రాష్ట్రంలో ధాన్యం సేకరణ విధానం భేష్
ABN , First Publish Date - 2022-05-15T04:47:19+05:30 IST
రాష్ట్రంలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తున్న విధానం బాగుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పేర్కొన్నారు.
ఆహార భద్రత చట్టం పకడ్బందీ అమలుకు టాస్క్‌ఫోర్స్ కమిటీలు
ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి
కొనుగోలు కేంద్రాలు, రైసుమిల్లుల సందర్శన
తూప్రాన్‌రూరల్/రామాయంపేట, మే 14: రాష్ట్రంలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం సేకరిస్తున్న విధానం బాగుందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన కమిషన్ సభ్యులతో కలిసి తూప్రాన్ మండలం యావాపూర్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రైసుమిల్లును, రామాయంపేట మార్కెట్ కమిటీలో కొనసాగుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, అమ్మకాలు, రైతులకు బిల్లుల చెల్లింపుల గురించి కేంద్రం నిర్వాహకులను, రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటలు ఎందుకు సాగు చేయడం లేదని రైతులను తిరుమల్‌రెడ్డి అడుగగా.. కోతులు, అడవి పందుల బెడదతో ఇతర పంటలు దక్కడం లేదని బదులిచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం ధాన్యం సేకరణపై చేసిన ప్రకటనలతో ఈసారి సందిగ్ధంలోనే వరిసాగు చేశామని రైతులు తెలిపారు. దీనిపై కమిషన్ చైర్మన్ తిరుమలరెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఆందోళనకు గురైన విషయం వాస్తవమేనని, సాగుకు ముందే ధాన్యం సేకరణ గురించి ప్రభుత్వం ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రైతులకు నష్టం జరుగకుండా ధాన్యం సేకరణ జరగాలని నిర్వాహకులను ఆదేశించారు. రైతులకు ఇష్టమున్న పంటలను పండించే స్వేచ్ఛ ఇస్తేనే నాణ్యతగల ఉత్పత్తులు వస్తాయని పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయడం కమిషన్ భాద్యత అని, దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల సంఖ్య పెరగాల్సిన అవసరముందన్నారు. ధాన్యం సేకరణలో అవకతవకలను అరికట్టేందుకు, ఆహార భద్రత చట్టం పకడ్బందీ అమలుకు తెలంగాణలోని ప్రతీ జిల్లాలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు తిరుగుతాయని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమలరెడ్డి అన్నారు. రైతుల పంట అమ్మకాలు, తూకంలో మోసాల్లాంటివి అరికట్టేందుకు ఈ కమిటీ బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. కాగా వరి సోమరిపోతులు పండించే పంటగా పేరుందని, అది పోవాలంటే వరికి బదులుగా కూరగాయలు, తృణధాన్యాల పంటలను సాగు చేయాలని రైతులకు తిరుమలరెడ్డి సూచించారు. దీనిపై రైతులను చైతన్యం చేయాలని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలను కోరారు. ఆయన వెంట ఫుడ్ కమిషన్ సభ్యులు భారతి, శారద, గోవర్ధన్‌రెడ్డి, డీఎ్‌సవో శ్రీనివాస్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, డీసీవో కరుణ, డీఏవో సురేఖ, ఎంపీటీసీ సంతో్‌షరెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం, స్థానిక ఎంపీడీవో యాదగిరిరెడ్డి ఉన్నారు.
రేషన్ షాపు పరిశీలన
తూప్రాన్, మే 14: తూప్రాన్ పట్టణంలోని 11వ నంబరు రేషన్ షాపును రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి తనిఖీ చేశారు. రేషన్ బియ్యం తక్కువగా తూకం వేసినా, డీలర్ సక్రమంగా వ్యవహరించకపోయినా, నాణ్యమైన సరుకు ఇవ్వకపోయినా నోడల్ అధికారిగా ఉండే తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆయనవెంట సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, శారద, భారతి, డీఎ్‌సవో శ్రీనివాస్, ఆర్డీవో శ్యాంప్రకాశ్, డీసీఎం కరుణ ఉన్నారు.
తూప్రాన్ కేంద్రం వద్ద రైతుల నిరీక్షణ
తూప్రాన్ పట్టణంలోని సొసైటీ కొనుగోలు కేంద్రం వద్దకు ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, సభ్యులు వస్తున్నట్లు తెలియడంతో, తమ సమస్యలను చెప్పుకునేందుకు రైతులు కేంద్రం వద్ద నిరీక్షించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించడానికి లారీలు రావడంలేదని, రైసుమిల్లులో దించుకోవడంలేదని చైర్మన్‌కు వివరించేందుకు రైతులు ఎదురు చూశారు. చైర్మన్, సభ్యులు కొనుగోలు కేంద్రం నుంచే కారులో వెళ్లినా అక్కడ ఆగకుండానే పోయారు.

