హీరాబెన్, మీరొక సర్వనామం!
ABN, First Publish Date - 2023-01-04T03:20:11+05:30
‘నేనొక శబ్దాన్నయితే నీవు పూర్తి భాషవు’ అని ఒక కవి తన తల్లి గురించి రాస్తూ అన్నారు. ఒళ్లంతా ముడతలు పడ్డ వృద్ధురాలైన ఒక తల్లి జీవితంలో అడుగడుగునా ఎన్ని కడగండ్లు, అవమానాలు ఎదురయ్యాయో...
‘నేనొక శబ్దాన్నయితే నీవు పూర్తి భాషవు’ అని ఒక కవి తన తల్లి గురించి రాస్తూ అన్నారు. ఒళ్లంతా ముడతలు పడ్డ వృద్ధురాలైన ఒక తల్లి జీవితంలో అడుగడుగునా ఎన్ని కడగండ్లు, అవమానాలు ఎదురయ్యాయో ఒక్క వాక్యంలో చెప్పలేం. ఒక తల్లి ఇంట్లో ఎదురు చూస్తున్న తన కొడుకు కోసం తాను వంట పనిచేస్తున్న ఇంట్లోంచి వేడి వేడి గారెలు కొంగులో దాచుకుని తీసుకువచ్చిందట. కొడుకు తినాలన్న ఆత్రుతలో తన కడుపు ఆ గారెల వేడికి కాలి కమిలిపోయిన బాధను ఆమె మరిచిపోయిందట. పెద్దయ్యాక ఆ కుమారుడు తన తల్లి కడుపుపై మచ్చ కనపడకుండా బంగారు వడ్డాణం చేయించాడు. ఎన్ని వడ్డాణాలు చేయించినా అది ఆ తల్లి మనసుకు దీటు రాగలదా?
ఎందరో తల్లులు బాల్యం ఆటపాటల మధ్యలోంచి ఏమీ తెలియని పసి వయసులో పెళ్లిపీటల మీద కూర్చోవాల్సిన పరిస్థితి భారతీయ సమాజం చూసింది. వారిలో చాలా మంది ఇప్పటికీ మన మధ్యే ఉన్నారు. అందరూ మాక్సింగోర్కీ ‘అమ్మ’లు కాకపోవచ్చు. మహాశ్వేతాదేవి అభివర్ణించిన ‘ఒక తల్లి కథ’లు వారికి లేకపోవచ్చు. కాని జీవితాలు అత్యంత దుర్భరంగా గడిచిన, బతుకంతా ఇతరులకోసమే సాగించిన భారతీయ స్త్రీలు ఎందరో. కొత్త ఏడాది సమీపిస్తుండగా తన జీవితాన్ని చాలించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అలాంటి తల్లుల్లో ఒకరు. ఒకప్పుడు ఆమె ఇళ్లల్లో అంట్లు తోమిన పనిమనిషి. ఇంటిఎదురుగా ఉన్న నూనెమిల్లు ఆఫీసు సిబ్బంది కోసం బావిలోంచి నీళ్లు తోడిపెట్టిన అభాగ్యురాలు.
‘మా అమ్మకు బాల్యమనేదే లేదు. బాల్యంలోనే ఆమె తల్లి స్పానిష్ ఫ్లూతో చనిపోవడంతో తల్లి లాలనే ఆమెకు తెలియదు, తన వయసుకుమించి ఆమె బలవంతంగా ఎదగాల్సివచ్చింది. కటిక పేదరికం మధ్యనే బాల్యంలోనే ఆమె వివాహం చేసుకుని ఒక పెద్ద కోడలిగా అడుగుపెట్టాల్సి వచ్చింది. ఆమె ఏనాడూ స్కూలుకు వెళ్లి చదువుకోలేదు. టీకొట్టుకు వెళ్లేందుకు తెల్లారుజామున 4 గంటలకు నాన్న లేవకముందే ఆమె నిద్ర లేచేవారు. మట్టితో కట్టిన కచ్చాఇల్లును పేడతో అలుకడం, పిడకలు చేయడం నుంచి అన్ని పనులూ ఆమే చేసేది. వెదురు బొంగులతో మా నాన్న కట్టిన మంచెఎక్కి పిడకల పొయ్యితో ఆమె వంటచేసేది. బియ్యం జల్లెడపట్టడం, విసుర్రాయితో పిండి విసరడం, ఇళ్లలో పనిచేయడం, నూలుదారం వడికి అమ్మడం లాంటి ఎన్ని పనులో ఆమె చేసేవారు. భారీ వాన కురిస్తే ఇల్లంతా నీళ్లతో నిండకుండా గిన్నెలు, బకీట్లు అక్కడక్కడా పెట్టేది. అదే నీరు మళ్లీ అవసరాలకోసం వాడుకునేది. ఎండాకాలంలో ఇంటి పైకప్పు బాగు చేసేది. గోడలకు సున్నం వేయడం, పాతకాగితాలు, చింతపండు గింజలతో పేస్ట్ తయారుచేసి ఆ పేస్టుతో గోడలకు అద్దపు ముక్కలు అంటించి అందంగా కనిపించేలా చేసేది. మా నాన్న టీ కొట్టు నుంచి తెచ్చిన మీగడతో మంచి నేయి తయారు చేసేది. మమ్మల్ని చదువుకోమనడం తప్ప ఒక్క పనీ చేయనిచ్చేది కాదు‘ అని నరేంద్రమోదీ ఒక సందర్భంలో రాసుకున్నారు.
మోదీ తల్లుల్లాంటి తల్లులు భారతదేశంలో ఎందరికో ఉన్నారు. తమ సర్వస్వం తమ కుటుంబాలకు త్యాగం చేసేవారున్నారు. అందువల్ల హీరాబెన్ ఏకవచనం కాదు, ఆమె సర్వనామం. భారతదేశంలో దేవతలు ఎందరు ఉన్నా, ప్రతి తల్లీ పటాల ముందు ప్రణమిల్లే ప్రత్యక్ష దేవత. యుక్తవయస్సు రాకముందే ఇల్లు విడిచి తొలుత హిమాలయాలకు, తర్వాత ప్రచారక్‌గా వెళ్లి, క్రమంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన మోదీ మనఃఫలకంపై నుంచి తల్లి చెరిగిపోలేదు. కుటుంబంతో సంబంధాలు లేకపోయినా నరేంద్ర మోదీ తల్లితో భావోద్వేగపరమైన అనుబంధాన్ని వీడలేదు. ఎటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా, ఎందర్ని లెక్కచేయకపోయినా, జనం దృష్టిని ఆకర్షించేందుకు ఎన్ని పనులు చేసినా తల్లి గుర్తుకు వచ్చేసరికి ఆయన కంఠంలో మార్దవం, గాద్గదికత తొణికిసలాడడం నాటకీయం అనుకోలేం. తన జీవితంలో ఏ మంచి జరిగినా, తన వ్యక్తిత్వంలో మంచిదంటూ ఏమి ఉన్నా ఆ ఘనత తన తల్లికే దక్కుతుందని, తల్లి ప్రేమ పిల్లల్లో మానవ విలువలను, ఆర్ద్రతను కల్పిస్తుందని ఆయనే ఒక సందర్భంలో చెప్పుకున్నారు.
నరేంద్ర మోదీ కేవలం రాజకీయాల కోసమే యాంత్రికంగా పనిచేస్తున్న కాలంలో ఆయనలో మానవత్వం చిగురించేందుకు హీరాబెన్ ప్రోద్బలమయ్యారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వడ్‌నగర్ నుంచి తన తల్లి మకాం గాంధీనగర్ పొలిమేరల్లోని రేసాన్‌కు మార్చారు. ఏక్తాయాత్రలు చేసినా, ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, పుట్టిన రోజు నాడైనా ఆమె ఆశీర్వాదాలకోసం వెళ్లేవారు. ఇక ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గుజరాత్ వెళ్లిన ప్రతీ సందర్భంలోనూ ఆమె దగ్గరకు వెళ్లేవారు. ఆయన ఢిల్లీలోని తన అధికార నివాసానికి తీసుకువచ్చి ఇల్లు, తోట అంతా చూపించిన ఏకైక కుటుంబ సభ్యురాలు హీరాబెన్ ఒక్కరే.
