Munugode TRS : గెలవడమే పదివేలు

ABN , First Publish Date - 2022-11-07T03:55:58+05:30 IST

భారత్‌, పాక్‌ మధ్య టీ20 తరహాలో సాగిన మునుగోడు మ్యాచ్‌ ముగిసింది! ఫలితం తేలినా.. మ్యాచ్‌ ‘టై’గా ముగిసినట్టు ఎవరికీ పూర్తి సంతృప్తి దక్కలేదు! కారు గెలిచింది. కానీ, బేజారు మిగిలింది! గెలుపుతో ఇక హుషారే అనుకున్న కాషాయ పార్టీకి ..

Munugode TRS : గెలవడమే పదివేలు
TRS Party grand victory

టీఆర్‌ఎస్‌ ఆధిక్యం 10,309

ఉత్కంఠ పోరులో స్వల్ప మెజారిటీతో టీఆర్‌ఎస్‌ విజయం

మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలుపు

నల్లగొండలో ‘హ్యాట్రిక్‌’ కొట్టిన అధికార పార్టీ

గెలుపు వాకిట బోర్లా పడిన కాషాయ దళం

కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికలో పరాభవం

మొత్తం 15 రౌండ్లలో మూడింట్లోనే స్వల్ప ఆధిక్యం

కమలం పార్టీకి అండగా నిలవని పట్టణ ప్రాంతాలు

మళ్లీ డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ

మరో ఉప ఎన్నికకు పావులు కదుపుతున్న బీజేపీ?

వికసించిన ‘ఎర్ర’గులాబీ కలిసొచ్చిన కామ్రేడ్ల ఓటు బ్యాంకు

టీఆర్‌ఎస్‌ విజయంలో వామపక్షాల కీలకపాత్ర

వంద మంది ఎమ్మెల్యేలు, మంత్రులను మోహరించినా అత్తెసరు ఫలితమే..

దాదాపు 90 మంది ఎమ్మెల్యేలు.. పది మంది మంత్రులు మోహరించారు! ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు బహిరంగ సభల్లో పాల్గొన్నారు! ఇక్కడే అత్యధికంగా రైతు బంధు లబ్ధిదారులు! వీరికితోడు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా కలిపితే రెండు లక్షలకుపైనే! ఇక, ప్రజా ప్రతినిధులు, ఓటర్ల కొనుగోలులో రికార్డు బ్రేక్‌ చేశారు! అర్ధ, అంగ బలాలను ప్రదర్శించారు! సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు! అయినా, అత్తెసరు మెజారిటీనే! గెలిచినా పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వని ఫలితమే! రౌండు, రౌండుకు వచ్చిన మెజారిటీలను పరిశీలిస్తే.. గెలవడమే పది వేలు అన్న పరిస్థితి! అధికార టీఆర్‌ఎస్‌కు మునుగోడు ఓటరు ఇచ్చిన తీర్పు ఇది!

నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారత్‌, పాక్‌ మధ్య టీ20 తరహాలో సాగిన మునుగోడు మ్యాచ్‌ ముగిసింది! ఫలితం తేలినా.. మ్యాచ్‌ ‘టై’గా ముగిసినట్టు ఎవరికీ పూర్తి సంతృప్తి దక్కలేదు! కారు గెలిచింది. కానీ, బేజారు మిగిలింది! గెలుపుతో ఇక హుషారే అనుకున్న కాషాయ పార్టీకి కషాయం తాగినట్లయింది! రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులుగా ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్‌ కోల్పోయారు. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో జరిగిన మూడో ఉప ఎన్నిక ఇది. నాగార్జున సాగర్‌, హుజూర్‌ నగర్‌లలో గెలిచినట్టే మునుగోడులోనూ గులాబీ గుబాళించింది! ఒకప్పుడు కాంగ్రె్‌సకు కంచుకోట అయిన నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొట్టింది! ఇందుకు ప్రధానంగా వామపక్షాలతో పొత్తు కలిసి వచ్చింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న మర్రిగూడెం, నాంపల్లి మండలాల్లో భారీ ఆధిక్యం దక్కడంతో టీఆర్‌ఎ్‌సకు విజయం ఖాయమైంది. నిజానికి, జాతీయ స్థాయిలో కాంగ్రె్‌సతో కలిసి కమ్యూనిస్టులు జట్టు కట్టినా.. అందరి కంటే ముందే అడుగు ముందుకు వేసి కమ్యూనిస్టులను ఆకర్షించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవంతమయ్యారు. ఆయన ముందస్తు వ్యూహమే టీఆర్‌ఎస్‌ విజయంలోనూ కీలక పాత్ర పోషించింది.

అంచనాలకు భిన్నంగా..

