అధిక వడ్డీల ఎర వేసి..

ABN , First Publish Date - 2022-05-03T05:37:49+05:30 IST

అధిక వడ్డీల ఎర వేసి..

అధిక వడ్డీల ఎర వేసి..

-రూ.2 కోట్ల అప్పులు చేసిన బంగారు ఆభరణాల వ్యాపారి 

-అకస్మాత్తుగా అదృశ్యం... కోర్టు నుంచి నోటీసుల జారీ...

శంభునిపేట, మే 2: అధిక వడ్డీల ఎర వేసి దాదాపు రూ.2 కోట్లు అప్పులు చేసి పరారయ్యాడు ఓ నగల వ్యాపారి. వరంగల్‌ రంగశాయిపేటలో వెలుగుచూసిన ఈ అప్పుల స్కామ్‌లో బాధితులందరూ మధ్య తరగతి వర్గాల వారే. సదరు వ్యాపారి కోర్టు నుంచి 14 మందికి నోటీసులు పంపించడంతో అప్పుల విషయం బయటకు పొక్కింది. డబ్బులిప్పించాలని బాధితులు మిల్స్‌కాలనీ పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్లితే... రంగశాయిపేటలో  బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి.. కొంతకాలంగా తెలిసిన వారి వద్ద అప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఇతనికి స్థానికంగా సొంత ఇల్లు కూడా ఉంది.  బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నానని, మంచి లాభాలు వస్తాయని నమ్మబలికాడు. ఏకంగా 10 నుంచి 20 శాతం వడ్డీ ఆఫర్‌ చేశాడు. తొలుత కొందరికి నెలనెలా చెల్లించాడు కూడా. ఈ విషయం తెలియడంతో అనేకమంది అధిక వడ్డీలపై ఆశతో అప్పులు ఇచ్చారు. ఇలా దాదాపు రూ.2కోట్ల మేర సదరు వ్యాపారి అప్పులు చేశాడు. ఇందులో కోటి వరకు తన ఇంటిచుట్టుపక్కల వారి నుంచే వసూలు చేయడం విశేషం. అయితే కొంతకాలంగా వడ్డీల చెల్లింపు భారం కావడంతో ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. కొన్నిరోజుల క్రితం కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు. ఇది గమనించిన అప్పుదారులు విచారించగా... సదరు వ్యాపారి బిచాణా ఎత్తేసినట్టు ధృవపడింది. ఈలోగా వరంగల్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి నోటీసులు కూడా పంపించడంతో అప్పులిచ్చిన వారు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని, డబ్బులిప్పించాలని మిల్స్‌కాలనీ పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ వ్యాపారితన ఇల్లును గతంలోనే బ్యాంకులో తనఖా పెట్టినట్టు సమాచారం. 

Read more