గజ్వేల్ నుంచి తిరుపతికి త్వరలోనే రైళ్లు
ABN, First Publish Date - 2022-05-14T08:02:32+05:30
త్వరలోనే గజ్వేల్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నామని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెసోళ్లకు ఎన్ని అర్జీలు ఇచ్చినా పనులు కాకపోయేవి: హరీశ్
గజ్వేల్, మే 13: త్వరలోనే గజ్వేల్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపనున్నామని మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, మర్కుక్, వర్గల్ మండలాల్లో మినీ ఐవోసీలకు, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలో రూ.8 కోట్లతో నిర్మించనున్న మోడల్ బస్టాండ్, బస్‌బేలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. గజ్వేల్ నియోజకవర్గానికి 2014 తర్వాత మహర్దశ పట్టుకుందని, గతంలో కాంగ్రెసోళ్లకు ఎన్ని అర్జీలిచ్చినా ఫలితం ఉండేది కాదని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రస్తుతం అర్జీలు ఇవ్వకున్నా పనులు చేస్తున్న ప్రభుత్వం, నాయకుడు మన కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని.. అందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. సొంత జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు త్వరలోనే అందిస్తామని మంత్రి ప్రకటించారు.