భూవివాదంలో వృద్ధుడి హత్య
ABN , First Publish Date - 2022-05-15T05:17:05+05:30 IST
భూవివాదం నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మోతె మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత చోటుచేసుకుంది.
విచక్షణారహితంగా కత్తులతో దాడి
మోతె, మే 14 : భూవివాదం నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో వృద్ధుడు హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మోతె మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మోతె గ్రామానికి చెందిన పగడాల జనార్ధన్‌రెడ్డి(70), పూలమ్మ దంపతులు తమకున్న 10ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా, ఇద్దరినీ స్వగ్రామంలోని బంధువులకు ఇచ్చి 20 ఏళ్ల కిందట వివాహం చేశాడు. రోజు మాదిరిగానే జనార్ధన్‌రెడ్డి, భార్య పూలమ్మ, చిన్నకుమార్తె కుమారుడు సురకంటి ఉదయ్‌రెడ్డి వేర్వేరు మంచాల్లో ఇంటి ఆరుబయట నిద్రించారు. సుమారు అర్ధరాత్రి 1.40 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కత్తులతో జనార్ధన్‌రెడ్డి తల, మెడ ఎడమభాగంలో దాడిచేశారు. ఈ దాడి సమయంలో మేల్కొన్న భార్య పూలమ్మ దుండగులను చూసి కేకలు వేసింది. దీంతో పక్కనే పడుకున్న మనుమడు ఉదయ్‌రెడ్డి లేచి దుండగులను అడ్డుకోబోయాడు. ఈ క్రమంలో అతడిపై కూడా కత్తితో దాడి చేయడంతో చేతివేళ్లకు గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు వచ్చేలోపే జనార్ధన్‌రెడ్డి కడుపులో కత్తిని దింపి వదిలి దుండగులు వచ్చిన బైక్‌పైనే ఖమ్మం వైపు పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ సిబ్బందితో వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మోతె పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం మునగాల సీఐ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుడైన పగడాల గిరిధర్‌రెడ్డిపై అనుమానం ఉందంటూ మనుమడు ఉదయ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం కోదాడ డీఎస్పీ రఘు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.
గెట్టు పంచాయితీ హత్యకు దారి తీసిందా?
వివాదరహితుడిగా పేరున్న పగడాల జనార్ధన్‌రెడ్డి తన వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు. రెండేళ్ల కిందట తన పొలం వెంబడి ఉన్న పగడాల గిరిధర్‌రెడ్డితో గెట్టు పంచాయితీ నడుస్తోంది. ఈ వివాదం తప్ప జనార్ధన్‌రెడ్డికి ఎవరితో ఘర్షణ పడిన దాఖలాలు లేవని గ్రామస్థులు తెలిపారు. ఆ వివాదమే హత్యకు కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జనార్ధన్‌రెడ్డిని హత్యచేసేందుకు కొద్దిరోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు పొలం వద్ద, ఇంటి ముందు బైక్‌పై గస్తీ నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రెండు బృందాలతో గాలింపు
జనార్ధన్‌రెడ్డిని హత్య చేసిన దుండగులు ఖమ్మం వైపు పరారయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి అనుమానం ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. గతంలో భూతగాదాలు ఉన్న గిరిధర్ కిరాయి హంతకులతో హత్య చేయించాడని బాధితులు ఆరోపిస్తుండటంతో గిరిధర్‌రెడ్డికి సంబంధించిన వ్యక్తులను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.


