పోచంపల్లి ఇక్కత్‌ నైపుణ్యానికి పోస్టల్‌ గౌరవం

ABN , First Publish Date - 2022-05-13T06:23:40+05:30 IST

పోచంపల్లి ఇక్కత్‌ నమూనాలో రూపొందించిన పుట్టపాక తేలియా రుమాల్‌పై పోస్టల్‌ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేయనుంది.

పోచంపల్లి ఇక్కత్‌ నైపుణ్యానికి పోస్టల్‌ గౌరవం
ఇక్కత్‌ తేలియా రుమాల్‌

 పుట్టపాక తేలియా రుమాల్‌పై పోస్టల్‌ కవర్‌

 నేడు భూదాన్‌పోచంపల్లిలో విడుదల

భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్‌, మే 12: పోచంపల్లి ఇక్కత్‌ నమూనాలో రూపొందించిన పుట్టపాక తేలియా రుమాల్‌పై పోస్టల్‌ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేయనుంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులు, ప్రదేశాలపై పోస్టల్‌ శాఖ స్టాంపులు, కవర్లు ముద్రిస్తుంది. అందులోభాగంగా పోచంపల్లి ఇక్కత్‌ విధానంలో రూపొందించిన పుట్టపాక తేలియా రుమాలుపై ప్రత్యేక కవర్‌ను విడుదల చేయనుంది. ఈనెల 13వ తేదీన భూదాన్‌పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ రజతోత్సవ భవనంలో నిర్వహించే కార్యక్రమంలో హైదరాబాద్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.విద్యాసాగర్‌రెడ్డి కవర్‌ను ఆవిష్కరించనున్నారు.  


తేలియా రుమాల్‌ ప్రత్యేకత ఇలా... 

జిల్లాలోని పుట్టపాక ఇప్పుడు పుట్టపాక తేలియా రుమాల్‌గా పేరుగాంచిన చేనేత సాంకేతికతకు కేంద్రంగా నిలిచింది.  తేలియా రుమాలు అనేది ప్రత్యేకమైన పోచంపల్లి టైఅండ్‌డై టెక్నిక్‌. ఇది మృదుత్వాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఎరుపు, తెలుపు, నలుపు రంగులను హస్తకళాకారులు వినియోగిస్తారు. తేలియా రుమాలును డబుల్‌ ఇక్కత్‌ విధానంతో రూపొందిస్తారు. నేయడానికి ముందే నూలుకు రంగు వేస్తారు. ఆముదపు పొట్టును కాల్చినప్పుడు వచ్చే బూడిదతోపాటు వృక్ష సంబంధిత రంగులను నీటిలో కలిపి ఆముదం లేదా నువ్వుల నూనెను చేర్చి సూర్యరశ్మితో మాత్రమే వేడి అయిన నీటిలో కలిపి అందులో నూలును నానబెడతారు. దీనివల్ల అది సహజసిద్ధమైన రంగులను, ఉష్ణోగ్రతను నియంత్రించే లక్షణాన్ని పొందుతుంది. ఈ విధమైన ప్రత్యేక తయారీ ప్రక్రియ తేలియా రుమాలును పోచంపల్లి ఇక్కత్‌ చీరల నుండి విభిన్నంగా, ఉన్నతమైనదిగా చేస్తుంది. 1975లో కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వశాఖ ఆద్వర్యంలో చేనేత కార్మికుల సేవా కేంద్రం (వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌)లో పనిచేస్తున్నప్పుడు హస్తకళాకారుడు గజం గోవర్ధన్‌ చీరాలను సందర్శించి తేలియా రుమాల్‌ తయారు చేసే విధానాన్ని నేర్చుకున్నారు.  


ప్రకృతి రంగులే ఆధారం 

పుట్టపాకలో నేసే ప్రాచీన తేలియా రుమాల్‌ వస్త్రాలకు ప్రకృతి రంగులే ఆధారం. తెల్ల దారం కోసం ప్రకృతి రంగులు గుమ్మడి రంగు, తేలియా రంగు, ఇండిగో, నల్ల రంగును ఉపయోగిస్తారు. మొదటగా తెల్లదారానికి ఉండే జిగురు తొలగించేందుకు ఒక రోజు నీటిలో నానబెట్టి నీడలో అరబెడతారు. ఇలా వారం రోజుల పాటు తెల్ల దారానికి ఉన్న జిగురు తొలగిస్తారు. ఆ తర్వాత దారాన్ని శుద్ధి చేసేందుకు కరక్కాయ పింద పొడి కిలో ఒక్కంటికి 150గ్రాముల చొప్పున అల్లం 10గ్రాములతో కలిపి శుద్ధి చేస్తారు. 


నేడు పోచంపల్లిలో పోస్టల్‌ కవరు ప్రారంభం

పోచంపల్లి ఇక్కత్‌, పుట్టపాక తేలియా రుమాల్‌ విశిష్టతపై మరింత గుర్తింపు తెచ్చేందుకుగాను ఈ నెల 13వ తేదీన భూదాన్‌పోచంపల్లి పట్టణంలో భారత పోస్టల్‌ శాఖ పీఎన్‌జీ హైదరాబాద్‌ రీజియన్‌ ఆద్వర్యంలో పోస్టల్‌ కవరు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హైద్రాబాద్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి విద్యాసాగర్‌రెడ్డి, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్‌, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ అధ్యక్షుడు తడక రమేష్‌ హాజరవుతారని అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి భారత లవకుమార్‌ తెలిపారు.

Read more