ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ఇండియా’: భావి భారతానికి కొత్త సంకల్పం

ABN, First Publish Date - 2023-07-21T00:57:45+05:30

‘జీతేగా ఇండియా’ (భారత్ గెలుస్తుంది) అనే నినాదంతో ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్’ (ఇండియా) ప్రజల ముందుకు వస్తోంది. ప్రతిపక్షాల ఐక్యత కేవలం...

‘జీతేగా ఇండియా’ (భారత్ గెలుస్తుంది) అనే నినాదంతో ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్’ (ఇండియా) ప్రజల ముందుకు వస్తోంది. ప్రతిపక్షాల ఐక్యత కేవలం ఒక ప్రయోగంగా మాత్రమే ఉండని పక్షంలో ఈ కొత్త విపక్ష రాజకీయ కూటమి 2024లో దేశ రాజకీయాలలో ఒక నిర్ణయాత్మక మార్పును సాధించగలుగుతుంది. పాత శైలి ఎన్నికల పూర్వ, అనంతర సంకీర్ణంగా ‘ఇండియా’ స్వల్ప స్థాయిలో మాత్రమే అదనపు ప్రయోజనాలను సమకూర్చగలదు. దేశాన్ని అన్నిటా కొత్త పుంతలు తొక్కించాలంటే అది భారత్ భావనను స్పష్టంగా వ్యక్తీకరించాలి; జాతిలో నిద్రాణమై ఉన్న శక్తులనన్నిటినీ చైతన్యీకరించాలి; సమాజంలోని కింది స్థాయి వారిలో ఆకాంక్షలను ప్రజ్వలింపజేయాలి; అవి నెరవేరేందుకు దోహదం చేస్తామనే భరోసా నివ్వాలి; అన్నిటికంటే ముఖ్యంగా ‘జుడేగా భారత్, జీతేగా ఇండియా’ అన్న నినాదానికి తానే ప్రత్యక్ష తార్కాణం కావాలి. ఈ కొత్త విపక్ష కూటమి ఇప్పటికే సరైన దిశలో రెండడుగులు వేసింది. ప్రతిపక్షాలు అంత అనైక్యంగా లేవని, కలిసికట్టుగా కూర్చుని సమాలోచనలు జరపడమే కాకుండా సమన్వయ కార్యాచరణకు చొరవ తీసుకోగలవని గత నెల 23న పట్నా సమావేశం స్పష్టం చేసింది. సమైక్యతకు అవరోధంగా ఉన్న సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుని, ఒక ఏకాభిప్రాయానికి రాగలమని, కొత్త సంకీర్ణానికి స్ఫూర్తిదాయకమైన పేరు కనుగొనగలమని కూడా రెండు రోజుల క్రితం బెంగళూరు సమావేశాల ద్వారా విపక్షాలు నిరూపించాయి. దాదాపుగా ఉనికిని కోల్పోయిన జాతీయ ప్రజాస్వామిక కూటమి (ఎన్డీఏ)ని భారతీయ జనతా పార్టీ హఠాత్తుగా పునరుద్ధరించడాన్ని, ‘ఇండియా’ ఆవిర్భావం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిస్పందనలను నిశితంగా గమనిస్తే జాతీయ అధికార పక్షం ఎంతగా కలవరపడుతుందో విశదమవుతుంది. ఏమైనా ‘ఇండియా’కు ఇదొక శుభారంభం.

‘ఇండియా’ అనే నామవాచకం ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’కు ఆద్యక్షర రూపం. కూటమి పేరు ద్వారానే ప్రజలకు ప్రతిపక్షాలు ఒక స్ఫూర్తిదాయక సందేశాన్ని పంపాయి. ఆ ప్రశస్త నామకరణంతో భారత్ భావన పునరుద్ధరణ ప్రతీకాత్మకంగా ప్రారంభమయింది. అంతేనా? ‘ఇండియా’ పక్షాలు బీజేపీని, మీడియా జగత్తులో దాని మద్దతుదారులను విస్మయపరిచాయి అంతకు మించి చికాకు పరిచాయి. ‘ఇండియా’ పట్ల బీజేపీ తొలి స్పందనలే అందుకు నిదర్శనాలు. సరే, బీజేపీ సైతం అనేకానేక నామవాచకాలతో ఇండియా పేరును స్మరిస్తూనే ఉన్నది. స్టార్ట్ అప్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా మొదలైన పేర్లలో ద్వితీయ భాగాన్ని అది త్యజించదు.

