అసమాన వ్యక్తిత్వాల చరిత్రకారుడు
ABN, First Publish Date - 2023-07-12T00:43:58+05:30
రావినూతల శ్రీరాములు గారు జులై 1వ తేదిన నిశ్శబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో గుంటూరులో కాలం గడుపుతున్నప్పటికీ...
రావినూతల శ్రీరాములు గారు జులై 1వ తేదిన నిశ్శబ్దంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో గుంటూరులో కాలం గడుపుతున్నప్పటికీ ఇంత త్వరగా ఈ వార్త వినవలసి వస్తుందనుకోలేదు.
శ్రీరాములు ఒక నిరంతర సాహితీకృషీవలుడు. జీవనోపాధి కోసం ఆయన చేసిన వృత్తికి, ఆయన ప్రవృత్తికి అసలు ఏ మాత్రం పొంతనలేదు. 1936 అక్టోబర్ 12న ప్రకాశం జిల్లా మామిడిపాడు గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో రావినూతల శ్రీరాములు జన్మించారు. తల్లిదండ్రులు అనసూయమ్మ, సత్యనారాయణ. తండ్రి సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేశారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివిన శ్రీరాములు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికై, 1958లో చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో గుమాస్తాగా చేరారు. అనంతపురం జిల్లా తనకల్లులో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ 1993 ఆగష్టు 30న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు.
పెద్దలతో ఆయనకు ఏర్పడిన నిరంతర సహచర్యం శ్రీరాములు జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఆయన ఒక రచయితగా రూపుదిద్దుకోడానికి తోడ్పడింది. ఆయన కలం నుంచి పదికి పైగా దేశభక్తి రచనలు, 12 వరకు భక్తి సాహిత్య రచనలు వెలువడ్డాయి. ఒక ప్రక్క ఉద్యోగ బాధ్యతలను ఏ లోపం లేకుండా నిర్వహిస్తూనే ఎన్నో పత్రికలలో సమకాలీన అంశాలపైనా, సాహిత్యంపైనా నిర్విరామంగా వ్యాసాలు రాసేవారు.
శ్రీరాములు రచనలన్నీ ఒక ఎత్తు, ఆయన చేసిన జీవిత చరిత్రల రచనలు మరొక ఎత్తు. జీవిత చరిత్రల రచనలో ఆయన నిష్ణాతుడు. దాదాపు వందమందికి పైగా ప్రముఖులపైన అనన్యసామాన్యమైన రీతిలో, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, పరిశోధనలు చేసి, వారి జీవిత చరిత్రలను గ్రంథస్థం చేయడమే కాక, వాటిని ప్రచురింపజేసి పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు. ఇదొక మహత్తర సాహితీ కృషి. ఈ ప్రముఖులలో ప్రకాశం పంతులు, పప్పూరు రామాచార్యులు, పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్, కల్లూరి సుబ్బారావు, పండిట్ నెహ్రూ వంటి రాజకీయనేతలు, శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజన్యులు, ప్రభాకర్ జీ, పొణకా కనకమ్మ వంటి సేవాతత్పరులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి సంస్కరణశీలురు ఎందరో ఉన్నారు. మా నాన్నగారు మండలి వెంకటకృష్ణారావు సంక్షిప్త జీవితచరిత్రను ‘మహితాత్ముడు’ పేరుతో రాశారు. తన రచన ‘ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య’ పుస్తకాన్ని శ్రీరాములు నాకు అంకితమిచ్చారు. దీనిని ఎమెస్కో వారు ప్రచురించారు.
ప్రసిద్ధ మహనీయులు తూముకుంట భీమ్‌సేన్ రావు సప్తతి సంచిక, పప్పూరు రామాచార్యులు 85వ జయంతి సంచిక, మద్దూరి అన్నపూర్ణయ్య శతజయంతి సంచిక, చైతన్య 70వ జయంతి సంచిక... వంటి ప్రత్యేక సంచికలకు శ్రీరాములు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు.
దాదాపు 80ఏళ్ళ తన జీవితంలో ఎదురైన, అనుభవించిన సంఘటనలను, వ్యక్తులను, సన్నివేశాలను, ప్రదేశాలను, విషయాలను వివరంగా గుర్తుపెట్టుకుని తరువాతి తరానికి అందించడం కోసం 2017 మార్చిలో ‘అంతర్మధనం’ పేరుతో తన జీవిత చరిత్రను గ్రంథస్థం చేశారు. దీనిని ఎమెస్కో వారు ప్రచురించారు సాహితీ సేవలకు గుర్తింపుగా 1977లో జాతీయ అవార్డు, 1997లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం, 2016లో సద్గురు శివానందమూర్తి గారి సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతిభా పురస్కారం అందుకున్నారు.
రావినూతల శ్రీరాములు రమణ మహర్షి భక్తులు. అనంతపురంలో రమణ సత్సంగం స్థాపించి శ్యాం శ్రీచరణుల వంటి ప్రముఖులను ఆహ్వానించి రమణ మహర్షిపై ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ‘నాయన’గా ప్రసిద్ధి చెందిన కావ్యకంఠ గణపతి ముని జయంతి ఉత్సవాలను కూడా రమణ సత్సంగంలో నిర్వహించేవారు. గణపతి ముని సంస్కృతంలో రచించిన 500 శ్లోకాలు గల ‘ఉమాసహస్రం’ను యామిజాల వారి వ్యాఖ్యతో ప్రచురించి, ‘నాయన’ గారి కుమార్తె శ్రీమతి వజ్రేశ్వరి గారికి, ఆమె చిరునామాను తెలుసుకుని పంపారు. ‘నాయన గారి ఉమ మా ఇంటికి వచ్చింది’ అంటూ ఆమె తిరిగి శ్రీరాములు గారికి జాబు రాసిందట. ఆ తరువాత వజ్రేశ్వరి కుటుంబంతో శ్రీరాములుకు మంచి అనుబంధం ఏర్పడింది.
2010 అక్టోబర్‌లో ఆయన అర్ధాంగి రంగమ్మ పరమపదించగా శ్రీరాములు అపరిమితమైన మనోవ్యథకు లోనయ్యారు. అంతకుముందే 1999లో మధుమేహ వ్యాధి మూలంగా ఏర్పడిన గ్యాంగ్రిన్ మూలంగా ఆయన ఎడమ కాలులో కొంత భాగాన్ని తొలగించారు. దానితో ఎవరి ఆసరా లేకుండా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఆయన ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణిస్తున్నందు వల్ల గుంటూరు వెళ్ళి కుమార్తె వద్ద వుంటున్నారు. అక్కడ ఆయన పూర్తిగా మంచంలోనే వుండిపోయారు. గుంటూరు వెళ్ళినప్పుడు శ్రీరాములు వద్దకు వెళ్ళి పరామర్శించి వస్తుండేవాడిని. ఈ విధమైన శారీరక, మానసిక వేదనలు ఎన్ని అనుభవిస్తున్నా, కన్నుమూసే వరకు మంచంలో వుండి కూడా ఆయన సాహితీ వ్యవసాయం మాత్రం నిరంతరాయంగా కొనసాగించారు.
డా. మండలి బుద్ధప్రసాద్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ ఉపసభాపతి
Updated Date - 2023-07-12T00:43:58+05:30 IST