ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ అందరి వాడా?

ABN, First Publish Date - 2023-04-14T02:11:58+05:30

దేశంలో ఎక్కువ విగ్రహాలు కలిగిన నేత ఎవరని ప్రశ్నించుకుంటే మొదట గుర్తుకు వచ్చే పేరు గాంధీది. ఆశ్చర్యం అనిపించినా నిజం మాత్రం అది కాదు. విగ్రహాల్లో అంబేడ్కర్‌దే రికార్డు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దేశంలో ఎక్కువ విగ్రహాలు కలిగిన నేత ఎవరని ప్రశ్నించుకుంటే మొదట గుర్తుకు వచ్చే పేరు గాంధీది. ఆశ్చర్యం అనిపించినా నిజం మాత్రం అది కాదు. విగ్రహాల్లో అంబేడ్కర్‌దే రికార్డు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆవిష్కృతం అవుతున్న అంబేడ్కర్‌ విగ్రహం సైజులో మరో రికార్డుగా నిలుస్తుంది. గాంధీ విగ్రహాలను స్థాపించటంలో కాంగ్రెస్‌ నేతలు ఒకనాడు పోటీలు పడ్డారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండబట్టి అర్థ అంగ బలాల్లో వారికి కొదవలేదు. అంబేడ్కర్‌కు ఈ అనుకూలతలు లేవు. 1956 నుంచి 1980ల చివరి వరకూ మేధావులు, రాజకీయ పార్టీలు ఆయనను పెద్దగా పట్టించుకోలేదు. 1990ల నుంచి పరిస్థితి మారింది. అప్పటికే ప్రపంచంలో సామ్యవాద సమాజాలు కుప్పకూలటం మొదలయ్యాయి. మండల్‌ రిజర్వేషన్ల వివాదాల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెను మార్పులు మొదలయ్యాయి. వెనుకబడిన తరగతుల వారు (బీసీలు) బలంగా సంఘటితం అయ్యారు. కులాల పాత్రపై పాత, కొత్త ప్రశ్నలు తలెత్తాయి. అంబేడ్కర్‌ ఆలోచనలు, ఆచరణలపై మళ్లీ ఆసక్తి రాజుకుంది. ఆయన రచనలను చదివే వారి సంఖ్య పెరిగింది. విగ్రహాల స్థాపన ఆ స్థాయిలోనే ఆరంభమైంది. ఒక్క అంబేడ్కర్‌ విషయంలోనే కాదు.. మరెన్నో విషయాల్లో 1990ల్లో కొత్త చూపు మొదలైంది. మన స్వాతంత్య్ర ఉద్యమాన్ని చూసే కోణమే మారిపోయింది. సబాల్ట్రన్‌ స్టడీస్‌ పేరుతో చరిత్ర రచనలో కొత్త ఒరవడి మొదలైంది. నాయకుల ఆలోచనలు, నిర్ణయాలు, వారిచ్చిన ఉద్యమ పిలుపుల పరంగా చరిత్ర రాయటం పాక్షికమనే ధోరణి ప్రబలింది. ముఖ్యంగా కింది స్థాయి జనం... నేతల పిలుపులను ఎలా స్వీకరించారు? ఎలా అర్థం చేసుకున్నారు? ఆందోళనల్లో ఎందుకు పాల్గొన్నారు? స్థానికంగా వారిని ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి?.. ఇలా ఎన్నో ప్రశ్నలు. వీటికి జవాబులు వెతుకుతూ చరిత్ర రచన కొత్త పుంతలు తొక్కింది.

స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌ది ఒక ప్రధాన ప్రవాహం అనుకుంటే దానికి తోడుగానూ, సమాంతరం గానూ విభిన్న సిద్ధాంతాలతో చాలా ప్రవాహాలు, ఆచరణలు కనపడతాయి. అందులో అంబేడ్కర్‌ ప్రవాహం కూడా ఒకటి. విగ్రహాలు ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు. సైజుల్లో, ఖర్చుల్లో రికార్డులూ స్థాపించవచ్చు. కానీ అంబేడ్కర్‌ ఆలోచనా ప్రవాహం సంగతేమిటి? ఇప్పుడు అంబేడ్కర్‌ని అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకుంటున్నాయి. ఒకనాడు తీవ్రంగా వ్యతిరేకించిన వారే ఇప్పుడు పెద్దపీట వేస్తున్నారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానానికి దక్కిన విజయంగా దీన్ని భావించలేం. గతంలో కావాలని ఉపేక్షించి అంబేడ్కర్‌ని తక్కువ చేశారు. ఇప్పుడు పోటీలుపడి తమ వాణ్ని చేసుకుని ఆయన ఆలోచనా ధార ఏమిటో తెలియకుండా చేస్తున్నారు. ఏ అంశాలపై ఆయనను అక్కున చేర్చుకుంటున్నారో అర్థంకాని పరిస్థితిని ప్రజలకు కల్పిస్తున్నారు.

అంబేడ్కర్‌ భావాలు చాలా పదునైనవి. నిజ స్ఫూర్తితో వాటిని అర్థం చేసుకుంటే, ఆయన తర్కాన్ని నిజాయితీగా అంగీకరిస్తే పార్టీల ఆచరణ పెనుమార్పులకు లోను కావాల్సి వస్తుంది. చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పటంలో అంబేడ్కర్‌కు సాటి రాగలిగిన నేతలను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆయన ఇంగ్లిషులో సరళత, సూటితనం ప్రతి వాక్యంలోనూ కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అనవసర విశేషణాలు కనపడవు. జాతీయాలు, నుడికారాల వాడకం తక్కువ. శైలీ సులభతకు మరో కారణం రాస్తున్న విషయంపై ఆయనకున్న స్పష్టత. ఎంతో క్లిష్టమైన విషయాన్నైనా సూటి వాక్యాలతో చెప్పేవారు. మహా మేధావిగా పేరుపొందిన బెట్రండ్‌ రసల్‌ శైలితో అంబేడ్కర్‌ శైలిని పోల్చవచ్చు.

రిజర్వేషన్ల సృష్టికర్త అంబేడ్కర్‌ అని చాలా మంది అనుకుంటారు. అది నిజం కాదు. కారణాలేమైనా బ్రిటిష్‌ పాలకులే వాటిని రకరకాల రూపాల్లో అమల్లోకి తెచ్చారు. సంస్థానాధీశులు సైతం వాటిని ప్రవేశపెట్టారు. దళిత పిల్లల కోసం 1892లోనే బ్రిటిష్‌ పాలకులు ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేశారు. అప్పటి పాఠశాలల్లో దళిత పిల్లలను చేర్చుకోవటానికి అగ్రకులాలు ససేమిరా అనటంతో ఎంతో శక్తిమంతం అనుకున్న బ్రిటిషు ప్రభుత్వం ఏమీ చేయలేక ప్రత్యేక స్కూళ్లను తెరిచింది. పౌర ఉద్యోగాల్లో దళితులకు దశల వారీగా రిజర్వేషన్లు అమలుచేసింది. 1946 నాటికి ఆ రిజర్వేషన్లు 12.5 శాతానికి చేరాయి. చట్ట సభల్లోనూ కొన్ని సీట్లను దళితులకు కేటాయించింది. ఇక దళితులతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన మద్రాసు ప్రెసిడెన్సీలో 1870ల్లోనే మొదలైంది. 1920 నాటికి ఈ రెండు వర్గాల్లోనూ 131 కులాలను గుర్తించి రిజర్వేషన్లను అమలు చేశారు. కొల్హాపూర్‌ సంస్థానంలో 1902లోనే 50 శాతం ఉద్యోగాలను బీసీలకు కేటాయించారు. మైసూరు సంస్థానంలో బీసీల రిజర్వేషన్ల కోసం మిల్లర్‌ కమిషన్‌ ఏర్పాటైంది. 50 శాతం ఉద్యోగాలను ఈ వర్గాలకు ఇవ్వాలని ఆ కమిషన్‌ సిఫార్సు చేసింది. బొంబే లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో 1919 నాటికి మరాఠాలకు 7 సీట్లు రిజర్వు చేశారు. మద్రాస్‌ కౌన్సిల్‌లోని 65 సీట్లల్లో 28 స్థానాలను బ్రాహ్మణేతర వర్గాలకు ప్రత్యేకించారు. 48 శాతం ఉద్యోగాలను ఈ వర్గాలకు రిజర్వు చేశారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు అగ్రకులాలుగా భావిస్తున్న అనేక కులాలను ఆనాడు వెనుకబడిన కులాలుగా పరిగణించారు.

చరిత్రలోని ఈ నిజాల దృష్ట్యా అంబేడ్కర్‌ని రిజర్వేషన్ల సృష్టికర్తగా భావించి ఆయన కృషిని కొలవలేం. కానీ రిజర్వేషన్లకు అవసరమైన బలమైన సైద్ధాంతిక భూమికను కల్పించటంలోనూ అణగారిన వర్గాలకు మరెన్నో రక్షణలను రాజ్యాంగంలో పొందుపరచటంలోనూ ఆయన పాత్ర విశేషమైంది. మరి అంబేడ్కర్‌ విశిష్టత అంతేనా? నవ భారత నిర్మాణానికి ఆయన కృషి ఏమిటి? అని ప్రశ్నించుకుంటే అది బహుముఖంగా కనపడుతుంది. స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అన్న భావనలతో ఆధునిక సమాజం 18వ శతాబ్దంలో ఊపిరి పోసుకుంది. ఫ్రెంచ్‌విప్లవం ఈ ఆదర్శాలను నినదించింది. అంబేడ్కర్‌కు ప్రేరణ ఈ ఆదర్శాలు. అమెరికా తత్వవేత్త జాన్‌ డ్యూయి, చరిత్రకారుడు జేమ్స్‌ హార్వే, మానవ–కార్మిక హక్కుల నిపుణుడు జేమ్స్‌ టి.షాట్‌ వెల్‌ల ప్రభావం అంబేడ్కర్‌పై చాలా ఎక్కువ. వీళ్లందరూ కూడా ఫ్రెంచ్‌ విప్లవ ఆదర్శాలను రకరకాల కోణాల్లో విపులీకరించిన వారే. ప్రగతి పథంలో సాగే ఒక క్రమంగా చరిత్రను తెలుసుకోవటంలో జేమ్స్‌ హార్వేనే ప్రేరణ. మానవ హక్కుల విస్తరణ అభ్యుదయానికి చోదకశక్తి అనే భావాన్ని షాట్‌వెల్‌ నుంచి అంబేడ్కర్‌ గ్రహించారు. సామాజిక సమానత్వం దిశగా సమాజాన్ని నడిపించటంలో ప్రజాస్వామ్య సంస్థలకు ఎంతో సామర్థ్యం ఉందని జాన్‌డ్యూయి నుంచి తెలుసుకున్నారు.

ఫ్రెంచ్‌విప్లవ నినాదాల్లో ఒకటైన సమానత్వం అంటే ఆర్థిక సమానత్వం కాదు. సామాజిక సమానత్వం. సంపూర్ణ ఆర్థిక సమానత్వంపై అంబేడ్కర్‌కి ఎప్పుడూ గురిలేదు. మార్క్సిజంపై అంబేడ్కర్‌ అయిష్టతకు ఇదీ ఒక కారణం. కులం, మతం చూడకుండా మనిషికి సముచిత గుర్తింపుని ఇవ్వటం సామాజిక సమానత్వంలో ప్రధానమైంది. ఇది లేనిదే పౌరుల మధ్య సౌభ్రాతృత్వం ఉండదు. ఈ రెండు లేకపోతే నచ్చిన రంగాల్లో స్వేచ్ఛగా ఎదిగే అవకాశం ఉండదు. అంటరానితనం దారుణత్వాన్ని అనుభవించిన అంబేడ్కర్‌.. దేశంలో సామాజిక సమానత్వం లేకపోవటానికి హిందూ మత గ్రంథాలు, అవి కల్పించిన బ్రాహ్మణ ఆధిక్యతే కారణాలుగా భావించారు. కులం ప్రభావవంతంగా ఉన్నంత వరకూ సామాజిక సమానత్వం ఏర్పడదన్న విశాల దృష్టితో పోరాటం ఆరంభించారు. కులాన్ని సమర్థించే హిందూ మత గ్రంథాలను విమర్శించారు. మనుస్మృతిని దగ్ధంచేసే ఆందోళనకు నేతృత్వం వహించారు. బౌద్ధం బోధించిన సమానత్వ భావనలను దెబ్బతీయటానికే భగవద్గీతని రచించారని వాదించారు. సమానత్వానికి అడ్డంకిగా ఉన్న ఏ సంప్రదాయ రచనను అంబేడ్కర్‌ వదలలేదు. అంబేడ్కర్‌ విమర్శించిన సంప్రదాయాలను, సంస్కృతిని మహోన్నతమైనవిగా భావించే వారికి ఇప్పుడు ఆయన ప్రీతిపాత్రుడు అయ్యారు. చరిత్ర టక్కరి తనం అంటే ఇదేనేమో!

