ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కథగా మిగిలిన శ్రీరమణ

ABN, First Publish Date - 2023-07-20T01:54:17+05:30

నాకుతెలిసి కళ్ళల్లో కళ్ళుపెట్టి మాట్లాడని చాలామంది రచనారంగాన్ని అలవాటు చేసుకుంటారు. వారు ఇతరులతో మాట్లాడాల్సిదంతా కాగితం మీదపెట్టి మాట్లాడతారు...

నాకుతెలిసి కళ్ళల్లో కళ్ళుపెట్టి మాట్లాడని చాలామంది రచనారంగాన్ని అలవాటు చేసుకుంటారు. వారు ఇతరులతో మాట్లాడాల్సిదంతా కాగితం మీదపెట్టి మాట్లాడతారు. అందుకే పుస్తకాలు మాట్లాడతాయి అంటాను. శ్రీరమణగారి ఏ పుస్తకాన్ని ముట్టుకున్నా గలగలా మాట్లాడుతుంది. మీ బాల్యాన్ని గుర్తుచేస్తుంది. మీ భావోద్వేగాలను రెచ్చగొడుతుంది. మిమ్మల్ని నవ్విస్తుంది. మీచేత్తో మీ కన్నీరు తుడిచి, మిమ్మల్ని ఓదారుస్తుంది. అందుకే వారి కథలకీ, కబుర్లకీ అనేకమంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల్లో నేనూ ఒకణ్ణి.

మద్రాసులో మొదటిసారి శ్రీరమణని చూశాను. ఆరుద్రగారి ఇంటి కారుషెడ్డురూంలో సన్నగా తెల్లగా ఉన్న ఓ మనిషి, ఆరుద్రతో మాట్లాడుతూ ఉండగా, నేను ఆరుద్రకి నమస్కరించి, ఆ మనిషిని ఎవరన్నట్టుగా చూశాను. నా చూపు గమనించారేమో, ‘శ్రీరమణ’ అంటూ పరిచయం చేశారు. ‘‘మీ పేరడీలు నాకు చాలా ఇష్టం సార్. వర్షంలో వేడివేడి చేగోడీలు తింటూ, వాలుకుర్చీలో కూర్చుని ఆంధ్రజ్యోతిలో మీ పేరడీలు చదవడం బలేగా ఉండేది. ఓసారి ఏమైందంటే...’ అని నేను ఇలా చెబుతున్నానో లేదో... ‘మీరు చెప్పింది నిజమే! శర్మగారు నన్ను పాత్రని చేసేశారు. కథలో కలిపేసుకున్నారు’ అని గొల్లున నవ్వారు శ్రీరమణ, ఆరుద్ర కూడ నవ్వారు. నాపేరు శర్మ అనీ, నేను అక్కడకి వస్తున్నాననీ ఆరుద్ర ముందే చెప్పి ఉంటారు. దానితో పాటు నా కలుపుగోలుతనం కూడా చెప్పారేమో, శ్రీరమణ చమత్కరించారలా.

తర్వాత ఒకటిరెండుసార్లు సినిమా స్టూడియోల్లో కలుసుకున్నాం. కాని పెద్దగా మాట్లాడుకున్నదిలేదు. చాలా రోజులకి హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్లో కలుసుకున్నాం. బాపురమణలతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా శ్రీరమణ వచ్చారక్కడకి. భాగవతం సీరియల్ తీస్తున్నాం అన్నారు. బాపుగారి హ్యాండ్ రైటింగ్‌తో ఉన్న ‘మిథునం’ కథ నాకిచ్చి, చదవండి అన్నారు. వీలయితే దీనిని ఓ షార్ట్ ఫిలిమ్ తీద్దామన్నారు. ఆయన ఆశ నిరాశ అయిందక్కడ.

తొమ్మిదేళ్ళు గడచిపోయాయి. శ్రీరమణ నవ్య వారపత్రికకు ఎడిటరయ్యారు. నేను రిసోర్స్ ఎడిటరయ్యాను. ఇద్దరం సెక్షన్‌లో ఎదురుబొదురుగా కూర్చునేవాళ్ళం. కథలూ, కబుర్లూ కోకొల్లలుగా మాట్లాడుకునేవాళ్ళం. అయినా రమణ అంతర్ముఖుడే అనుకునేవాణ్ణి. ఎందుకలా అనుకునేవాణ్ణంటే... అంతర్ముఖులే వర్డ్ ఎకనమిస్ట్స్ అవుతారు. అందుకే వారి వీక్లీ సంపాదకీయాలు, శీర్షికలూ చిన్నచిన్నవిగా, చిద్విలాసంగా ఉండేవి. మనిషి మొహమాటస్తుడిలా కనిపించినా ఓ మహాప్రపంచాన్ని గుండెల్లో దాచుకున్నట్టుగా ఉండేవారు. నడివయసుకష్టాల గురించి సంభాషిస్తూ జీవితంలో నడివయసూ, సమాజానికీ మిడిల్ క్లాసూ గొప్ప శత్రువులన్నారోసారి శ్రీరమణ. ఈ మధ్యతరగతి పాఠకులకి ఏంకావాలో ఒకంతటికి అంతుబట్టదని, వారపత్రిక సర్క్యులేషన్ పెంపువిషయమై తలపట్టుకున్నారు.

రచయితగా మీరు వృత్తిరీత్యా రాసిందే ఎక్కువనుకుంటాను. ప్రవృత్తిరీత్యా రాసింది చాలా తక్కువంటాను, ఏవంటారన్నాను శ్రీరమణని. నిజమేనన్నారు. ‘కొంచెం బద్ధకిస్టునే, రాయడం కోసం యుద్ధంచెయ్యడం నాకిష్టం ఉండదు. యుద్ధంచెయ్యాల్సివస్తే ఛస్తే రాయను. ఇంకో పని ఏదైనా చేసుకుంటాను. రాత నిర్బంధం కాకూడదు’ అన్నారు. మరణం గురించి మాట్లాడుతూ ‘ఎలాంటి హడావుడీ లేకుండా మబ్బుతొలగినట్టుగా నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి. ఎవరినీ ఇబ్బందికి గురిచెయ్యకూడదు’ అనేవారు. కాని ఆయన కోరిక నెరవేరలేదు. ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉన్నాయి. రెండురోజులుగా ముసురు. ముసురువేళే ముగిసిపోయారాయన.

కండపుష్టిలేదుగాని, శ్రీరమణగారికి తిండిపుష్టి ఎక్కువనిపించేది. మామిడి అల్లం ముక్కలూ, కొత్త ఆవకాయ గురించి మహాప్రీతిగా చెప్పేవారు. సెక్షన్లో అందరికీ మామిడిఅల్లం ముక్కలనీ, కొత్త ఆవకాయనీ తెచ్చి ఇచ్చేవారు. తనకి షుగరంటూ నేరేడుపళ్ళని తెచ్చుకుని తినేవారు. ‘ఇది అన్యాయం అండీ! నాకివ్వకుండా మీరు తినడం’ అంటే... ‘మీకు షుగర్ రానీయండి, ఇస్తాను.’ అనేవారు. నాకు షుగరొచ్చింది. గుప్పెడు నేరేడుపళ్ళు అప్పుడిస్తూ... తెలుగు కథల్లాగా నవనవలాడుతున్నాయి కదూ? అని నవ్వారు.

చరిత్రను మరచిపోకూడదంటే దానిని కథలుగా చెప్పాలి. చెబితే ఎన్నటికీ ఎవరూ మరచిపోరు. అలాగే ఈ తెలుగుకథా ప్రపంచంలో కథకునిగా శ్రీరమణ మహాశక్తిమంతుడు. అతనిని తెలుగుభాష మరచిపోదు.

జగన్నాథశర్మ

Updated Date - 2023-07-20T01:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising