అమేజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు హర్షనీయం
ABN, First Publish Date - 2022-05-14T05:59:56+05:30
అమేజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు హర్షనీయం
- రూ.కోటితో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి సబితారెడ్డి అభినందన
- మన ‘ఊరు-మన బడి’కి ప్రభుత్వం రూ.7300 కేటాయించినట్లు వెల్లడి
షాబాద్, మే 13: విద్య, వైద్యంలో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు హర్షనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని హైతాబాద్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో కన్సర్స్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను ఏర్పాటు చేయగా ఏడబ్ల్యూఎస్ డైరెక్టర్ సాజి పీకే, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు, క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యా, వైద్యం కోసం అమెజాన్ వెబ్‌సర్వీసు ద్వారా రూ.కోటి ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే హైతాబాద్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కార్పోరేట్ విద్యాలయాలకు దీటుగా సంస్థ మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా మహేశ్వరంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా సమయంలో సమాజసేవలో ముందుండి సేవలు అందించినట్లు తెలిపారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ, అంబులెన్స్ ఏర్పాటు చేసి పేదరోగులకు సేవలందించే విధంగా సంస్థ చూస్తుందన్నారు. ప్రచారానికి పోకుండా సమాజసేవ కోసం కోట్ల రూపాయాలు ఖర్చు చేసి అమెజాన్ వెబ్ సర్వీసు అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి ప్రతి పాఠశాలలో అన్ని వసతులు ఉండేలా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి రూ.7300కోట్లు కేటాయించినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెయ్యి గురుకుల పాఠశాల్లో విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడున్నర సంవత్సరాల కాలంలో 400 నుంచి 1050ఇంటర్మీడియట్ కళాశాలలుగా మార్చినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేదవిద్యార్థులకు సైతం ప్రభుత్వం తరఫున రూ.20లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు తెలిపారు. నక్కలపల్లి నుంచి హైతాబాద్ బ్రిడ్జి కింద నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీఈవో సుశిధర్‌రావు, ఆర్డీవో వేణుమాధవరావు, ఎంపీడీవో అనురాధ, ఎంఈవో శంకర్‌రాథోడ్, పీఆర్ డీఈ విజయ్‌కుమార్, ఏఈ దివ్య, సర్పంచులు మల్లేష్, ప్రభాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచులు జనార్ధన్‌రెడ్డి, ఖాజామియా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.