ప్రతి రౌండ్‌ ఫలితాలు అంచనాలకు భిన్నంగా వెలువడ్డాయి. తొలుత చౌటుప్పల్‌ మండలం ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ బీజేపీకి కనీసం ఆరేడు వేల మెజారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకున్నారు. కానీ, మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎ్‌సకు ఆధిక్యం వచ్చింది. ఆ తర్వాత రెండు, మూడో రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం వచ్చినా.. అది అతి స్వల్పమే. మూడు రౌండ్లు ముగిసిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ స్వల్ప మెజారిటీ సాధించింది. నిజానికి, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించడంతో తర్వాతి రౌండ్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరికి, పదో రౌండ్‌లో చండూరు మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపు వచ్చినప్పుడు బీజేపీదే హవా కొనసాగుతుందని అంతా అంచనా వేశారు. దాంతో, చివరి వరకూ నువ్వా నేనా అన్నట్లు సాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, మొత్తం 15 రౌండ్లలో కేవలం మూడు రౌండ్లలోనే బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చండూరు మునిసిపాలిటీలో టీఆర్‌ఎ్‌సకు మెజారిటీ రావడంతోనే బీజేపీ నేతలు ఆశలు వదులుకున్నారు. ఇక, సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, గట్టుప్పల్‌ వంటి కమ్యూనిస్టు కంచుకోటలు, గ్రామీణ ప్రాంతాల్లో భారీ మెజారిటీ రావచ్చని టీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేసుకున్నారు. కానీ, అంచనాలకు భిన్నంగా ఏ రౌండ్‌లోనూ మెజారిటీ వెయ్యి దాటలేదు. వామపక్షాలు బలంగా ఉన్న సంస్థాన్‌ నారాయణపురం మండలంలో మంచి మెజారిటీ సాధిస్తామని అంచనా వేసుకుంటే, అక్కడ టీఆర్‌ఎ్‌సకు వచ్చిన మెజారిటీ కేవలం 1,754 ఓట్లు మాత్రమే. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 11 రౌండ్లు పూర్తయినా మెజారిటీ 5000 మార్కు దాటకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే, 12వ రౌండ్‌లో మర్రిగూడ మండలంలో టీఆర్‌ఎ్‌సకు ఒక్కసారిగా రెండు వేల ఆధిక్యం లభించడంతో ఆ పార్టీ నేతలు విజయం ఖాయమని భావించి ఊపిరి పీల్చుకున్నారు.

కోరి తెచ్చుకున్న కొరివి...

ఉప ఎన్నికను ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన పార్టీలకు ఎదురు దెబ్బలు తప్పట్లేదు. హూజూరాబాద్‌ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌ తీసుకొచ్చింది. అక్కడ ఆపార్టీ ఓటమి పాలైం ది. ఇక, మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ఏరి కోరి మరీ తెచ్చుకుంది. ఇక్కడ బీజేపీకి పరాభవం తప్పలేదు. కాగా, తమ పరాభవానికి ఎన్నికల కమిషన్‌ను తప్పుబట్టారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. ఆయన వైఖరి అనుమానాస్పదంగా ఉందని, ఫలితాలను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారని ఆరోపించారు. అదే సమయంలో, మునుగోడులో ఓడిపోయినా ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని భావిస్తున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మరో ఉప ఎన్నికను తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోందనే అభిప్రాయం ఆ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక, కారును పోలిన గుర్తులు ఈసారి కూడా టీఆర్‌ఎస్‌ మెజారిటీకి గండికొట్టాయి. రోడ్డు రోలర్‌, రోటీ మేకర్‌, చెప్పుల గుర్తులకు ఆరు వేల పైచిలుకు ఓట్లు వచ్చాయని, ఆ మేరకు టీఆర్‌ఎస్‌ మెజారిటీకి గండి పడిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

దుబ్బాక, హుజూరాబాద్‌ల్లో గెలిచిన ఆనందం! మరో ఉప ఎన్నికలోనూ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాలర్‌ ఎగరేయొచ్చనే వ్యూహం! కోరి మరీ, ఉప ఎన్నికను రుద్దిన కమలం! సాక్షాత్తూ అగ్ర నేత అమిత్‌ షా వచ్చి సభలో పాల్గొనడమే కాదు.. తెర వెనుక వ్యూహాలూ రచించారు! కమలనాథులంతా కదం తొక్కారు! రాజగోపాల్‌ రెడ్డి కరిష్మాతో.. ఆయన ఆర్థిక, అంగ బలంతో గెలుపు నల్లేరుపై నడకేనని భావించారు! కానీ, మునుగోడులో బీజేపీ మునిగింది! గెలుపు వాకిట బొక్కబోర్లా పడింది! ఓటరు కర్రు కాల్చి వాత పెట్టడమే ఇందుకు కారణం!!

ఇప్పటికే జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్లు గల్లంతు! ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యే బీజేపీలోకి చేరడంతో వచ్చిన ఉప ఎన్నిక! సిటింగ్‌ సీటులోనైనా పరువు నిలుపుకోవాలనే పోరాటం! కానీ, అర్ధ బలమూ లేదు! అంగ బలమూ లేదు! పైగా పార్టీలోనే కట్టప్పలు! ప్రచారంలోనే స్పష్టమైన ఫలితం! ఇక్కడ కూడా డిపాజిట్‌ గల్లంతు! కాకపోతే, డబ్బులు పంచకపోయినా కొంత కేడర్‌ ఇంకా పార్టీతోనే మిగిలి ఉందన్న అంశమొక్కటే కాంగ్రెస్‌కు ఊరట!!

మరొక పార్టీకి చేయూత అందించడమే తప్ప సొంతంగా చేవ చూపే సత్తా లేదు! అసెంబ్లీలోనూ బయటా పార్టీకి ఉనికే లేదు! అయినా.. అనుకోని వరం! మా వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని చెప్పుకొనే అవకాశం! పోటీలో లేకపోయినా వరించిన గెలుపు! ఇది వామపక్షాలకు మునుగోడు ఓటరు ఇచ్చిన మలుపు!

Updated Date - 2022-11-07T03:55:58+05:30 IST

Read more