పండుగ రోజే విషాదం
ABN, First Publish Date - 2022-05-14T06:39:54+05:30
అప్పటివరకు ఆ ఇంట్లో పండుగ ఆనందం వెల్లివిరిసింది. కుటుంబసభ్యులతో పాటు బంధువులు, మిత్రులను పండగకు ఆ కుటుంబం ఆహ్వానించింది.
తాగిన మైకంలో మిత్రుడు కారు డ్రైవింగ్
ఘటనలో యువకుడి మృతి
వలిగొండ, మే 13 : అప్పటివరకు ఆ ఇంట్లో పండుగ ఆనందం వెల్లివిరిసింది. కుటుంబసభ్యులతో పాటు బంధువులు, మిత్రులను పండగకు ఆ కుటుంబం ఆహ్వానించింది. పండగ ఆనందంలో మిత్రులతో కలిసి మద్యం తాగిన మిత్రుడు అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి గురిచేశాడు. ఈ ఘటనలో పండుగ నిర్వహించిన ఇంటి యజమాని ఏకైక కుమారుడు మృతి చెందాడు. దీంతో పండుగ రోజే ఇంట్లో విషాదం నెలకొంది. ఈ దుర్ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన కల్లూరి మల్లేశం కుమారుడు కల్లూరి శంకర్(22) అవివాహితుడు. ఆరు నెలల క్రితమే సుంకిశాలలోని ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం సంపాదించాడు. గురువారం వారి ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉండటంతో శుభకార్యానికి మిత్రులు కాసుల ప్రశాంత, కాసుల ఉదయ్, సిరికొండ పవనను ఆహ్వానించాడు. వారంతా శంకర్ ఇంటికి కాసుల ప్రశాంత కారులో నాగారం వచ్చారు. అక్కడి నుంచి గురువారం రాత్రి ప్రశాంత తీసుకువచ్చిన కారులో వలిగొండకు బయలుదేరారు. ప్రశాంత కారును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ మండల కేంద్రంలోని టిఫిన సెంటర్ తోపుడు బండిని ఢీకొట్టి అంతేవేగంతో పాత్రికేయుడి ఇంటి ముందుకు దూసుకువచ్చి బలంగా దుకాణం షెట్టర్‌ను ఢీకొట్టింది. భారీగా శబ్దం రావడంతో స్థానికులు నిద్రనుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ప్రమాదంలో ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న కల్లూరి శంకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్సలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు మేడిపల్లిలోని కాకతీయ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. కారు నడుపుతున్న ప్రశాంతతో పాటు మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిలో ఒకరిని హైదరాబాద్‌కు, మరో ఇద్దరిని భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శంకర్ తండ్రి కల్లూరి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకర్ తెలిపారు. కాగా మల్లేశంకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతికి ఎదిగివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి దుఃఖాన్ని చూసి పలువురు కంట తడి పెట్టారు.