రిట్ అధికార పరిధిలో టైటిల్ వివాదాన్ని తేల్చలేం: హైకోర్టు
ABN, First Publish Date - 2022-05-14T08:52:33+05:30
రిట్ అధికార పరిధిలో భూమికి సంబంధించిన టైటిల్ వివాదాన్ని తేల్చడం సాధ్యంకాదని హైకోర్టు పేర్కొంది.
భూవివాదంలో నిజాం ఫెర్న్ హిల్ ట్రస్ట్‌కు చుక్కెదురు
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): రిట్ అధికార పరిధిలో భూమికి సంబంధించిన టైటిల్ వివాదాన్ని తేల్చడం సాధ్యంకాదని హైకోర్టు పేర్కొంది. వివాదంలో ఉన్న భూమి యాజమాన్య హక్కులను నిరూపించుకోవడానికి సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని ఏడో నిజాం స్థాపించిన ఫెర్న్ హిల్ ట్రస్ట్‌కు స్పష్టంచేసింది. ఏడో నిజాం తన భార్య లైలా బేగంకు జన్మించిన ఏడుగురు సంతానం ప్రయోజనాల కోసం 1957లో ఫెర్న్ హిల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని గడ్డిఅన్నారం గ్రామంలో 25 ఎకరాల భూమిని దీనికి కేటాయించారు. ఇందులో 3.08 ఎకరాల భూమిని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, దూరదర్శన్‌లు టీవీ ట్రాన్స్‌మిషన్ స్టేషన్ ఏర్పాటు కోసం సేకరించాయి. 1976 నుంచి భూమి కేంద్రం ఆధ్వర్యంలో ఉంది. అయితే ఆ భూమికి పరిహారం చెల్లించలేదని ఫెర్న్ హిల్ ట్రస్ట్ 2002లో హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ధర్మాసనం ట్రస్ట్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ట్రస్ట్ డివిజన్ బెంచ్‌లో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూమిని ట్రస్ట్ డీడ్‌లో చేర్చారా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. సరైన కోర్టును ఆశ్రయించి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలని తెలిపింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ ఫెర్న్ హిల్ ట్రస్ట్ అప్పీల్‌ను కొట్టేసింది.