కాసులు కురిపిస్తున్న మట్టి దందా

ABN , First Publish Date - 2022-05-04T05:42:21+05:30 IST

మట్టి అక్రమ దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది.

కాసులు కురిపిస్తున్న మట్టి దందా
కూచారం వద్ద ప్రభుత్వ అసైన్డ్‌ భూమిలో తీసిన మట్టి

పారిశ్రామికవాడల్లో మట్టికి భారీగా డిమాండ్‌

కూచారం అడ్డాగా మట్టి  అక్రమ రవాణా 

అడ్డుకున్నవారిపై దాడులు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు   

తూప్రాన్‌, మే 3: మట్టి అక్రమ దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఏ నిర్మాణ పనులు చేపట్టాలన్నా మట్టి  తప్పనిసరి కావడంతో పారిశ్రామిక వాడల్లో మట్టి అక్రమ తరలింపు దందా బంగారు గనిని తలపిస్తున్నది. మట్టికి డిమాండ్‌ విపరీతంగా ఉండటంతో రాత్రింబవళ్లు నిబంధనలు పాటించకుండా తరలిస్తున్నారు. దీంతో మట్టి రవాణా చీకటి వ్యాపారంగా మారింది. మనోహరాబాద్‌ మండలంలో కూచారం, ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్‌ పారిశ్రామికవాడల్లో రాత్రంతా మట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నది.  


దాడులకు తెగిస్తున్నారు

మనోహరాబాద్‌ మండలంలో కూచారం అక్రమ మట్టి దందాకు అడ్డాగా మారింది. రాత్రంతా మట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి అక్రమ మట్టి దందాను కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటలకు దందా మొదలై రాత్రంతా కొనసాగుతున్నది. కూచారంలో అసైన్డ్‌ భూముల నుంచి యథేచ్ఛగా ఎక్స్‌కవేటర్లను పెట్టి మరీ తవ్వకాలు చేస్తున్నారు. రెండు ఎక్స్‌కవేటర్లతో రాత్రంతా మట్టి టిప్పర్లలో నింపేందుకు ఏర్పాటు చేయగా, రవాణా చేసేందుకు ఇరవైకిపైగా టిప్పర్లు ఏర్పాటు చేసుకున్నారు. మట్టి రవాణాను అడ్డుకోడానికి ప్రయత్నిస్తే దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలనే పంచాయతీ వార్డు సభ్యులు అడ్డుకోడానికి ప్రయత్నిస్తే పరిస్థితి దాడులు చేసేంత వరకు వచ్చింది.  


అధికారులు, నాయకుల అండ!

మట్టి అక్రమ రవాణాకు ఽఅధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దల అండదండలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. పోలీసు,  రెవెన్యూ శాఖల అధికారులకు ముడుపులు అందుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్థులు చెబుతున్నారు. మట్టి అక్రమ రవాణా చేస్తున్నవారిని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకుంటే రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు, ఫోన్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో తూప్రాన్‌ సమీపంలోని హల్దీ వాగు పక్కన అక్రమ ఇసుక ఫిల్టర్లను అడ్డుకున్న సిద్దిపేట ఆర్డీవోను తూప్రాన్‌ తహసీల్‌ కార్యాలయంలో వేలాది మందితో ముట్టడించారు. ఇసుక రవాణా లారీని అడ్డుకున్న ఓ రవాణాశాఖ అధికారిపై దాడి చేశారు.   ప్రస్తుతం మట్టి అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై సాధారణ జరిమానాలు వేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గి, వాహనాలకు కేవలం రూ. 5వేల జరిమానాతో సరిపెడుతున్నారు. ఇటీవల ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నట్లు కూచారం గ్రామస్థులు తూప్రాన్‌ ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు.  

Read more