మందలింపుతో వదిలేసిన అధికారులు

ABN , First Publish Date - 2022-05-14T06:41:55+05:30 IST

మోత్కూరులో ఇంటర్‌ పరీక్షా కేంద్రానికి సెల్‌ఫోన తీసుకువచ్చిన విద్యార్థిని అధికారులు మందలింపుతో వదిలేశారు.

మందలింపుతో వదిలేసిన అధికారులు


విధుల నుంచి ఇన్విజిలేటర్‌ తొలగింపు 

మోత్కూరు, మే 13 : మోత్కూరులో ఇంటర్‌ పరీక్షా కేంద్రానికి సెల్‌ఫోన తీసుకువచ్చిన విద్యార్థిని అధికారులు మందలింపుతో వదిలేశారు. ఈ నెల 11వ తేదీన మోత్కూరులోని అక్షర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం గణితం పరీక్ష నిర్వహించారు.  పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి సెల్‌ఫోన తీసుకెళ్లాడు. ముందుగా గమనించని ఇన్విజిలేటర్‌ సుధాకర్‌ మరో ఐదు నిమిషాలు ఉందనగా విద్యార్థి వద్ద సెల్‌ఫోనను గుర్తించారు. టైమ్‌ చూసుకుంటున్నానని విద్యార్థి సమాధానమివ్వటంతో ఇన్విజిలేటర్‌ సెల్‌ఫోనను లాక్కొని, బయటకు విసిరేశారు. ఈ విషయం గురువారం వెలుగులోకి రాగా విద్యాశాఖలో కలకలం మొదలైంది. దీంతో ఈ ఘటనపై జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ), ఎస్‌ఐ విచారణ చేపట్టారు. సెల్‌ఫోనతో కాపీయింగ్‌ చేయనందున ఆ విద్యార్థిని మందలించి వదిలిపెట్టినట్టు ఇన్విజిలేటర్‌ డీఈసీ కమిటీకి రాసిచ్చారు. ఇన్విజిలేటర్‌, పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ శేఖర్‌ వాగ్మూలాలను నమోదు చేసిన డీఈసీ బృందం సుధాకర్‌ను ఇన్విజిలేషన విధుల నుంచి తప్పించింది. శుక్రవారం ఆ విద్యార్థి యధావిధిగా పరీక్ష రాశారు. దీంతో వివాదం గురువారంతోనే ముగిసినట్లయ్యింది. ఇదిలా ఉండగా శుక్రవారం జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఇంటర్‌ బోర్డు స్క్వాడ్‌ అక్షర కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించాయి. వారు తమ విధుల్లో భాగంగానే కళాశాలకు వచ్చారని, సెల్‌ఫోన విషయంపై ఎలాంటి విచారణ చేలేదని తెలిసింది. 


Read more