ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21వ శతాబ్దం ఇప్పుడు మొదలవుతోందా?

ABN, First Publish Date - 2023-03-19T01:19:08+05:30

గోడ మీద కేలండర్లు, టేబుల్ మీద డైరీలు మారినప్పుడే కాలం మారినట్టు కాదు. కేలండర్ ప్రకారం మనం 21వ శతాబ్దంలో ప్రవేశించి 23 ఏళ్లవుతోంది. అప్పుడు మనలో చాలమంది ఏం మారింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గోడ మీద కేలండర్లు, టేబుల్ మీద డైరీలు మారినప్పుడే కాలం మారినట్టు కాదు. కేలండర్ ప్రకారం మనం 21వ శతాబ్దంలో ప్రవేశించి 23 ఏళ్లవుతోంది. అప్పుడు మనలో చాలమంది ఏం మారింది, లోకం ఏమీ మారలేదు అనుకున్నాం. అదే అమెరికా, అదే రష్యా, చైనా, ఇండియా, పాకిస్థాన్... అనుకున్నాం. ఇప్పుడు నిజంగానే ప్రపంచం మారుతోంది. ఇది ఆధునిక (మోడర్న్) ప్రపంచం కాదు, ఉత్తరాధునిక (పోస్ట్ మోడర్న్) ప్రపంచం. అది ఎట్లన్నన్....

యుక్రెయిన్ భూభాగం మీద రష్యా, నాటో యుద్ధం దాదాపు పూర్తయినట్టే. భూభాగాలకు సంబంధించి ఇప్పుడున్న స్థితి ఇక చాల కాలం కొనసాగుతుంది. ఇండియా పాకిస్థాన్‌ల మధ్య ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని మనం, ‘ఆజాద్ కశ్మీర్’ అని వాళ్లు వ్యవహరించే భూభాగం అప్పట్నించి అలానే ఉండిపోలేదూ? ఇలాంటి ‘ఘర్షణల’కు ఒక ముగింపు అంటూ ఉండదు. ఎప్పటికో ఘర్షణలు బలహీనపడి చరిత్రలో కరిగిపోతాయి.

గెలుపోటములూ, వాటి పరిణామాలే చరిత్రలో ఉంటాయి. పాప పుణ్యాలూ మట్టీ మశానం ఏమీ ఉండవు. అధ్యక్షుడిగా మారిన కమెడియన్ వొలీదిమీర్ జెలెన్స్కీ ఇకముందు ఒక విలన్‌గానే యుక్రేనియన్ల మనసుల్లో మిగిలిపోతాడు. యుక్రేనియన్ అంతరంగం ఈ అపజయానికి అతడిని క్షమించదు. వ్లాదిమీర్ పుతిన్ రానున్న రష్యన్ ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో గాని, చేస్తే ఘన విజయం సాధిస్తాడు. ఈ యుద్ధ సమయంలో జరిగిన రాజకీయార్థిక పరిణామాలు మరింత కీలకమైనవి. అవి మనకు కూడా– మనమంటే, ఇది రాస్తున్న, నాకు చదువుతున్న, మీకు కూడా– చాల కీలకమైనవి. మనం ఒక కొత్త ప్రపంచంలో బ్రతకబోతున్నాం.

