ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజాస్వామ్యం’ : నానార్థాల పదం!

ABN, First Publish Date - 2023-04-23T01:00:14+05:30

గతగత కొన్నాళ్ళుగా ‘ప్రజాస్వామ్యం’ అనే మాట రాజకీయాల్లో ఒక ఊతపదంగా తయారైంది. మోదీ ప్రభుత్వం అయితే, ‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే పేరుతో ఒక వ్యాస సంకలనమే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతగత కొన్నాళ్ళుగా ‘ప్రజాస్వామ్యం’ అనే మాట రాజకీయాల్లో ఒక ఊతపదంగా తయారైంది. మోదీ ప్రభుత్వం అయితే, ‘భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి’ అనే పేరుతో ఒక వ్యాస సంకలనమే తీసుకొచ్చింది. ఆ సందర్భంగా, మోదీ అన్న మాటలు కొన్ని: ‘ప్రజాస్వామ్యం మన రక్తనాళాల్లోనే వుంది. అది మన సంస్కృతి’. ప్రతిపక్షాలేమో, ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అంటున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షపార్టీలూ, రెండూ కూడా, వాళ్ళు చెప్పుకునే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళే గతంలోనూ అపహాస్యం చేశారు; ఇప్పుడూ అదే చేస్తున్నారు. కానీ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నిజాయితీగా ఆవేదన చెందే మేధావుల్నీ, హక్కుల సంఘాల వారినీ చూస్తే అశ్చర్యం కలుగుతుంది. ‘వర్గ’ సమాజంలో వుంటూ కూడా, ప్రజాస్వామ్యాన్ని ‘స్వచ్ఛమైన’ రూపంలో, అర్ధంలో వర్గాతీతమైన విధానంగా ఎలా భావిస్తున్నారా– అని! నిజంగా తెలియదా? భ్రమల్లో వున్నారా?

‘ప్రజాస్వామ్యం’ అనే పదం ఎప్పుడో, ఎక్కడో, గ్రీసు దేశంలో వాడడం మొదలైందంటారు. ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం వున్న ప్రభుత్వమే లేదా పాలనే ప్రజాస్వామ్యం!’ అని, ప్రజాస్వామ్యానికి అబ్రహం లింకన్ ఇచ్చిన నిర్వచనాన్ని చాలామంది కంఠస్తం పట్టే వుంటారు. ప్రజాస్వామ్యం గురించి 1858లో లింకన్ అలా నిర్వచించడానికి కారణం, ఆ నాడు అమెరికాలో వున్న బానిస విధానం పట్ల అతనికి వున్న వ్యతిరేకత. ఆ కాలంలో, అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాలలో బానిస యజమానులూ, బానిసలూ అనే వ్యవస్త వుండేది. ఉత్తరాది రాష్ట్రాలలో జీతాల బానిసత్వమే వున్నప్పటికీ, కార్మికులకు నామమాత్రంగానైనా కొన్ని రాజకీయమైన హక్కులు వుండేవి. దక్షిణాది రాష్ట్రాల బానిసలకు అది లేదు. (హారియట్ బీషర్ స్తోవే అనే రచయిత్రి రాసిన, ‘టామ్ మామ ఇల్లు’ అనే నవలా; హోవర్డ్ ఫాస్ట్ అనే రచయిత రాసిన ‘స్వేచ్ఛాపధం’ అనే నవలా ఈ విషయాల్ని చెపుతాయి.) అదే అమెరికాకు చెందిన కొందరు మేధావులు, 40ఏళ్ళ కిందటే (ఉదాహరణకి, మైకేల్ పెరెంటీ అనే రాజకీయ శాస్త్రవేత్త) అమెరికాలో వున్నది ‘కొద్ది మందికే ప్రజాస్వామ్యం’ (డెమాక్రసీ ఫర్ ది ఫ్యూ’) అని అనేక ఉదాహరణలతో చూపారు. మరి ఇక్కడి మేధావులు (ఉదా: అరుంధతీ రాయ్, రామచంద్ర గుహ, యోగేంద్ర యాదవ్ వంటి వారు) ఇక్కడ ప్రజాస్వామ్యం ఇంతకు ముందు వున్నట్టూ, అది పోను పోనూ విఫలం అవుతోన్నట్టూ అని ఎందుకు భావిస్తున్నారు? ఇప్పటిదాకా, ప్రజాస్వామ్యం నామమాత్రంగానైనా వుంది, ఇప్పుడు ఆ మాత్రం కూడా లేదు అని భావిస్తున్నారా? అలా అనుకున్నా పొరపాటే కదా? ఎలా అంటే: ఆధునిక చరిత్రలో, ప్రజాస్వామ్యం ఎన్నడూ వర్గాలతో సంబంధం లేనిదిగా లేదు. ఈ గ్రహింపు లెనిన్ వంటి శ్రామికవర్గ మేధావుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ‘సోవియట్ పాలనలో స్త్రీల స్థితి’ అనే 1919 నాటి వ్యాసంలో, లెనిన్ విమర్శ చూడండి: ‘దోచేవాడికీ– దోచబడే వాడికీ మధ్యా, పీడించే వాడికీ–పీడించబడే వాడికీ మధ్యా సమానత్వమా? అలాంటి సమానత్వం ఎన్నడూ లేదు. లేకపోయినా వున్నదని చెప్పేదే బూర్జువా ప్రజాస్వామ్యం. సంఘంలోనూ, చట్టంలోనూ, పురుషుడికి వున్న ప్రత్యేక హక్కుల వల్ల స్త్రీ బాధపడినంత కాలమూ; భూకామందుల నుంచీ, వర్తకుల నుంచీ, కష్టించే రైతులకు విముక్తి లేనంతకాలమూ, నిజమైన స్వేచ్ఛ అనేది వుండదు.’

ప్రజాస్వామ్యం అనే భావనకు వున్న వర్గ స్వభావం గురించిన లెనిన్ వివరణ, 1918లో రాసిన ‘ప్రజా స్వామ్యమూ, నియంతృత్వమూ’ అనే వ్యాసంలో కూడా చూడవచ్చు. పెట్టుబడిదారీ వర్గం అధికారంలో వున్న సమాజంలో, ప్రజాస్వామ్యం ‘పెట్టుబడిదారీ వర్గ నియంతృత్వం’గా వుంటుందనీ; కార్మికవర్గం అధికారంలో వున్న సమాజంలో అది ‘కార్మిక వర్గ నియంతృత్వం’గా వుంటుందనీ లెనిన్ వివరిస్తాడు. ఈ వివరణకి, మనం ఒక ఉదాహరణని చెప్పుకోవచ్చు. ‘దున్నేవాళ్ళకే భూమి’ అనో, ‘శ్రమ చేసేవారికే ఉత్పత్తి సాధనాలు’ అనో, ఒక నినాదంతో కార్యాచరణకి శ్రామిక ప్రజలు పూనుకుంటే, పెట్టుబడిదారీ వర్గం అణిచివేస్తుంది. అదీ బూర్జువా ప్రజాస్వామ్యం! అదే బూర్జువా నియంతృత్వం! అలాగే, కార్మిక వర్గం అధికారంలోకి వచ్చాక, సమాజాన్ని విప్లవీకరించే మార్పులతో, అందరూ శ్రమలు చేసే సమానత్వ సంబంధాల కోసం ప్రయత్నించేది కార్మికవర్గ ప్రజాస్వామ్యం! అదే కార్మికవర్గ నియంతృత్వం కూడా! మొత్తం మీద, ‘ప్రజాస్వామ్యం’ అనేది, అధికారంలో వున్న వర్గపు ప్రయోజనాల్ని బట్టే వుంటుంది.

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనీ, విఫలమైందనీ, ఆవేదన చెందే మేధావులు, రాజకీయ పరిస్థితిని వర్గ దృష్టితో అర్ధం చేసుకుని, ప్రజలకు వర్గ చైతన్యం కలిగించే ప్రయత్నం చెయ్యడమే బాధ్యత కదా? కానీ కొందరు మేధావులు, రాజకీయ చర్చల్లో వర్గ దృక్పధంతో కాకుండా, సంస్కరణవాద దృక్పధంతో, విమర్శలు చేస్తారు. ‘ఇప్పుడున్నది ‘నిర్దేశిత’ ప్రజాస్వామ్యం (‘గైడెడ్ డెమోక్రసీ’) అనో, ‘నిరంకుశ’ ప్రజాస్వామ్యం (‘టొటాలిటేరియన్ డెమోక్రసీ’) అనో, విమర్శలు చేస్తారు. ఆ విమర్శల అర్ధం: ఎన్నికలూ, పార్లమెంట్లూ, అసెంబ్లీలూ, కోర్టులూ, చట్టాలూ, అన్నీ ఉంటాయి గానీ, అధికారంలో వున్న పార్టీ, దాని నాయకుడూ, అధికారాలన్నీ గుప్పిట్లో పెట్టుకుని, నిరంకుశుడిగా చేసే పాలనే ఇప్పుడున్న ప్రజాస్వామ్యం– అని వారు వివరిస్తారు. కానీ, ఈ రకం పదాలూ, వివరణలూ వర్గ వాస్తవాల్ని వ్యక్తం చెయ్యవు. వర్గ చైతన్యాన్ని కలగజేయవు. ఎందుకంటే, ఈ రకం విమర్శల వల్ల ఒక పార్టీయో, ఒక నాయకుడో మాత్రమే ప్రజాస్వామ్యాన్ని పాడు చెయ్యగలరని అర్ధాలు వస్తాయి. కానీ, వర్గాలూ, వర్గ ప్రయోజనాలూ అనే వాస్తవాల్ని మరుగుపరుస్తాయి.

అందుకే, నానార్ధాలున్న ప్రజాస్వామ్యం అనే పదానికి ముందు, వర్గ విశేషణాన్ని చేర్చడం ద్వారానే ప్రజలకి వివరించక తప్పదు. లేకపోతే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే ఆవేదన అంతా ‘రాజకీయ అరణ్య రోదన’ గానే మిగిలిపోతుంది!

రంగనాయకమ్మ

Updated Date - 2023-04-23T01:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising