మిల్లుల్లోనే యాసంగి ధాన్యం

ABN , First Publish Date - 2022-11-07T23:22:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగిలో మిల్లులకు కేటాయించిన ధాన్యం మిల్లులు ఇంకా మర ఆడించ లేదు. మర ఆడించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మిల్లుల్లోనే యాసంగి ధాన్యం
గద్వాలలోని ఓ మిల్లులులో నిల్వ ఉన్న గత యాసంగి ధాన్యం

ఐదు శాతం కూడా మర ఆడించని యాజమాన్యం

సీఎంఆర్‌ శాతం నిర్ణయించకపోవడమే కారణం

ఈ వానాకాలం ధాన్యం నిల్వకు స్థలం కరువు

గద్వాల, నవంబరు 7: రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగిలో మిల్లులకు కేటాయించిన ధాన్యం మిల్లులు ఇంకా మర ఆడించ లేదు. మర ఆడించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కేవలం బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లోనే మర ఆడిస్తున్నారు. గత యాసంగిలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన 67 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి దాదాపు 86,379 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సివిల్‌ సప్లయ్‌ అధికారులు సేకరించారు. సీఎంఆర్‌ ఎంత శాతం ఇవ్వాలో స్పష్టమైన ఆదేశం లేకపోవడంతో రారైస్‌ మిల్లులు ధాన్యం మర ఆడించడం లేదు. దీంతో మిల్లులోనే ధాన్యం పేరుకు పోయింది. బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల్లో మర ఆడించిన బియ్యం సీఎంఆర్‌ కిం 2,610 మెట్రిక్‌ టన్నులు పౌర సరఫరాల శాఖకు చేరింది.

ధాన్యం అమ్ముకుంటున్న మిల్లులు..

యాసంగి సీఎంఆర్‌ ఎంత ఇవ్వాలనే దానిపై మిల్లులకు స్పష్టమైన ఆదేశం లేకపోవడంతో కొన్ని మిల్లుల్లో ధాన్యం కొంత మేర ఆడించగా, మరికొన్ని మిల్లుల నుంచి ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున లారీల్లో తరలించి సొమ్ము చేసుకొని పెట్టుబడి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఒకవేల సీఎంఆర్‌ కోటా ఇవ్వాల్సి వస్తే రీసైక్లింగ్‌ బియ్యం, ఖరీఫ్‌లో వచ్చిన ధాన్యం నుంచి ఇవ్వొచ్చనే ధీమాతో దర్జాగా ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఈ విషయం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎప్పటికప్పుడు మిల్లులను ఆడిట్‌ చేస్తున్నారని, ఎక్కడ ఎలాంటి నిల్వలు తగ్గలేదని చెబుతున్నారు.

ఈ ఖరీఫ్‌ ధాన్యం ఎక్కడ నిల్వ చేయాలి?

యాసంగి ధాన్యం 86,379 మెట్రిక్‌ టన్నులు మిల్లుల్లో నిల్వ ఉంది. అందులో 4.5 శాతం మాత్రమే సీఎంఆర్‌గా పౌరసరఫరాల శాఖకు చేరింది. మరో వారం రోజుల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలను తెరుస్తున్నారు. దాదాపు 2,45,873 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇంత ధాన్యం ఎక్కడ నిల్వ చేస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని మిల్లుల్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి. వాటిని మినహాయిస్తే స్థలాలు లేని మిగిలిన మిల్లుల్లో ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎనిమిది చోట్ల మార్కెట్‌కు సంబంధించిన గోదాములు ఉన్నా, అవీ సరిపోని పరిస్థితి ఉంది. పూడూరు దగ్గర 55 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న ప్రైవేటు గోదాములు ఉన్నాయి. పౌరసరఫరాల అధికారులకు ఇది తప్ప మరోమార్గం కనిపించడం లేదు. యాసంగి సీఎంఆర్‌ను నిర్ణయించి, ఇవ్వాలని మిల్లులకు చెప్పిఉంటే ఖరీఫ్‌ ధాన్యం నిల్వలకు ఢోకా ఉండేది కాదని అధికారులు అంటున్నారు.

Updated Date - 2022-11-07T23:22:49+05:30 IST

Read more