పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు

ABN , First Publish Date - 2022-05-14T05:50:37+05:30 IST

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తాగునీరు దొరకని గ్రామం ఉండొచ్చేమో కానీ మద్యం దొరకని గ్రామం మాత్రం జిల్లాలో లేదు.

పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు

 మద్యం విక్రయ కేంద్రాలుగా గ్రామాలు

 ప్రోత్సహిస్తున్న మద్యం వ్యాపారులు

 సంగారెడ్డి జిల్లాలో 2,685 బెల్టుషాపులు


జహీరాబాద్‌, మే 13: సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. తాగునీరు దొరకని గ్రామం ఉండొచ్చేమో కానీ మద్యం దొరకని గ్రామం మాత్రం జిల్లాలో లేదు. కొన్ని గ్రామాల్లో బెల్టు షాపుల నిర్వహణకు రూ.లక్షల్లో వేలం పాటలు నిర్వహిస్తున్నారు. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఎనీ టైం మద్యం దొరుకుతుండడంతో గ్రామాల ప్రజలు, యువత మత్తులో మునిగితేలుతున్నారు. మద్యం అమ్మకాలకు లైసెన్సు దక్కించుకున్న వ్యాపారులు తమ లాభం కోసం ఎక్సైజ్‌ అధికారులను మచ్చిక చేసుకుని బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో వైన్స్‌షాపులను దక్కించుకున్న వ్యాపారులు సిండికేట్‌గా మారి మండలంలోని గ్రామాలను పంచుకుని మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా లైసెన్సు పొందిన వైన్స్‌షాపులు 101 ఉంటే, గ్రామాల్లో 2,685 బెల్టుషాపులు ఉన్నాయి. జహీరాబాద్‌ నియోజకవర్గంలో 614, నారాయణఖేడ్‌లో 728, అందోల్‌లో 542, సంగారెడ్డిలో 412, పటాన్‌చెరులో 389 బెల్టుషాపులు ఉన్నాయి. బెల్టుషాపుల్లో మద్యం విక్రయాలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రతీ మద్యం సీసాపై రూ.10నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని వైన్‌షాపుల్లో కూడా అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.


Read more