పారిశుధ్య నిర్వహణలో సిద్దిపేట నంబర్ వన్
ABN , First Publish Date - 2022-05-14T05:37:01+05:30 IST
పట్టణ ప్రగతి 2021-22 సంవత్సరానికి గాను పారిశుధ్య నిర్వహణలో సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. రాష్ట్రంలో లక్ష జనాభా కలిగిన 13 మున్సిపాలిటీల్లో సిద్దిపేట పట్టణం శానిటేషన్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలవగా, రాష్ట్రంలో 25 వేల నుంచి 50 వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో గజ్వేల్ పట్టణం ప్రథమ స్థానం కైవసం చేసుకున్నది.
లక్ష జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో ఉత్తమంగా నిలిచి పట్టణ ప్రగతి పురస్కారానికి ఎంపిక
50 వేల లోపు జనాభా మున్సిపాలిటీల్లో గజ్వేల్‌కు ప్రథమ స్థానం
అవార్డులు అందజేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
సిద్దిపేట టౌన్, మే13 : పట్టణ ప్రగతి 2021-22 సంవత్సరానికి గాను పారిశుధ్య నిర్వహణలో సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. రాష్ట్రంలో లక్ష జనాభా కలిగిన 13 మున్సిపాలిటీల్లో సిద్దిపేట పట్టణం శానిటేషన్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలవగా, రాష్ట్రంలో 25 వేల నుంచి 50 వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో గజ్వేల్ పట్టణం ప్రథమ స్థానం కైవసం చేసుకున్నది.
శుక్రవారం హైదరాబాద్‌లోని వెంగళ్‌రావునగర్‌లో నిర్వహిచిన పట్టణ ప్రగతి పురస్కారాలలో భాగంగా ఉత్తమ పారిశుధ్య నిర్వహణ పట్టణంగా సిద్దిపేట ఎంపిక కాగా రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, అదనపు కలెక్టర్, సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ముజామిల్‌ఖాన్‌కు అవార్డు, సర్టిఫికేట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ సెక్రటరీ అరవింద్‌కుమార్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సత్యనారాయణ, సిద్దిపేట మున్సిపల్ ఏఈ రంజిత్, రాష్ట్రంలోని మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ ముంజులారాజనర్సు మాట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు చెత్తసేకరణలో, పారిశుధ్య నిర్వహణలో చూపిన చొరవ, పట్టణ ప్రజల ఐక్యత, మహిళల భాగస్వామ్యంతో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు. అవార్డు వచ్చేందుకు సహకరించిన మంత్రి హరీశ్‌రావు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, భాగస్వామ్యమైన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో పురస్కారం : మంత్రి హరీశ్‌రావు
ప్రజల భాగస్వామ్యం లేనిది ఏది సాధ్యం కాదని, సిద్దిపేట పట్టణ ప్రజలు మరోసారి నిరూపించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందుకు నిదర్శనం ఈ అవార్డు అని తెలియజేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా సిద్దిపేట పట్టణంలో ప్రతీ ఒక్కరు పారిశుధ్య నిర్వహణ చేయడం వల్లనే ఇది సాధ్యమైందని, ఏ అవార్డు అయినా, సిద్దిపేట పేరు లేనిది ఉండదని, మరోసారి ప్రజలు చూపిన స్ఫూర్తి గొప్పదని మంత్రి పేర్కొన్నారు. ఈ అవార్డు వచ్చినందుకు పట్టణ ప్రజలకు, కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న గజ్వేల్‌కు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు చొరవతో ఇదే స్ఫూర్తితో మరెన్నో అవార్డులు రావాలి అని మంత్రి కోరుకున్నారు.

