్టూ మగవారు ఉంటారని జంకుతారు. అలాంటివారిలో స్ఫూర్తి నింపాలని అనుకున్నాను. దాని కోసం నేను జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాను. వాటిని చూసి చాలామంది ఆడపిల్లల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘మీ స్ఫూర్తితో జిమ్‌కు వెళుతున్నాం’ అంటూ ఎంతోమంది స్పందించేవారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు నుంచి నా వర్కవుట్స్‌కు విరామం ఇచ్చిన సందర్భాలు చాలా అరుదు. వ్యాయామం నా జీవితంలో భాగమైపోయింది. రోజూ ఉదయం రెండు గంటలు తప్పనిసరిగా జిమ్‌లో గడుపుతాను. అందుకే మానసికంగానే కాదు... శారీరకంగా కూడా దృఢంగా ఉండగలుగుతున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. ఆ మార్పు ద్వారా మరికొందరికి మార్గదర్శకం చేయగలిగాను.
అలా మొదలైంది...
ఏ లోటూ లేకుండా జీవితం సాఫీగా సాగిపోతోంది. కానీ ఏదో వెలితి. అదేంటంటే... చిన్నప్పుడు వదిలేసిన సంగీతం. మంచి గాయని కావాలని, వేదికలెక్కి ప్రదర్శనలివ్వాలని ఎప్పుడూ కలలు కనేదాన్ని. ఇన్నేళ్ల తరువాత నాలో నిద్రాణంగా ఉన్న ఆ కోరిక ఊపిరి పోసుకుంది. బరువు, బాధ్యతలని ఆలోచిస్తే ఈ జీవితంలో ఎప్పటికీ మనం అనుకున్నది సాధించలేమని అనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను. దాంతో రెండేళ్ల కిందట తిరిగి శాస్త్రీయ సంగీత సాధన మొదలుపెట్టాను. పండిట్ పరేష్ జన శిష్యరికంలో కచేరీలు ఇచ్చే స్థాయికి ఎదిగాను. ప్రముఖ గజల్ కళాకారుడు పంకజ్ ఉదాస్ గురువు ఆయన.
గురువు సారథ్యంలో...
ఉదయం ఐదు గంటలకు నా దినచర్యలు మొదలవుతాయి. ముందుగా ఒక గంట సంగీత సాధన. అది అవ్వగానే జిమ్. వర్కవుట్స్ ముగించుకొని వచ్చి... ఇంటి పనులు చూసుకొంటాను. తరువాత ఆఫీ్‌సకు బయలుదేరతాను. ఇక ఇంటికి ఎప్పుడు వస్తానన్నది అక్కడ ఉన్న పని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా నా సంగీత సాధన, వ్యాయామం ఆగవు. పోలీస్ ఉత్సవాలు, ఈవెంట్స్‌తో పాటు ఇతర వేదికల్లో కూడా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. మరాఠీ సంగీతంతో పాటు హిందీ పాటలు కూడా పాడుతుంటాను. అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటాను.
వీడియో ఆల్బమ్...
ఇటీవలే మా గురువు గారి నేతృత్వంలో ‘రాగ్ గౌడ్ మల్హర్’ పేరుతో డాక్యుమెంటరీ డ్రామా ఒకటి తీసుకువచ్చాం. ‘గౌడ్ మల్హర్’ అనేది హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలోని ఒక రాగం. ఆ రాగానికి రూపం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో చేసిన ప్రయోగాత్మక ఆల్బమ్ ఇది. మరికొంతమంది కళాకారులతో కలిసి రూపొందించాం. అందులో నేనే నటించాను. అలా మొదటిసారి నన్ను నేను తెర మీద చూసుకున్నాను. నేను వద్దంటే గురువుగారే చేయమన్నారు. ఆయన మాట కాదనలేక ముఖానికి మేకప్ వేసుకున్నాను. దానికి అద్భుత స్పందన వచ్చింది. త్వరలోనే మరికొన్ని ప్రాజెక్ట్‌లు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఒక పోలీస్ అధికారిగా ప్రతి క్షణం నాకు విలువైనది. అదే సమయంలో మన కోసం మనం కొంత సమయం కేటాయించడం కూడా ఎంతో ముఖ్యం. మనసుంటే మార్గం ఉంటుందని అంటారు కదా. నేను దాన్ని నమ్ముతాను.’’
Updated Date - 2023-09-13T23:53:30+05:30 IST