సరే, పేరు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన సంబంధిత వ్యక్తి లేదా సంస్థ జీవిత గమనం ఉత్తేజకరంగా ఉంటుందా? ఆవిర్భావ వేళ తనకు సమకూరిన అనుకూలతల ఆధారంగా కొత్త రాజకీయ కూటమి తన భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఇందుకు అది ఒక మౌలిక సత్యాన్ని గుర్తించి తీరాలి. గతించిన కాలంలోని ప్రతిపక్షాల ఐక్యత అనే దర్పణం ద్వారా నేటి ‘ఇండియా’ను చూడకూడదు. మొత్తం ఎన్ని ఓట్లను కూడగట్టుకోగలం, వాటి ప్రాతిపదికన ఎన్ని సీట్లు సాధించగలమనే పాత తరహా ఆలోచనలతో కాకుండా కూటమిపై ఓటర్లలో ఇతోధిక నమ్మకాన్ని కలిగించడం ద్వారా లేదా లక్ష్య సాధనకు అనుసరించే దారులతోను కొత్త రాజకీయ ఐక్యతను సాధించి తీరాలి.

రెండు సంవత్సరాల క్రితం ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు నేను వాటికి ప్రతిస్పందిస్తూ పాత తరహా ప్రతిపక్షాల ఐక్యత ఒక పనికిమాలిన ఆలోచన అని ఒక వ్యాసంలో నిక్కచ్చిగా చెప్పాను. బీజేపీని ఓడించేందుకు ఎన్నికల పూర్వమే ప్రధాన ప్రతిపక్షాలతో ఒక ‘మహాఘట్ బంధన్’ నేర్పాటు చేయడం తప్పనిసరి అనే భావనను విడనాడాలని నేను స్పష్టం చేశాను. అదే తర్కం నేటి పరిస్థితులకూ వర్తిస్తుంది. సమైక్యంగా లేని ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణం కానే కాదు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగిన కాలంలో దానిని ఓడించేందుకు అనుసరించిన ప్రతిపక్షాల ఐక్యత అనే వ్యూహం ప్రస్తుత పరిస్థితులలో పని చేయదని నేను స్పష్టం చేశాను.

వివిధ రాష్ట్రాల రాజకీయ ప్రత్యేకతలను మనం తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. బీజేపీ ఇప్పటికీ ఒక ప్రధాన రాజకీయ శక్తిగా లేని రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లు ఇందుకు ఉదాహరణలు. ఈ దృష్ట్యా ఆ రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నిటినీ కూడగట్టడమనేది అర్థరహితం. నిజానికి అది ప్రతికూల ఫలితాలను మాత్రమే ఇచ్చే అవకాశమున్నది. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలలో ప్రాబల్య బీజేపీయేతర పార్టీకి సంకీర్ణ భాగస్వామి అవసరం లేదు. సరే, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్నది. ఈ పోటీలో బీజేపీకే ప్రాబల్యమున్నదనేది అంగీకరించాల్సిన వాస్తవం.

మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, అస్సాంలలో ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీ లబ్ధి పొందుతున్నది. అయితే ఈ రాష్ట్రాలలో ఇప్పటికే స్థానిక స్థాయిలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉన్నది. ఇక మిగిలినవి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు. ‘ఇండియా’లో చేరిన రాజకీయ పక్షాలు ఎన్నికల పూర్వం పొత్తు పెట్టుకోవడం ద్వారా కూడగట్టుకునే ఓట్లు ఎన్నికల ఫలితాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తాయి. ఈ రాష్ట్రాలలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తుకు సంబంధించిన చర్చలు చాలా క్లిష్టంగాను, అనిశ్చితంగాను ఉండవచ్చు. కొత్త కూటమి ‘ఇండియా’ ద్వారా ఆ అవరోధాలను అధిగమించవచ్చని ఆశించకుండా ఉండడమే మంచిది. ఏది ఏమైనప్పటికీ బీజేపీని అధికారం నుంచి దించివేయటానికి, సమర్థుడైన ప్రతిపక్షాల సమైక్య అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఓటర్లు వేచివున్నారని భావించడం పొరపాటే అవుతుంది.

గరిష్ఠ సంఖ్యలో సీట్లను కూడగట్టుకోవడమనే అంశాన్ని చూద్దాం. విభిన్న పార్టీలు తమ తమ ప్రాంతాలలో తమ సొంతంగా సీట్లను గెలుచుకుంటాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకుంటాయి.. 2004లో ఇదే పద్ధతిలో యూపీఏ మొదటి ప్రభుత్వ మేర్పడింది. ఎన్నికల పూర్వం ‘ఇండియా’ వంటి సంకీర్ణం ఏర్పడడం ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లను కూడగట్టుకోవడానికి తోడ్పడుతుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు అనే లక్ష్యానికి అధిక ప్రాధాన్యమిస్తే దానివల్ల ఎదురు దెబ్బ తగిలే అవకాశమున్నది. ‘ఇండియా’ ఒక అవకాశవాద కూటమి అని, కేవలం ఒక వ్యక్తిని అధికారం నుంచి దించివేసేందుకే అవి కలిశాయనే ప్రచారంతో లబ్ధి పొందేందుకు బీజేపీ తప్పక ప్రయత్నిస్తుంది. ఏది ఏమైనా 2024లో ఎన్నికల అనంతర పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే ఊహించలేము. బెంగళూరు సమావేశంలో పాల్గొన్న 26 పార్టీలకు లేదా పునరుద్ధరింపబడిన ఎన్డీఏలో ఉన్న 39 పార్టీలకు వచ్చిన మొత్తం సీట్లు ఎన్ని అనే విషయం తెలిసేవరకు 2024 అనంతర రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఊహించలేము.

చెప్పవచ్చినదేమిటంటే ‘ఇండియా’ ప్రధాన విలువ సంకీర్ణ రాజకీయాల సంప్రదాయ అంకగణితం– సాధించే మొత్తం ఓట్లు, సీట్ల సంఖ్య–లో లేదు. ఓటర్లకు అది ఇచ్చే సందేశం, క్షేత్ర స్థాయిలో దాని కార్యాచరణలపైన ఆధారపడి 2024 ఎన్నికలలో అది సాధించగల మార్పులలో దాని సార్థకత ఉన్నది.

‘ఇండియా’ తన మొదటి ప్రకటనలో ఏ ఏ అంశాలపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను పోరాడుదలుచుకున్నదో పేర్కొంది. అవి: నియంతృత్వ రాజకీయాలు (రాజ్యాంగం, సమాఖ్య పాలనా విధానం, ప్రజాస్వామిక హక్కులు, ప్రతిపక్షంపై దాడులు), సామాజిక బహిష్కరణ (మత మైనారిటీలు, సామాజికంగా అణగారిన వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు, హింసాకాండ, మణిపుర్ విషాదం), ఆర్థిక సంక్షోభం (ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతం, జాతీయ ఆస్తుల అమ్మకాలు, రైతుల దుస్థితి) మొదలైనవి. ఇవన్నీ దేశ ప్రజలను సతమతం చేస్తున్న సమస్యలు. వాటికి ఒక పటిష్ఠ ప్రతిస్పందన అవసరమున్నది.

ఈ అంశాలపై జాతీయ స్థాయిలో సమష్టి కార్యాచరణకు పూనుకోవల్సిన అవసరమున్నది. అయితే ఏ అంశాలకు ప్రాధాన్యమివ్వాలన్నది ‘ఇండియా’ ముందున్న అసలైన సవాల్. 2024లోగా ఆ అంశాలపై జాతీయ స్థాయిలో ఉద్యమం రాని పక్షంలో వాటిని వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ప్రధానాంశాలుగా చేయకూడదు. ప్రతిపక్ష నాయకులపై ఈడీ దాడుల పట్ల నిరసనలు సమర్థనీయమే అయితే స్వార్థ ప్రయోజనాలను రక్షించుకునేందుకే ఈ నిరసనలు తెలుపుతున్నారని పాలకులు వాటిని అపఖ్యాతి పాలు చేయవచ్చు. ధరల పెరుగుదల, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం రావాల్సిన అవసరమున్నది. రైతు ఉద్యమాలతో కలిసి పని చేస్తే ప్రతి పల్లెకు ‘ఇండియా’ సందేశం చేరే అవకాశమున్నది. వీథులలో పోరాటాలు సమర్థంగా నిర్వహించేందుకు ‘ఇండియా’ కేవలం రాజకీయ పార్టీల సముదాయంగా కాకుండా ఒక కొత్త శక్తిగా వ్యవహరించాల్సిన అవసరమున్నది. రాజకీయ పార్టీలకు వెలుపల ఉన్న ప్రజా సంఘాలు, ఆందోళనలు ఉద్యమాలను ఏకం చేయడం దాని కర్తవ్యంగా ఉండాలి.

‘ఇండియా’ నుంచి మనం ఇంకా ఆశిస్తున్నదేమిటి? దేశ ప్రజలలో మంచి భవిష్యత్తు పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని నెలకొల్పాలి. భారత్‌కు మెరుగైన పాలన నందిస్తామని నొక్కి చెప్పాలి. ఆ ప్రత్యామ్నాయ పాలన సుసాధ్యమేనని స్పష్టం చేయాలి. ‘ప్రత్యామ్నాయ రాజకీయ, సామాజిక, ఆర్థిక ఎజెండాను జాతికి వాగ్దానం చేస్తున్నాము. మరింత ప్రజాస్వామ్యయుతంగా సాగేలా పాలన తీరుతెన్నులలో మౌలిక మార్పుకు హామీ ఇస్తున్నామని’ కొత్త రాజకీయ కూటమి మొదటి ప్రకటన కూడా అవే విషయాలను పేర్కొనడం దేశ భవిష్యత్తు పట్ల ఆశాభావాన్ని కలిగిస్తోంది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2023-07-21T00:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising