ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోకచుక్కకు ముందే, ‘బరంపురం’ వేగుచుక్క!

ABN, First Publish Date - 2023-04-23T01:05:33+05:30

‘‘మొన్న పట్ణము నందు ప్రాజ్ఞులు. మొట్ట మొదటిది మెట్టు యిది యని, పెట్టినారొక విందు జాతుల జేర్చి; వినవైతో’’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘మొన్న పట్ణము నందు ప్రాజ్ఞులు.

మొట్ట మొదటిది మెట్టు యిది యని,

పెట్టినారొక విందు జాతుల

జేర్చి; వినవైతో’’– అని బరంపురంలో జరిగిన సకలవర్ణ సహపంక్తి భోజనాలను తన ‘ముత్యాల సరములు’ ద్వారా మహాకవి గురజాడ అప్పారావు చరిత్ర సుప్రసిద్ధం చేశారు.

సనాతన ఆచారాలు మెండుగా ఉన్న కాలమది. అయినా ఆధునిక, సంస్కార భావాలతో సంఘ సంస్కరణకు ధైర్యంతో ముందడుగు వేసిన సాహసోపేతుడు ‘ఆనరబుల్‌’ గాదె రాఘవరావు పంతులు. ఈ విస్మృత ప్రముఖుడు 1862లో జన్మించారు. మద్రాస్‌లో బి.ఏ., బి.ఎల్‌. చదివి హైకోర్టు ప్లీడర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు ఆర్జించారు. బరంపురం మునిసిపాలిటీ కౌన్సిలర్‌గా, చైర్మన్‌గా ఆయన అనేక ప్రజాహిత కార్యాలు చేపట్టారు. 1909లో మింటో–మార్లే సంస్కరణల అనంతరం గంజాం – విశాఖ జిల్లాల ప్రతినిధిగా చెన్నపురి శాసనమండలికి రాఘవరావు ఎన్నికయ్యారు. వలస పాలకుల నుంచి ‘ఆనరబుల్‌’ అనే బిరుదును పొందారు. 1911లో ఇంగ్లాండ్‌ వెళ్ళి పంచమ జార్జి ప్రభువు పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. మునిసిపల్ ఛైర్మన్‌గా ఉన్నపుడు బరంపురంలో విక్టోరియా జూబిలీ మార్కెట్‌ను ఆయన నిర్మించారు. రజస్వల అనంతర వివాహం, స్త్రీల పునర్వివాహాలు, స్త్రీ విద్య మున్నగు సంస్కరణ కార్యాలకు రాఘవరావు తన శాయశక్తులా చేయూత నందించారు. బరంపురంలో మహిళల సభల, సమావేశాల నిమిత్తం భార్య చూడి కుడిత్తమ్మ పేరుతో ఒక మహిళా సమాజ భవనాన్ని రాఘవరావు నిర్మించారు.

ఈ ప్రజాహిత కార్యాలన్నీ ఒక ఎత్తు అయితే సకలవర్ణ సహపంక్తి భోజనాలు నిర్వహించి చరిత్రలో బరంపురంను సంస్కారవాద మానవీయ పరిమళాలతో గుబాళింప చేయటం మరొక ఎత్తు. ఈ ప్రగతిశీల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రాఘవరావు సనాతన ధార్మిక వాదుల విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ విషయమై బరంపురం వాసి రావు సాహెబు మరువాడ సీతారామస్వామి తమ ‘ఉత్కళ రాష్ట్రములోని విశిష్టాంధ్రులు శ్రీగాదె రాఘవరావు పంతులుగారు, బి.ఏ., బి.ఎల్., హైకోర్టు వకీలు’ అన్న పుస్తకంలో ఇలా రాశారు : ‘‘...ఇట్టి విషమ పరిస్థితులలో సంఘ సంస్కరణమునకుఁ బూనుకొనిరి. 1909 సంవత్సరమున సర్వవర్ణ సమావేశ భోజనమని ప్రతిశాఖలోని పెద్దవారలతో నొక విందుచేసి భుజించుటచే సనాతన ధార్మికులు చేయు కఠోర నిందలకు బాత్రులైరి. గాని వారు విధించు దండనకు లోబడుట లేదు’.

బరంపురంలో జరిగిన సహపంక్తి భోజనాలను గూర్చి ప్రముఖ రచయిత డా॥. వుప్పల లక్ష్మణరావు తమ ‘బతుకు పుస్తకం’లో ఇలా రాశారు : ‘1910లో హాలీస్‌ తోకచుక్క రావడం బరంపురంలో వర్ణాంతర సహపంక్తి భోజనం జరగడం – గురజాడవారు గేయరూపంలో రాసి చరిత్రలో చిరస్థాయిగా నిల్చేట్టు చేశారు. ఆ భోజనం తర్వాత వూళ్ళో జరిగిన రభస మీకు తెలిసినదే. ఆ భోజనానికి మా పినతల్లి పెనిమిటీ, జోగయ్య కక్కయ్యగారి తమ్ముడు అయిన సూర్యనారాయణమూర్తి కక్కయ్య గారు (వీరు అప్పట్లో కాలేజీ హైస్కూలు తరగతుల్లో కెమిస్ట్రీ చెబుతుండేవారు) కూడా వెళ్ళారు. ఆ భోజనానికి వెళ్ళిన వారిని వెలివేస్తే దిగుమర్తి వారినీ, వరహాగిరి వారినీ వీరి బంధువర్గాన్నీ వెలివేసి తీరాలి....’ ఇలా సనాతనవాదులు వెలి గురించి తర్జన భర్జనలు పడ్డారు. తరువాత ఆ సమస్య సమసిపోయింది. ఇది జరిగిన కొన్నాళ్ళకే జార్జి చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవాలకు గాదె రాఘవరావు, న్యాయపతి రామానుజ స్వామి లండన్ వెళ్ళి వచ్చారు. ఆ సందర్భంలో ఊళ్ళో సనాతన వైష్ణవులలో చెలరేగిన దుమారం గురించి లక్ష్మణరావు తన ‘బతుకు పుస్తకం’లో వివరంగా రాశారు. సముద్ర ప్రయాణం చేసివచ్చిన వారిని వెలివెయ్యాలని కొందరు, ప్రాయశ్చిత్తం చేయించుకుని, లాంఛన ప్రాయంగా నాలుక కొనను వెచ్చచేసిన వెండితీగతో తాకితే సరిపోతుందని కొందరూ వాదించుకున్నారట. ‘ఏమైనా సరే తాను యే రూపంలోనైనా సరే ప్రాయశ్చిత్తం చేయించుకోను అని రాఘవరావు పంతులుగారు పట్టుబట్టడం, వీరు లొంగకపోవడం చూసి, జియ్యంగార్లూ, అయ్యంగార్లూ యిక చేసేదేమీలేక గప్‌చుప్‌గా వూరుకున్నారు’ అని లక్ష్మణరావు రాశారు.

1909లో బరంపురంలో సాగిన సంఘ సంస్కరణ ఉద్యమం గురించి మరి కొన్ని పుస్తకాలు కూడా నమోదు చేయటం విశేషం. ‘శ్రీ గోల్కొండ వ్యాపారి శ్రీ వైష్ణవ సమాజము యొక్క చరిత్ర’ అనే పుస్తకంలో ఈ క్రింది విషయం ఆ ఉద్యమాన్ని ప్రస్తావిస్తున్నది. అసలు ఈ ఉద్యమ నేపథ్యంలోనే వారు తమ వైష్ణవ ధర్మాలను పరిరక్షించుకునే నిమిత్తము సమాజం ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు వ్రాసుకున్నారు. ‘1909వ సంవత్సరమున సంఘ సంస్కరణోద్యమము ముమ్మిరిగా సాగు సమయమున మన పెద్దలు మన వైష్ణవ ధర్మముల పరిరక్షించుకొనుటకు.....’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్నే ‘వివేకవతి’ పత్రిక (అక్టోబర్ , 1909 సంచిక) ఇలా పేర్కొన్నది : ‘స్త్రీల స్వాతంత్య్రము, కులాచార పద్ధతి, బాల వివాహము, విధవాద్వహము మొదలగు విషయములను చర్చ చేయుటకు మద్రాసులోను, బరహంపురములోను వేరుచోట్లను సంఘ సుధారణ సమాజము వారు కూడి యుండిరన్న సంగతి విని సంతసిల్లుచున్నాము’. ఈ సమాచారం ‘వివేకవతి’లో ‘సంఘ సుధారణ సమాజములు’ అనే శీర్షికతో ప్రచురింపబడినది.

పెన్నేపల్లి గోపాలకృష్ణ, డాక్టర్ కాళిదాసు పురుషోత్తం సంపాదకత్వంలో వెలువడిన మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం ‘గురుజాడలు’ గ్రంథంలో ‘గురజాడ జీవితంలో ప్రధాన సంఘటనలు’ అనే శీర్షిక క్రింద ‘బరంపురంలో భిన్న కులాల సహపంక్తి భోజనం – నవంబరు 1909’ అని పేర్కొన్నారు. సమగ్ర ఆంధ్ర సాహిత్య’ చరిత్రకారుడు ఆరుద్ర, ఇంకా అనేకమంది సాహితీకారులు బరంపురంలో సహవర్ణ సహపంక్తి భోజనాలు జరిగిన సంవత్సరం 1910గా పేర్కొన్నారు. అయితే పైన ప్రస్తావించిన మరువాడ సీతారామస్వామి రచనలో ఆ చరిత్రాత్మక విందు నిర్వాహకులు గాదె రాఘవరావు పంతులనీ, ఆ విందు 1909లో జరిగిందనీ స్పష్టంగా పేర్కొన్నారు. దీనిని బలపరచే విధంగా పైన ఉటంకించిన సమాచారమూ ఉండడం వల్ల సకలవర్ణ సహపంక్తి భోజనాలు బరంపురంలో జరిగిన సంవత్సరం 1909గా చెప్పవచ్చును. మహోన్నత సంస్కారవాది, ఆధునిక భావ జలధి, 114 సంవత్సరాల క్రితం బరంపురంలో సంస్కార బీజాలు నాటిన ఆనరబుల్‌ గాదె రాఘవరావు పంతులుగారికి జేజేలు.

డా. తుర్లపాటి రాజేశ్వరి

Updated Date - 2023-04-23T01:05:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising