కొనుఘొళ్లు
ABN , First Publish Date - 2022-05-14T06:45:15+05:30 IST
యాసంగి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించగా, ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడి చి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఆకాశంలో మబ్బులు కన్పిస్తే రైతుల గుండెల్లో గుబులు మొదలవుతోం ది.
ధాన్యం సేకరణ ప్రక్రియలో జాప్యం
మౌలిక వసతులు సైతం కరువు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): యాసంగి ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ఆలస్యంగా ప్రారంభించగా, ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయి. దీంతో ఇటీవల కురిసిన వర్షానికి అక్కడక్కడ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడి చి ముద్దయింది. ఈ నేపథ్యంలో ఆకాశంలో మబ్బులు కన్పిస్తే రైతుల గుండెల్లో గుబులు మొదలవుతోం ది. కొన్ని కేంద్రాల్లో లారీ యజమానులు బస్తాకు రూ.2, రూ.3 చొప్పున డిమాండ్ చేస్తున్నారు. వర్ష భయం కారణంగా రైతులు వారి చెప్పినంత చెల్లిస్తున్నారు. ఇక ఏ-గ్రేడ్ రకానికి సైతం మిల్లర్లు బీ-గ్రేడ్ ధర చెల్లిస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. వీటితో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేక రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో యాసంగిలో 1,65,761 ఎకరాల్లో సాగైంది. 3,14,947 మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసి 263 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. అందులో ఐకేపీ ఆధ్వర్యంలో 175 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 83, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఐదు కేంద్రాలు కొనసాగుతున్నాయి. 2.50లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించనున్నారు. కాగా, ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3309మంది రైతుల నుంచి 50,679 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. పౌరసరఫరాలశాఖ 24.10లక్షల గోనె సంచులు అందుబాటు లో ఉంచగా, చాలా చోట్ల నాణ్యతలేక చిరుగులుపడి ధాన్యం నేలపాలవుతోంది. కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో ఆలస్యం కారణంగా రైతులు ఒక్కో కేంద్రంలో వారం నుంచి పది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది.
సంస్థాన్ నారాయణపురం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే కొనుగో లు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తూకానికి సుమారు 15 రోజుల సమయం పడుతోంది. మండలంలో నారాయణపురం, గుడిమల్కాపురం, గుజ్జ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండగా, ధాన్యం రాశులు పోసిన రైతులు వాతావరణంలో మార్పుచూసి ఆందోళన చెందుతున్నారు. కాంటల సంఖ్య పెంచి తూకం ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
భువనగిరి రూరల్ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, భువనగిరి, చందుపట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద టెంటు, తాగునీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నీ బ్యాగులకు చిరుగులుపడి ఉండటంతో ధాన్యం నేలపాలవుతోంది.
మోటకొండూరు మండల వ్యాప్తంగా 5ఐకేపీ, 3పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులై నా కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. మూడు రోజులుగా గన్నీ బ్యాగుల కొరతతో కొనుగోళ్లు నిలిచాయి. అదేవిధంగా కేంద్రాల వద్ద కనీస కనీస సౌకర్యాలు లేవు. ప్యాడీ క్లీనర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు గంటకు రూ.800 వెచ్చించి ధాన్యాన్ని తూర్పారబడుతున్నారు.
అడ్డగూడూరు మండలంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా, రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండగా, సకాలంలో లారీలు రాకపోవడంతో ఎగుమతిలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధాన్యం శుద్ధి భారం కూడా రైతులపైనే పడుతోంది.
యాదగిరిగుట్ట రూరల్ మండలంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా,గోనే సంచుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చిన సంచులకు చిరుగులు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో వారం, పదిరోజులైనా ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వలిగొండ మండలంలో 41 కేంద్రాలు ఉండగా, కొనుగో ళ్లు మందకొడిగా సాగుతున్నాయి. మొగిలిపాక గ్రామంలో కొనుగోలు కేంద్రానికి 112 మంది రైతులు ధాన్యాన్ని తీసుకురాగా, శుక్రవారం నాటికి 32మంది రైతుల ధాన్యాన్ని మాత్రమే తూకం వేశారు. లారీలు సకాలంలో రావడం లేదని దీంతో నాలుగు వారాల క్రితం ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా, నేటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదని రైతుల లక్ష్మయ్య వాపోయాడు. దొడ్డు రకానికి బీ-గ్రేడ్‌గా ధర చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గుండాల మండలంలో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండగా, అవి దళారులకు అడ్డాగా మారుతున్నాయి. తేమ శాతం పేరుతో కొనుగోళ్లలో జాప్యం చేస్తుండటంతో రైతులు దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోతున్నారు.
తుర్కపల్లి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో మూడు, పీఎసీఏస్ ఆధ్వర్యంలో ఏడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. తుర్కపల్లి, వాసాలమర్రి, చిన్న లక్ష్మాపూర్ కేంద్రాలకు ఇప్పుడిప్పుడే ధాన్యం వస్తుండడంతో కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దత్తాయపల్లి కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రెండు రోజులు కాంటాలు నిలిచాయి. నాణ్యతలేని గన్నీ బ్యాగులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు లేక ఎండలతో రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
మోత్కూరు మండలంలో ప్రభుత్వం నియమించిన పరిశీలకులు ధాన్యాన్ని ఏ-గ్రేడ్ రకంగా ఎంపిక చేసినా మిల్లర్లు మాత్రం బీ-గ్రేడ్ రకంగానే దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రైతులు ప్రతీ క్వింటాకు రూ.20 చొప్పున నష్టపోతున్నారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.1960 ఉండగా, బీ-గ్రేడ్ రకానికి రూ.1940 ఉంది. లారీలు, డీసీఎంల యజమానులు ప్రభుత్వం ఇచ్చే రవాణా చార్జీ గిట్టుబాటు కావడం లేదని, బస్తాకు రూ.2 నుంచి రూ.3 చొప్పునే ఇస్తేనే వాహనాలు పంపుతామని తెగేసి చెబుతున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. ఓ వైపు మబ్బులు వస్తుండటంతో భయపడుతున్న రైతులు బస్తాల ఎగుమతికి లారీల యజమానులకు డబ్బులు చెల్లిస్తున్నారు. దత్తప్పగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాకు రూ.3 చొప్పున ఇస్తున్నారు. సదర్శాపురంలో ఖాళీ బస్తాలు లేక మూడు రోజులుగా కాంటాలు నిలిచాయి.
కొనుగోలు కేంద్రాల్లో సమస్యల్లేవు : గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా కొనసాగుతోంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేవు. గోనె సంచులు అందుబాటులో లేవని, ఇతర సౌకర్యాలు లేవని వస్తున్న ఆరోపణలు అవాస్తవం.
అడుగడుగునా జాప్యమే : దామోదర్‌రెడ్డి, రైతు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి
మార్చి చివరి వారం నుంచే వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసి కూడా ప్రభుత్వం ఏప్రిల్ మూ డో వారం వరకు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రారంభించిన నాటి నుంచి కూడా కొనుగోళ్లు సక్రమంగా చేయలేదు. తూకం వేసిన బస్తాలు తీసుకెళ్లేందు కు లారీ యజమానులు కొర్రీలు పెడుతున్నారు. ఒక్కో రైతు నెల రోజులుగా కేంద్రాల్లో పడిగాపులుపడుతున్నారు. ఏ-గ్రేడ్ రకాన్ని బీ-గ్రేడ్ అని ధర ఇచ్చినా, బస్తాల ఎగుమతికి రూ.2, రూ.3 వసూలు చేస్తున్నా రైతు మిన్నకుండాల్సి వస్తోంది.
అధికారులు వసతులు కల్పించాలి : లక్ష్మీ, మహిళా రైతు, వీరవెల్లి, భువనగిరి మండలం
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకపోయింది. మిగిలిన ధాన్యం తడిసి ముద్దయింది. ఎండ తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద టెంటు, తాగునీటి సౌకర్యం కల్పించాలి. తేమ శాతం సాకుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రాశుల వద్ద వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నాం.