వార్తల్లో ఉన్న మరో విషయం: ఆంక్షలతో రష్యాను దెబ్బతీయబోయిన అమెరికా తానే పెద్ద దెబ్బతింటున్నది. రవి ఎప్పుడో అస్తమించిన మాజీ వలసవాద బ్రిటన్, ఫ్రాన్స్ కూడా అమెరికాతో పాటు దెబ్బతిన్నాయి, ఇంకా తింటున్నాయి. ‘ఆధునికత’ కథ ఒక కొలిక్కి వొస్తోంది. అమెరికా, క్యాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (సివిబి), న్యూయార్క్‌లోని సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలాయి. దానికి కారణం వాటి మిస్మేనేజ్మెంటు అంటున్నారు. కాదు సంక్షోభం కారణమని మరికొందరు అంటున్నారు. ప్రభుత్వ జోక్యంతో వాటి డిపాజిటర్లు గండం గడిచి గట్టెక్కినట్టున్నారు. తర్వాత, మన సునాక్ రుషి వర్యుని నాయకత్వంలోని ‘ఐక్య రాజ్యం’ (యునైటెడ్ కింగ్డమ్), ఆఫ్రికన్ నెత్తుటితో తడిసి రుచి తప్పిన ఫ్రెంచి మద్యం, సందట్లో సడేమియా అన్నట్టు పాలస్తీనాలో ఇజ్రాయిలీ రాజ్య–టెర్రరిజం... ఏది ఏమవుతుందో చెప్పలేం. జర్మనీతో సహా, చాల చోట్ల యుద్ధానికి నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

బహుశా వీటన్నిటి కన్న, యుద్ధ పర్యవసానాల కన్న, పెద్ద పరిణామం: చైనా దౌత్యం ఫలించింది. ఇరాన్, సౌదీ అరేబియా దేశాలు తమ మధ్య షియా సున్నీ విభేదాల్ని పక్కన పెడుతున్నాయి. దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంటున్నాయి. త్వరలో మిగతా మధ్యప్రాచ్య దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరిగి, వాటి మధ్య ఐక్యత ఒక రూపం తీసుకుంటోంది. అదీ చైనా, రష్యాల అండదండలతోనే. ‘బ్రిక్స్’ (‘బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా’ కూటమి) విస్తరణలో ఈ మిడిలీస్ట్ దేశాలు భాగం అవుతాయి. ఈ పరిణామాలు చిన్నా చితకవి కావు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ‘పెట్రో–డాలర్ ఆర్థికం’ మీద ఆధారపడి తయారైన ఒక ‘వరల్డ్‌ ఆర్డర్’ కుప్పకూలుతున్నది. సందేహం లేదు. ప్రపంచానికి ఇప్పుడు 20వ శతాబ్ది ముగిసి 21వ శతాబ్దం మొదలవుతోంది. దీనికి యుక్రెయిన్ యుద్ధం పెద్ద సంకేతం. ఇదొక మైలురాయి.

21వ శతాబ్ది ప్రారంభానికి మరో పేరు: బహు కేంద్రక ప్రపంచం. (మల్టీ సెంటర్డ్ లేదా మల్టీ పోలార్ వర్ల్డ్‌). ఇక ప్రపంచానికి ఒక ‘కేంద్రం’... ‘ఒకే’ కేంద్రం... ఉండబోదు. ఒక బహు–కేంద్రక ప్రపంచంలో జీవించబోతున్నాం. ఇప్పటికే జీవిస్తున్నామని చెప్పినా, అదేం ఎక్కువ మాట కాదు. దేవుడో, మానవుడో; అమెరికాయో, రష్యాయో; కేపిటలిజమో, పెట్టుబడిదారీ విధానమో.... ఏదో ఒకటి కేంద్రంగా, మరొకటి పోటీ కేంద్రంగా ఉండడం ఆధునికత (మోడర్నిజం). ఒకటి రెండు కాదు, పలు కేంద్రాలు ఉండడం... అంటే, ప్రాక్టికల్‌గా ప్రపంచ గతిని శాసించే బలమైన కేంద్రమేదీ లేకపోవడం... ఉత్తరాధునికత (పోస్ట్ మోడర్నిజం).

ఉత్తరాధునిక ప్రపంచంలోని బహు కేంద్రక స్థితికి మరో పేరు ముక్కలు ముక్కల జీవితం (ఫ్రాగ్మెంటేషన్). సమాజంలో పేద, ధనిక... రెండు వర్గాలే ఉన్నాయి అనే భావన దాదాపు ఆధునిక యుగమంతటా వర్ధిల్లింది. ఇప్పుడు పేదల్లో రెడ్డి పేద, మాదిగ పేద ఒకటి కాదు. వాళ్లిద్దరు ఒకటి అనడం అంటే మాదిగ పేద నెత్తిన వ్రేలాడే కులం కత్తికి ఆయనను బలి చేయడమే అని దళితులు అంటున్నారు. బుద్ధి ఉన్న వారెవరూ ఆ మాటను కాదనలేరు. (అందరికీ అంబేడ్కర్ ఆశీస్సులు కావాలి మరి). అలాగే మగ పేద, ఆడ పేద ఒకటే అనడం అంటే స్త్రీల మీద మగాళ్ల లీగల్, ఇల్లీగల్ హింసను మన్నించడమేనని స్త్రీలు అంటున్నారు. మనసున్న వారెవరూ వారి మాట తప్పు పట్టలేరు.

సామాజిక సమూహాలే కాదు. బడుగు దేశాలు... ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో పేద దేశాలు ప్రపంచ పెద్దన్న మాట కాదని తమలో తాము సంఘాలు పెట్టుకుంటున్నాయి. సంఘటితమవుతున్నాయి. రష్యా, చైనాలు... వాటి పాలన వ్యవస్థలు ఏవైనా... అందులో ప్రజాస్వామ్య కాంక్షలకు చోటిచ్చి, ఆర్థికంగా పెట్టుబడిదారీ పద్ధతులనే అనుసరిస్తున్నాయి. ఆ సమాజాలు ఇనుపతెరలు మూసుకుని ఉండిపోవడం లేదు. తలుపులు తెరిచాయి. మాస్కోలో మెక్డొనాల్డ్ షాపులు వెలిశాయి. రష్యా చైనా దేశాలు పెట్టుబడిదారీ పద్ధతులను నామ్‌కే వాస్తే అనుసరించి ఊరుకోవడం లేదు. పెట్టుబడిదారీ పద్ధతుల్లో అమెరికాను, పశ్చిమ దేశాలను (ఉమ్మడిగానూ, వేర్వేరుగానూ) సవాలు చేస్తున్నాయి. ఈ సవాళ్ల ఫలితమే, అందులో వాటి శక్తి యుక్తుల ఫలితమే... ఎప్పటినుండో ఇరాన్ తదితర దేశాల మీద, కొత్తగా రష్యా, చైనాల మీద, అమెరికా ప్రయోగించిన వాణిజ్య ఆంక్షలు బెడిసికొట్టాయి. ఆంక్షల దెబ్బ... దెబ్బ కొట్టివాళ్లకే ఎక్కువగా తాకింది. ఇకముందు పశ్చిమానికి వాణిజ్య ఆంక్షల వంటి పరికరాలుండవు. పని చేయవు.

మంచికో చెడుకో రష్యాను ఒక కుదుపు కుదిపి, ఒక మలుపు తిప్పిన మాజీ అధ్యక్షుడు మిహాయిల్ గోర్బచేవ్. ఆయన రూపొందించిన ‘గ్లాస్ నోస్త్’, ‘పెరిస్త్రోయికా’ విధానాల కింద రష్యా ఇనుప తలుపులు భళ్లున తెరుచుకున్నప్పుడే, జర్మనీ దేశాన్ని రెండుగా చీల్చిన బెర్లిన్ గోడ కూలిపోయినప్పుడే... ఇక ఏ వైరుధ్యాలు, ఏ అడ్డంకులు లేకుండా ప్రపంచ ప్రజాస్వామ్యం పురోగమిస్తుందని లోకం అనుకుంది. ‘వార్సా ఒప్పందం’ పేరిట, రష్యా నేతృత్వంలో పని చేసిన ‘ఎర్ర’ సైనిక కూటమి ఇక లేదు. ప్రపంచానికి ‘కమ్యూనిజం ప్రమాదం’ లేదు. అందువల్ల, నాటో అవసరం కూడా ఉండదని అందరూ అనుకున్నారు. ఆధునిక యుగం అయిపోయి, ఉత్తరాధునిక జీవితం మొదలవుతోందని అనుకున్నారు.

ఇకముందు నాటోను విస్తరించేది లేదని... బెర్లిన్ గోడ కూలే సందర్భంలో గోర్బచేవ్‌కు... అమెరికా, పశ్చిమ దేశాలు మాట ఇచ్చాయి. రాతలో పెట్టకపోయినా మాట అయితే ఇచ్చాయి. యుక్రెయిన్‌లో సైతం.. క్రిమియా భూభాగం రష్యాలో విలీనమయ్యాక ఇక యుద్ధం వొద్దని ఇరు వాగుల వారు అనుకున్నారు. ఈ మేరకు బెలారస్ రాజధాని మిన్స్క్ నగరంలో యుక్రెయిన్, రష్యాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం రష్యన్ భాష మాట్లాడే లూహాన్స్క్, డోనెస్క్ ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలి. యుక్రెయిన్‌లోని రష్యన్ జాతీయులు వాళ్ల భాషలో వాళ్లు చదువుకునే వసతి, మాట్లాడుకునే హక్కు ఉండాలి. అన్నిటికన్న మిన్నగా యుక్రెయిన్ దేశం ‘నాటో’ కూటమిలో చేరకుండా తటస్థ దేశంగా ఉండాలనేది ‘మిన్స్క్’ ఒప్పందంలో ముఖ్య భాగం. ఆ తరువాత యుక్రెయిన్ ప్రభుత్వాలు ‘మిన్స్క్’ ఒప్పందాన్ని అస్సలు ఖాతరు చేయలేదు. ‘మిన్స్క్’ ఒప్పందం అమలు కావాలని ప్రారంభమైన ఆందోళనలు లూహాన్స్క్, డోనెస్క్ ప్రాంతాలలో విముక్తి పోరాటంగా పరిణమించాయి. నిరుడు మొదలైన యుద్ధంలో... రష్యన్ బలగాలు ఆ ప్రాంతాల్ని ‘విముక్తి’ చేశాయని చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పుడున్న మిలిటరీ స్థితి ఆధారంగా తాము శాంతి చర్చలకు సిద్ధం అంటున్నారు. యుక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని రష్యన్లు స్పష్టం చేయడం కారుమబ్బుకు వెండి అంచు.

ఇప్పుడు యుక్రెయిన్‌లో తాను ఆక్రమించిన ప్రాంతాలు ఇక తనవే అంటున్నది రష్యా. రెఫరెండాలు జరిపి ప్రజల ఆమోదాలు (?) కూడా తీసేసుకుంది. తాంబూలాలు ఇచ్చేసింది. ఇక వెనక్కి దారి లేదు. ఏడాది కిందట, యుద్ధానికి ముందుండిన పరిస్థితి ఇక రాదు. రష్యాను పాత యుక్రెయిన్ భూభాగాల నుంచి వెళ్లగొట్టడం సాధ్యం కాదు. అతిగా ప్రయత్నిస్తే, అణ్వాయుధాల ప్రమాదం పొంచి చూస్తుంటుంది.

ఏకధ్రువ ప్రపంచం ఇక ఎలాగూ సాధ్యం కాదు. తమ రెండు ధ్రువాల మధ్య ప్రపంచాన్ని విభజించుకోవాలని రష్యా, అమెరికా దేశాలు అనుకున్నా కుదరదు. ఎందుకంటే, ప్రపంచాన్ని కట్టడి చేయడానికి... మునుపటి వరకు అమెరికా చేతిలో ఉండిన పెట్రో డాలర్లు ఇక ముందు ఉండబోవు. రష్యా, అమెరికా ఒకటై ప్రపంచాన్ని పంచుకోజూస్తే, వాళ్లను సవాలు చేయడానికి చైనా ఉంటుంది. రేపు మాపు, ఇండియా కూడా ఉంటుంది.

హెచ్చార్కె

Updated Date - 2023-03-19T01:19:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising