ఊరంతా రోడ్ల విస్తరణ

ABN , First Publish Date - 2022-05-14T06:43:34+05:30 IST

నేరేడుచర్ల మునిసిపాలిటీలోని ప్రధాన రహదారులన్నీ విస్తరణకు నోచుకుంటున్నాయి. ఇప్పటికే కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టగా, ఇటీవల రహదారిని ఆక్రమించిన భవనాలను సైతం కూల్చివేశారు.

ఊరంతా రోడ్ల విస్తరణ
నేరేడుచర్ల ప్రధాన రహదారి నుంచి రామాపురం రోడ్డు

మొన్నటి వరకు జాతీయ రహదారి

ప్రస్తుతం మునిసిపల్‌ రహదారుల విస్తరణ

 ఇందుకోసం రూ.5.75 కోట్లు కేటాయింపు 

 తీర్మానిస్తే 80 అడుగుల మేర  విస్తరణ

నేరేడుచర్ల మునిసిపాలిటీలోని ప్రధాన రహదారులన్నీ విస్తరణకు నోచుకుంటున్నాయి. ఇప్పటికే కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టగా, ఇటీవల రహదారిని ఆక్రమించిన భవనాలను సైతం కూల్చివేశారు. ఇక మునిసిపాలిటీ పరిధిలోని రహదారుల  విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధాన మూడు రహదారుల విస్తరణకు అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. హైవే విస్తరణలో 100 దుకాణాలతో పాటు ప్రస్తుత రహదారుల విస్తరణతో 200ల మేర దుకాణాలు, గృహ సముదాయాలు కోల్పోవాల్సి వస్తోంది. 

 నేరేడుచర్ల 

టెండర్ల ప్రక్రియ పూర్తి

నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రోడ్ల విస్తరణకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. పబ్లిక్‌ హెల్త్‌ కమిటీ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు పనులను సైతం అప్పగించారు. నేరేడుచర్ల ప్రధానచౌరస్తా నుంచి వెళ్లే మూడు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి రామాపురం వరకు ఉన్న బైపాస్‌ రోడ్డు అభివృద్ధికి కూడా టెండర్లను పిలిచారు. ఇందుకోసం రూ.5.75 కోట్లను వెచ్చిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ అధికా రులు వారి పరిధిలోని భూములను మునిసిపాలిటీకి బదలాయించారు. 

డివైడర్‌తో పాటు సెంట్రల్‌ లైటింగ్‌

మునిసిపాలిటీ పరిధిలో విస్తరిస్తున్న మూడు ప్రధాన రహదారులను అందంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో సెంట్రల్‌ లైటి ంగ్‌తో పాటు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం, విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేయనున్నారు. 

పెద్దసంఖ్యలో కూల్చివేతలకు గురవుతున్న భవనాలు

నేరేడుచర్లలో హైవే నిర్మాణానికి పెద్దసంఖ్యలో భవనాలను కూల్చి వేశారు. ఆ సమయంలోనూ నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు పట్టణ రోడ్ల విస్తరణలోనూ కూల్చివేతలు ప్రారంభిస్తే వ్యాపార సంస్థలకు తీవ్రనష్టం వాటిల్లనుంది. దుకాణాలతో పాటు గృహసముదాయాలు పెద్దఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారి నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జాన్‌పహాడ్‌ రోడ్డులో రహదారి నిర్మాణానికి సర్వే పనులను శుక్రవారం చేపట్టారు. మార్కింగ్‌ చేసి త్వరలో పనులు చేపట్టనున్నారు. 

నిర్ణయం 100.. తీర్మానిస్తే 80

నేరేడుచర్ల నుంచి మహంకాళీగూడెం వెళ్లే రహదారి, నేరేడుచర్ల నుంచి నర్సయ్యగూడెం వరకు వెళ్లే రహదారులను ఇరువైపులా కలిపి 100 అడుగుల మేర విస్తరించాలని నిర్ణయించారు.ఆ మేరకు ముని సిపాలిటీకి ఆర్‌అండడ్‌బీ భూమిని బదిలీ చేసింది.  జాన్‌పహాడ్‌ రోడ్డు విస్తరణకు రూ.2.36 కోట్లు కేటాయించారు. ఇక్కడ కిలోమీటర్‌ మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఈ దారి కొన్నిచోట్ల 30అడుగులు కొన్నిచోట్ల 40 అడుగులు మరికొన్ని చోట్ల 50అడుగులుగా ఉంది. రోడ్డు విస్తరణతో పెద్ద సంఖ్యలో దుకాణాలు కూల్చివేయాల్సి ఉంటుంది. దీంతో పెద్దఎత్తున నిరసన ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున 100 అడుగుల దారిని 80 అడుగులకు తగ్గించాలని మునిసిపాలిటీ పాలకవర్గం తీర్మానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ మేరకు ఇరువైపులా 40 అడుగుల మేర చేపట్టను న్నారు. ఇక నేరేడుచర్ల నుంచి శాంతినగర్‌ వరకు రామాపురం రోడ్డు 40 అడుగుల మేర విస్తరించేందుకు రూ.1.31 కోట్లు కేటాయించారు. 40 అడుగులు సరిపోతుందా, ఇంకా ఎక్కువ తీస్తారా అనేది మునిసిపల్‌ తీర్మానంతో తేలనుంది. నేరేడుచర్ల ప్రధాన కూడలి నుంచి పాత నేరేడుచర్ల వరకు మునిసిపల్‌ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ.88 లక్షలు కేటాయించారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి రామాపురం రోడ్డు వరకు 40 అడుగుల మేర బైపాస్‌ రోడ్డును అభివృద్ధికి రూ.1.20 కోట్లు కేటాయిం చారు. ఇప్పటికే రామాపురం రోడ్డు, పాత నేరేడుచర్ల రహదారులలో కొన్నిచోట్ల పనులు చేపట్టారు. జాన్‌పహాడ్‌ రోడ్డులో పనులు ప్రారంభించాలంటే మార్కి ంగ్‌ చేసి నోటీసులు ఇవ్వాల్సి ఉంది. 

తీర్మానం అయ్యాక పనులు చేస్తాం 

పట్టణ పరిధిలో రోడ్ల విస్తరణకు టెండర్లు పూర్తి చేశాం. అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. త్వరలో మునిసిపల్‌ పాలకమండలి సమావేశం నిర్వహించి తీర్మానం మేరకు రోడ్లు వెడల్పు చేస్తాం. జాన్‌పహాడ్‌ రోడ్డు 80 అడుగులు, మిగిలిన రోడ్లు 40 అడుగుల మేర విస్తరిస్తాం. తీర్మానం అనంతరం మార్కింగ్‌ చేస్తాం.  

వెంకటేశ్వర్లు, కమిషనర్‌ 




Read more