రిజర్వేషన్లను శాశ్వత ఏర్పాటుగా అంబేడ్కర్‌ పరిగణించలేదు. విచక్షణకు లోనైన వర్గాలకు ఒక స్థాయి వరకూ సముచిత ప్రాతినిధ్యాన్ని కల్పించే పరిమిత కాల విధానంగానే భావించారు. కులతత్వం, కుల ఆలోచనలు ప్రబల శక్తులుగా మారటానికి అంబేడ్కర్‌ వ్యతిరేకం. కానీ ఇప్పటి రాజకీయాల నడకే వీటిపై ఆధారపడి ఉంది. అస్తిత్వ రాజకీయాల పేరుతో ఆలోచనలు కులాల చుట్టూ ఇప్పుడు ఇంకా బలంగా తిరుగుతున్నాయి. దేశంలో లిబరల్‌ డిమాక్రసీ బలంగా వేళ్లూనుకోవాలని అంబేడ్కర్‌ కోరుకున్నారు. దానికి అడ్డంకిగా ఉన్న అన్ని సిద్ధాంతాలపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. హిందూ మత గ్రంథాలతో పాటు సామాజిక సమానత్వాన్ని బోధించిన బౌద్ధ గ్రంథాలను అంబేడ్కర్‌ అంత లోతుగా అధ్యయనం చేసిన వారు రాజకీయ నేతల్లో లేరనే చెప్పొచ్చు. కులాలను, వర్ణాలను దైవసృష్టిగా పేర్కొనే హిందూ గ్రంథాలను ఏమీ విమర్శించకుండా దళితోద్ధరణకు పూనుకోవాలని గాంధీ అనటంతోనే ఆయనతో విభేదించారు. పాకిస్థాన్‌ ఏర్పాటు ప్రతిపాదనను అంబేడ్కర్‌ సమర్థించారు. కశ్మీర్‌ సమస్యపై ప్లెబిసైట్‌ తప్పనిసరి అని చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు సామాజిక శాస్త్రాల్లో ఎన్నో ముందడుగులు పడ్డాయి. అంబేడ్కర్‌ సూత్రీకరణలన్నిటిని ఇప్పుడు యథాతథంగా ఆమోదించలేం. మహామహులందరికీ వర్తించే నియమం అది.

అంబేడ్కర్‌ ఆశించిన దానికి భారత సమాజం ఇంకా చాలా దూరంలో ఉంది. కుల ఆలోచనలు పెంచే శక్తులతో పాటు వ్యక్తులూ పెరుగుతున్నారు. దీనికి విరుగుడు అంబేడ్కర్‌ అక్షరాల్లో ఇంకా సజీవంగానే ఉంది. గడిచిన వందేళ్లే కాదు అంతకు ముందు శతాబ్దాల చరిత్ర అర్థం కావటానికి ఆయన రచనలు ఇంకా కొత్త వాకిళ్లు తెరుస్తూనే ఉంటాయి.

రాహుల్‌ కుమార్‌

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2023-04-14T02:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising