-
-
Home » Telangana » Mahbubnagar » This orry-MRGS-Telangana
-
ఈ‘సారీ’
ABN , First Publish Date - 2022-05-15T04:25:07+05:30 IST
అలంపూర్, 14 మే: ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ద్వారా అలంపూర్ తాలూకాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందడం ఏటా ప్రశ్నార్థకంగానే మారుతోంది.
ఆర్డీఎస్ కింద చివరి ఆయకట్టుకు నీరందడం ఈ ఏడాదీ ప్రశ్నార్థకమే
మరమ్మతుల కోసం రూ.11 కోట్లు మంజూరు
నామమాత్రంగా పనులు
చెట్లు తొలగించగా.. పూడిక తీయని వైనం
అలంపూర్, 14 మే: ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) ద్వారా అలంపూర్ తాలూకాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందడం ఏటా ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఈ పథకం కింద అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాలకు నీరందాల్సి ఉంది. కానీ మానవపాడు మండలం వరకే నీరందుతోంది. అక్కడి నుంచి అలంపూర్‌లోని డీ 40 వరకు పూడిక ఎక్కువగా ఉండటం, అధికారులు పట్టించుకోకపోవడంతో కాంక్రిట్ పోయి, కాల్వలు దెబ్బతిన్నాయి. చెట్లు పేరుకుపోడం వంటి కారణాల వల్ల నీరందడం లేదు.
తూతూమంత్రంగా మరమ్మతు
ప్రస్తుతం అయిజ మండలం ఉప్పల నుంచి అలంపూర్ చివరి ఆయకట్టు డీ 40 వరకు కాల్వల మరమ్మతులు చేపడుతున్నారు. కాల్వల్లో చెట్లు, పూడిక తొలగింపు, స్ట్రక్చర్స్ మరమ్మతుల కోసం రూ.11 కోట్ల మంజూరయ్యాయి. వనపర్తికి చెందిన శ్రీరామ కన్స్ట్రక్షన్ పనులు దక్కించుకుంది. 80 కిలో మీటర్ల వరకు పనులు చేపట్టారు. చెట్ల తొలగింపు పూర్తి కాగా, సరిగా చేపట్టడం లేదన్న ఆరోపణలొస్తున్నాయి. కాల్వల్లో పూడిక తీయడంతో పాటు డిస్ర్టిబ్యూటర్ల వద్ద నీటిని అక్రమంగా తరలించకుండా షెటర్లు బిగించాల్సి ఉంది.
ఆ రిజర్వాయర్లపై మీమాంస?
అయితే డీ 40 వరకు నీరు పారాలంటే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లు చేపట్టాల్సి ఉంది. వాటికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులు అరకొరగా జరుగుతుండగా, ఈ రిజర్వాయర్ల ఊసు మాత్రం ఎత్తడం లేదు. అయితే మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లు అవసరం లేదని, గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా ఆర్డీఎస్ కెనాల్‌కు లింక్ కలిపి, చివరి ఆయకట్టు వరకు నీరందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
నీటి కొరత వల్లే
ఆర్డీఎస్ ద్వారా గత ఏడాది 57,000 ఎకరాలకు నీరందించామని, ఈ ఏడాది 27,000 ఎకరాలకు కూడా నీరందించలేకపోతున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నీటి కొరత వల్ల అందించలేకపోతున్నామని అంటున్నారు. ప్రస్తుతం జీవో 45 విడుదలతో ఈఈ, డీఈలు తమ అధికారాల ద్వారా అక్రమంగా నీటిని చౌర్యం చేసే రైతులపై చర్యలు తీసుకోనున్నారు.
డీ 40 వరకు నీరందిస్తాం
రిజర్వాయర్లు లేదా ఎత్తిపోతల పథకాల ద్వారా డీ 40కి వరకు నీరందించేలా కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రూ.11 కోట్ల ప్యాకేజీతో చివరి ఆయకట్టు వరకు జంగిల్ కటింగ్ పనులు సాగుతున్నాయి. రైతులు మోటార్ల ద్వారా నీటిని అక్రమంగా తరలించకూడదు. నీటి చౌర్యం చేస్తే చర్యలు తీసుకుంటాం.
- విజయ్ కుమార్, ఈఈ ఇరిగేషన్



