పులులను కాపాడాల్సిన బాధ్యత మీదే: ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌

ABN , First Publish Date - 2022-05-12T17:40:15+05:30 IST

అరుదైన పెద్ద పులులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని కవ్వాల్‌ రిజర్వు ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ సూచించారు. అఖిలభారత పులుల గణన

పులులను కాపాడాల్సిన బాధ్యత మీదే: ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌

- పాల్గొన్న నాలుగు జిల్లాల అటవీ అధికారులు

ములుగు (జనగామ): అరుదైన పెద్ద పులులను కాపాడాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉందని కవ్వాల్‌ రిజర్వు ఫారెస్టు ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ సూచించారు. అఖిలభారత పులుల గణన కార్యక్రమంలో భాగంగా ములుగు కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పులుల కదలికలను గమనిస్తూ ..ట్రాప్‌ కెమెరాల ద్వారా పెద్దపులి కదలికలను పరిశీలించాలన్నారు. ములుగు జిల్లాకు 100, భూపాలపల్లికి 70, వరంగల్‌, జనగామ జిల్లాలకు 50చొప్పున ట్రాప్‌ కెమెరాలను కేటాయించినట్టు తెలిపారు. పులులు, మాంసాహార జంతువులు సంచరించే కీలక ప్రదేశాల్లో వాటిని అమర్చాలని సూచించారు. ఈనెల 14 నుంచి నెలరోజులపాటు రోజూ వీడియో రికార్డులను సేకరించి నివేదిక రూపొందించాలన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా అటవీ ప్రాంతం నుంచి తెలంగాణ అడవుల్లోకి పెద్దపులుల సంచారం జరుగుతోందని అన్నారు. ములుగు, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున శాఖాహార జంతువులు వృద్ధి చెందాయని, ఈ క్రమంలో మాంసాహార జంతువుల సంచారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిర్మల్‌, కవ్వాల్‌ రిజర్వు ఫారెస్టుకు సంబంధించిన టెక్నికల్‌ సిబ్బంది ట్రాప్‌ కెమెరాల పనితీరుపై అవగాహన కల్పించారు.  శిక్షణలో ములుగు డీఎఫ్‌వో ప్రదీప్‌కుమార్‌శెట్టి, ఎఫ్‌డీవో జోగేందర్‌, తాడ్వాయి ఎఫ్‌డీవో ఆశిష్‌, వెంకటాపురం (నూగూరు) ఎఫ్‌డీవో గోపాల్‌రావు, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, జనగామ జిల్లాలకు చెందిన రేంజ్‌, బీట్‌,  సెక్షన్‌ ఆఫీసర్లు మొత్తం 160 మంది పాల్గొన్నారు. 

 

Read more