హీరాబెన్ అందరు తల్లుల్లా కుమారుడి ప్రగతి చూసి ఆనందించే, కుమారుడు ఏది చేసినా సరైనదని భావించే స్వచ్ఛమైన నీలి ఆకాశం లాంటి అమాయకురాలు. ఇంటికి వచ్చినప్పుడల్లా కుమారుడికి చేతి భోజనం తినిపించి సంతోషించేది. చే రుమాలుతో ఆయన మూతి తుడిచేది. టీవీలో కుమారుడిని చూస్తే మురిసిపోయేది. 2016 నవంబర్‌లో కుమారుడు పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ఆమె కూడా లైన్‌లో నిలబడి తన వద్ద ఉన్న రూ. 4500 విలువైన పాత నోట్లను మార్చుకున్నారు. దేశమంతా కరోనాతో అతలాకుతలం అవుతున్నప్పుడు ఆమె కూడా ప్రధానమంత్రి కేర్‌కు తాను ఆదాచేసిన మొత్తం లోంచి రూ. 25వేలు జమ చేశారు. బిజెపికి ఓటు వేస్తే తన కుమారుడికి మేలు జరుగుతుందని ఆమె భావించేవారు. 2022 డిసెంబర్ 5న కూడా ఆమె గాంధీనగర్‌లోని రైసాన్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి ఓటు వేశారు.
‘అమ్మ అనే మాట నిఘంటువులో అన్ని పదాల్లాంటి పదం కాదు. అమ్మలో ప్రేమ, సహనం, విశ్వాసం... ఎన్నెన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయి, అమ్మ పిల్లలకు జన్మనివ్వడం మాత్రమే కాదు, వారికి వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ సమకూరుస్తుంది, ఈ క్రమంలో నిస్వార్థంగా అన్నిటినీ త్యాగం చేస్తుంది..’ అని మోదీ గత ఏడాది తన తల్లి హీరాబెన్ నూరవ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా తన బ్లాగులో భావాల్ని పంచుకున్నారు.
నిజమే. ఇవాళ నరేంద్రమోదీ ఒక రకంగా ఒంటరి వ్యక్తి. తల్లితో తప్ప ఎలాంటి కుటుంబ సంబంధాలు, అనుబంధాలను ఆయన ఏర్పర్చుకోలేదు. అందువల్ల ఇకపై గుజరాత్ వెళ్లినప్పుడల్లా ఆయనకు ఒక శూన్యం, ఒక వెలితి ఎదురవుతుంది. ఆయన ఈ దేశంలో ఎదురులేని ఒక ప్రధాని కావచ్చు కానీ ఆయన తలను ముడతలు పడ్డ చేతులతో స్పృశించి, బోసినవ్వుతో పలకరించే తల్లి ఏదీ ఇప్పుడు? తరుచూ తన తల్లి చేతి భోజనం తింటూ, ఆమెకు తినిపిస్తూ, ఆమె పాదాలు స్పృశిస్తూ, ఆమె కాళ్ల దగ్గర కూర్చునే నరేంద్రమోదీ ఫోటోలు మనం ఇప్పుడు చూడగలమా? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కావచ్చు. కాని ఆ తల్లే లేనప్పుడు ఢిల్లీ రాజరికం వెలవెలబోదా?
ఇవాళ భారతదేశంలో ఎందరో తల్లులు పేదరికం, చలి, ఎండ, అణచివేత, ఒంటరితనానికి గురవుతున్నారు. యుక్తవయస్సులో ఉన్న పిల్లలు పొట్టపోసుకునేందుకు విదేశాలకు వెళ్లిపోగా, వృద్ధులైన తల్లిదండ్రులతో దేశం వృద్ధాశ్రమంగా మారుతోందని నాలుగైదు నెలల క్రితం మోదీని కలిసినప్పుడు చెబితే ఆయన చలించినట్లు కనిపించింది. ఈ ఏడాది తీవ్రంగా వణికిస్తున్న చలిలో గత నెల రోజుల్లో 162 మంది నిరాశ్రయులు తల దాచుకునే చోటు లేక మరణించారని ఢిల్లీ బిజెపి అధినేత వీరేంద్ర సచ్ దేవ ఇటీవలే ట్వీట్ చేశారు. వీరిలో అనేకమంది ముసలి తల్లులున్నారు. భారత్‌లో 8 కోట్ల మందికి పైగా మహిళలు కటిక పేదరికంలో జీవిస్తున్నారని, కొవిడ్ మూలంగా వారి సంఖ్య పది కోట్లకు పెరిగిందని యుఎన్‌డిపి నివేదిక పేర్కొంది. నిరుద్యోగం, అతి తక్కువ వేతనాలు, ఆకలి, లైంగిక దోపిడీ, హింస, నిరక్షరాస్యత, కుల వివక్ష, గౌరవహత్యలకు ఈ దేశంలో అత్యధిక మహిళలు గురవుతున్నారు. 90 శాతం మంది మహిళలు చాలీ చాలని వేతనాలతో అసంఘటితరంగంలో పనిచేస్తున్నారు. మహిళా కార్మికులసంఖ్య ప్రపంచంలో అతి తక్కువ శాతం మన దేశంలోనే ఉన్నదని రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ మైకేల్ దేవబ్రత పాత్రా చెప్పారు. జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారమే 2021లో స్త్రీలపై 31,677 అత్యాచార ఘటనలు జరిగాయి. ప్రతీ రోజూ 86 మంది మహిళలపై అత్యాచారం జరిగితే సగటున ప్రతీ గంటకూ మహిళలపై 49 హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. బేటీ బచావో, బేటీ పడావో లాంటి పథకాలు ఎన్ని ఉన్నా, భారతదేశంలో యుక్తవయస్సుకు చేరుకున్న బాలికల్లో 40 శాతం మంది బంగారు తల్లులు పాఠశాలకు హాజరు కారు. బెయిల్ రాక, విచారణ దశ దాటక జైళ్లలో కునారిల్లుతున్న అభాగ్య మహిళలు ఎందరో కదా!
తల్లిని కోల్పోయిన మోదీకి ఇక గుజరాత్ నిజంగా శూన్యమే కావచ్చు. కానీ దేశ ప్రధానికి భారతదేశమంతటా అభాగ్య తల్లులు ఎందరో ఉన్నారు. తన తల్లి జీవిత గాథలో ఒక తపస్సును, ఒక త్యాగాన్ని మాత్రమే కాదు, భారతదేశ మాతృశక్తిని చూస్తున్నానని మోదీ తన బ్లాగ్‌లో రాసుకున్నారు. అబ్బాస్ అనే ఒక అనాథ ముస్లిం బాలకుడినీ తల్లి చేరదీసి ఆదరించిందని ఆయన చెప్పుకున్నారు. ‘ప్రతి అణగారిన జీవిత గాథ వెనుక ఒక తల్లి వైభవోన్నత ఘట్టం ఉంటుంది. ప్రతి సంఘర్షణ వెనుక ఒక తల్లి బలమైన పట్టుదల ఉంటుంది’. అని ఆయన రాసుకున్నారు. ఆ వైభవోన్నత ఘట్టాన్ని, ఆ పట్టుదలను కల్పించాల్సిన బాధ్యత మోదీ లాంటి కుమారులకు ఉంటుంది. భారతీయ తల్లుల వేదనను ఆయన కంటే అర్థం చేసుకునేవారు మరొకరు ఉండరు. ‘మోదీజీ, మీరిప్పుడు తల్లి లేనంత మాత్రాన ఏకాకి ఏ మాత్రం కాదు’ అని ఆ కర్మయోగికి చెప్పాల్సిన పనిలేదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
Updated Date - 2023-01-04T03:20:13+05:30 IST