ప్రజల ఆరోగ్యం ఏమయ్యేట్టు?
ABN, First Publish Date - 2023-07-21T00:55:38+05:30
సూక్ష్మజీవులూ శక్తిమంతమైనవే. అనారోగ్యం వాటిల్లినప్పుడు, అంటు వ్యాధులు ప్రబలినప్పుడు మనం తీసుకునే యాంటీ బయోటిక్స్ (రోగకారక సూక్ష్మజీవి నాశక ఔషధాలు) అంతకంతకూ నిరర్థకమైపోతున్నాయి...
సూక్ష్మజీవులూ శక్తిమంతమైనవే. అనారోగ్యం వాటిల్లినప్పుడు, అంటు వ్యాధులు ప్రబలినప్పుడు మనం తీసుకునే యాంటీ బయోటిక్స్ (రోగకారక సూక్ష్మజీవి నాశక ఔషధాలు) అంతకంతకూ నిరర్థకమైపోతున్నాయి. ఆ మందులను తట్టుకుని మనుగడ సాగించగల సామర్థ్యాన్ని సూక్ష్మజీవులు పెంపొందించుకుంటున్నాయి. ఈ పరిణామాన్నే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎఎమ్ఆర్) అంటున్నారు. యాంటీ బయోటిక్స్‌ను మితిమీరిన స్థాయిలో ఉపయోగించడం లేదా దుర్వినియోగపరచడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. యాంటీ బయోటిక్స్‌కు వ్యతిరేకంగా రోగకారక సూక్ష్మజీవులు ఉత్పరివర్తనం చెంది, రక్షక వ్యవస్థను అభివృద్ధిపరచుకుంటున్నాయి. వాటి ఈ యాంటీ బయోటిక్ నిరోధక శక్తి నేడు మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటిగా నిపుణులు గుర్తించారు. ప్రాణరక్షక మందుల అశక్తత కారణంగా 2019లో దాదాపు యాభై లక్షల మంది మరణించినట్టు ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడయింది.
సమస్య ఇంత మాత్రమే కాదు. మనం మన ప్రస్తుత ఔషధాల నిల్వలను పదిలపరచుకోవడం లేదు. పైగా ప్రజల వినియోగానికి కొత్త యాంటీ బయోటిక్స్ సరఫరా శుష్కించి పోతోంది. అసలు ఇప్పటికే పూర్తిగా శుష్కించి పోయిందన్నా సత్యదూరం కాదు. కారణమేమిటి? వివిధ రోగాల భారిన పడినప్పుడు ప్రజలకు అవసరమైన యాంటీ బయోటిక్స్‌ను అభివృద్ధిపరిచే వాణిజ్య కార్యకలాపాల నుంచి ప్రపంచ అగ్రగామి ఫార్మస్యూటికల్ కంపెనీలు అన్నీ వైదొలుగుతున్నాయి. పర్యవసానమేమిటి? ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి సమీప భవిష్యత్తులోనే మనం మూడు విధాలుగా ముప్పునెదుర్కోవలసి రావడం అనివార్యమవనున్నది. ఒకటి– ఇప్పుడు మనకు తెలిసిన యాంటీ బయోటిక్స్ క్రమంగా నిరర్థకమై పోతాయి; రెండు–కొత్త యాంటీ బయోటిక్స్ లభ్యమయ్యే అవకాశం లేదు; మూడు– ఈ ఔషధాలను సమస్త ప్రజలకూ అందుబాటులో ఉంచవలసిన అవసరం ఉంది. ఈ అవసరం అనూహ్యంగా సంభవిస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ ఆకస్మిక అవసరం ఒక భయానక ఆరోగ్య అత్యవసర పరిస్థితి. ఇది, ఇటీవలి కొవిడ్ సంక్షోభంతో సహా మనం ఇంతకు ముందెన్నడూ చవిచూడని తీవ్ర విపత్కరమైనదిగా ఉంటుందనడంలో సందేహం లేదు. మరి మనం ఆ దారుణ ఆపదను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామా?
పెన్సిలిన్ మొట్టమొదటి యాంటీ బయోటిక్. 1928లో కనుగొన్న ఈ డ్రగ్‌ను ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరం భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ప్రారంభమయింది. తదాది ప్రపంచ ప్రజలు యాంటీ బయోటిక్స్‌పై ఆధారపడడం సాధారణమైపోయింది. మరిన్ని కొత్త యాంటీ బయోటిక్స్‌ను కనిపెట్టడం, ఉపయోగించుకోవడం జరిగింది. అయితే 1980వ దశకంలో యాంటీ బయోటిక్స్ అభివృద్ధి స్తంభించిపోయింది. కొత్త రోగ కారక సూక్ష్మజీవులను కనిపెట్టడం జరగలేదు. అయితే పాత యాంటీ బయోటిక్స్‌నే సరి కొత్త పద్ధతుల్లో రూపొందించడం ప్రారంభమయింది. ఇక్కడే సమస్య మొదలయింది. ఈ సరికొత్త యాంటీ బయోటిక్స్‌ను ప్రతిఘటించే శక్తిని సూక్ష్మజీవులు పెంపొందించుకున్నాయి. గతంలో సత్వర ఫలితాలనిచ్చిన ఔషధాలు తమ ప్రభావ శీలతను కోల్పోయాయి. కారణమేమిటి? సంక్లిష్ట కణ కుడ్యాలు గల సూక్ష్మజీవులు పెచ్చరిల్లడమే. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే సరికొత్త యాంటీ బయోటిక్స్‌ను అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరమున్నది. అంతేకాదు, వాటిని ప్రపంచ వ్యాప్తంగా సమస్త ప్రజలకు అందుబాటులో ఉంచడం కూడా చాలా ముఖ్యం. కొత్త యాంటీ బయోటిక్స్‌ను అభివృద్ధిపరచడంపై అగ్రగామి ఔషధ ఉత్పత్తి సంస్థలు కాకుండా విశ్వవిద్యాలయాలు, చిన్న వాణిజ్య సంస్థలే ఎక్కువ శ్రద్ధ చూపడం ఒక విచిత్రమైన విషయం. వివిధ దశల్లో ఉన్న పలు కొత్త ఔషధాలను 50 మంది కంటే ఎక్కువ సిబ్బంది లేని ఫార్మా సంస్థలే రూపొందిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
మరి బిగ్ ఫార్మా (బహుళజాతి ఔషధ ఉత్పత్తి సంస్థలు) కొత్త యాంటీ బయోటిక్స్ సృష్టికై పరిశోధన, అభివృద్ధిలో ఎందుకు పెట్టుబడులు పెట్టడంలేదు? చిన్న సంస్థలు రూపొందించిన కొత్త ఔషధాలను ప్రపంచ విపణికి ఎందుకు తీసుకువెళ్లడం లేదు? ఆ కొత్త కల్పనల ఆధారంగా మరింత బృహత్తరమైన కొత్త మార్పులు తీసుకువచ్చే విషయమై ఎందుకు శ్రద్ధచూపడం లేదు? దురదృష్టమేమిటంటే ఇతర మందుల ద్వారా అపరిమిత లాభాలు ఆర్జిస్తున్న ఈ కంపెనీలు అసలు యాంటీ బయోటిక్ వాణిజ్యం నుంచే వైదొలుగుతున్నాయి! కొత్త యాంటీ బయోటిక్స్‌ను అభివృద్ధిపరిచేందుకు అవుతున్న వ్యయం భరించ లేనంత భారీగా ఉండడంతో పాటు పలు సంకటాలను ఎదుర్కోవలసివస్తోందని ఫార్మస్యూటికల్ కంపెనీలు చెప్పుతున్నాయి. అసలు కారణం ఇది కానే కాదు. కేన్సర్, డయాబెటిస్ ఇత్యాది వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ద్వారా అధిక లాభాలు సమకూరుతుండడం వల్లే కొత్త, అత్యవసర యాంటీ బయోటిక్స్ అభివృద్ధి పట్ల అవి ఉపేక్ష వహిస్తున్నాయి. కేవలం కొన్ని లక్షల మందికి మాత్రమే సోకే అత్యంత అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి ద్వారా ఫార్మా కంపెనీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ మందుల ధరలు వేలు, లక్షల రూపాయల్లో ఉన్నప్పటికీ సదరు వ్యాధుల చికిత్సలో తప్పనిసరి గనుక వివిధ కంపెనీలు వాటి ఉత్పత్తికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ కారణంగానే, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజలకు సోకే వ్యాధుల నివారణకు తోడ్పడే యాంటీ బయోటిక్స్ వాణిజ్యం నుంచి ఫార్మా కంపెనీలు నిష్క్రమిస్తున్నాయి. ఇంతకు ముందే చెప్పినట్టు ఇతర మందుల ద్వారా అపరిమిత లాభాలు ఆర్జిస్తున్న సమయంలోనే ఈ నిష్క్రమణ జరగడం గమనార్హం. ఇలా అయితే ప్రజల ఆరోగ్యం ఏమయ్యేట్టు?
ఇదొక విపత్కర పరిస్థితి, సందేహం లేదు. ఈ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అధిగమించేందుకు యాంటీ బయోటిక్స్ అభివృద్ధి, ఉత్పత్తిలో కొత్త పుంతలు తొక్కాలి. యాంటీ బయోటిక్స్‌ను ప్రపంచ ప్రజల ఆరోగ్య శ్రేయస్సునకు అవసరమైన వస్తువులుగా పరిగణించాల్సిన సమయమాసన్నమయింది. (ఆర్థికశాస్త్ర పరిభాషలో వాటిని పబ్లిక్ వస్తువులు లేదా సామాజిక వస్తువులు అంటారు). ఇందుకు, ఫార్మా కంపెనీల లాభాలపై కొత్త పన్నులు విధించాల్సి ఉంటుంది. అలాగే ప్రజల ఆరోగ్య రక్షణకు దోహదం చేసే పరిశోధనలకు అవసరమైన సదుపాయాలను అభివృద్ధిపరచవలసి ఉంటుంది. యాంటీ బయోటిక్స్ ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడంలో మార్కెట్లు విఫలమైనా మనం విఫలం కాగూడదు.
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్, ‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
Updated Date - 2023-07-21T00:55:38+05:30 IST