మూగ, చెవిటి యువతిపై లైంగికదాడి
ABN, First Publish Date - 2022-05-15T05:18:44+05:30
ఓ మూగ యువతిపై కామాంధుడి కన్నుపడింది. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన యువతిపై చుట్టపుచూపుగా ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అఘాయిత్యానికి పాల్పడిన దగ్గరి బంధువు
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఘటన
శాలిగౌరారం, మే 14: ఓ మూగ యువతిపై కామాంధుడి కన్నుపడింది. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన యువతిపై చుట్టపుచూపుగా ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామశివారులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె వయసు 25 ఏళ్లు కాగా, పుట్టుకతోనే మూగ చెవిటితోపాటు మానసిక దివ్యాంగురాలు. దీంతో ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. తండ్రి 18 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం గ్రామశివారులోని తోటను కౌలుకు తీసుకొని అక్కడే నివాసముంటున్నాడు. శుక్రవారం వీరి బంధువైన సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఓ గ్రామంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో వీరికి దగ్గరి బంధువైన కట్టంగూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. అతడిని సైతం శుభకార్యానికి రావాలని యువతి తండ్రి అడగడంతో, వస్తానని చెప్పాడు. దీంతో అతడిని అదే దారిగుండా వెళుతున్న తెలిసిన వ్యక్తి బైక్‌పై ఎక్కించి యువతి తండ్రి పంపించాడు. మూగ యువతిని ఇంట్లో ఉంచిన తల్లిదండ్రులు మరో బైక్‌పై బయలుదేరారు. వీరికంటే ముందు బయలుదేరిన అతడు మార్గమధ్యంలో బైక్ దిగి తిరిగి యువతి ఇంటికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న మూగ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో యువతి బంధువు ఒకరు ఇంటికి రాగానే తలుపులు మూసి ఉండటాన్ని గమనించాడు. తలుపు తట్టి ఇంటి లోపలికి వెళ్లగానే సదరు వ్యక్తి కనిపించగా, పరిస్థితి అర్థమై యువతి తల్లిదండ్రులకు అతడు ఫోన్‌లో విషయం చెప్పాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఉప్పల సతీష్ తెలిపాడు. మూగ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.