రేపటి నుంచి రేణుకా ఎల్లమ్మ జాతర

ABN , First Publish Date - 2022-05-15T05:22:55+05:30 IST

దుష్టశక్తుల పాలిట మహాకాళిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా, కొలిచిన వారికి కొంగు బంగారమైన హుస్నాబాద్‌ రేణుకా ఎల్లమ్మ జాతర సోమవారం నుంచి ప్రారంభంకానున్నది.

రేపటి నుంచి రేణుకా ఎల్లమ్మ జాతర
హుస్నాబాద్‌లోని ఎల్లమ్మదేవి ఆలయం

నెలరోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు

ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ 

హుస్నాబాద్‌. మే 14: దుష్టశక్తుల పాలిట మహాకాళిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా, కొలిచిన వారికి కొంగు బంగారమైన హుస్నాబాద్‌ రేణుకా ఎల్లమ్మ జాతర సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెంది.. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయమైన ఎల్లమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ వారు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతియేటా వైశాఖ మాసం పౌర్ణమి రోజు ఈ జాతర ప్రారంభమై నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నెలరోజుల కాలంలో లక్షలాది మంది భక్తులు పిల్లపాపలతో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంటారు. 

20 అడుగుల ఎత్తులో 

 హుస్నాబాద్‌ రేణుకా ఎల్లమ్మ విగ్రహం దాదాపు 20 అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది. కాకతీయుల కాలంలో రుద్రమదేవి ఇక్కడ చెరువు నిర్మించినప్పుడు ఈ ఎల్లమ్మగుడిని నిర్మించారని చెబుతారు. కాకతీయుల కుల దైవమైన యయాతి ఎల్లమ్మకు మారుపేరు అని, అందుకే ఇక్కడ ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారనే వాడుక ఉన్నది. ఈ ప్రాంతంలో పౌర్ణమిని ప్రామాణికంగా తీసుకొని కాలగణన చేస్తారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయంగా ఈ రేణుకా ఎల్లమ్మ ఆలయం పేరుగాంచింది. బమ్మెర పోతన్న, సర్వాయి పాపన్నలాంటి ఎందరో మహనీయులు దర్శించినట్లు చరిత్రకారులు చెబుతారు. 

సిద్ధోగంతో జాతర ప్రారంభం

పౌర్ణమి రోజైన సోమవారం ఉదయం ఎల్లమ్మ జాతర సిద్ధోగంతో ప్రారంభమవుతుంది. ఎల్లమ్మదేవిని స్థుతిస్తూ ఆమె చరిత్రను పంబాల పూజారులు ఆటపాటల ద్వారా వివరిస్తారు. దాదాపు 6 గంటల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిమంది వస్తుంటారు. అనంతరం ఎల్లమ్మ కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. సాయంత్రం గుడిచుట్టూ వందలాది ఎడ్ల బండ్లు ప్రదక్షిణలు చేస్తాయి. ముఖ్యంగా గౌడ కులస్థులు వారి కులదైవమైన ఎల్లమ్మదేవిని ఇష్టంగా పూజిస్తారు. హుస్నాబాద్‌ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, షోలాపూర్‌, బీదర్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, జనగామ, మెదక్‌, సంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు హాజరై మొక్కులు సమర్పించుకుంటారు. 

జాతర కార్యక్రమాలు

16న రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమై జూన్‌ 14న ముగుస్తుంది. జాతర ప్రారంభం రోజు సోమవారం గణపతి పూజ, పుణ్యహవచనం, దృష్టి కుంభం, అమ్మవారి కల్యాణ మహోత్సవం, సిద్ధోగం, బండ్లు తిరిగే కార్యక్రమాలుంటాయి. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో విశేష పూజలుంటాయి. ప్రతిరోజు కుంకుమార్చనలు, ఓడివాల బియ్యం, బోనాలు, పట్నాలు వేసే కార్యకమం ఉంటుంది. జూన్‌ 14న జాతర ముగింపు ఉంటుంది. జాతర సందర్భంగా ఈసారి ఆలయ ప్రాంగణంలో రంగుల రాట్నం వంటివి ఏర్పాటు చేశారు. 

భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు 

అమ్మవారిని దర్శించుకునేందుకు గతంలో కంటే ఈసారి భక్తులు పెద్దఎత్తున వచ్చే అవకాశం ఉన్నది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేశాం. ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ సహకారంతో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.

- పూదరి రవీందర్‌, ఆలయ కమిటీ చైర్మన్‌

Updated Date - 2022-05-15T05:22:55+05:30 IST

Read more