ధాన్యం రైతు దగా
ABN, First Publish Date - 2022-05-15T04:23:20+05:30
యాసంగి ధాన్యం అమ్మకాల్లో రైతులు దగాపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది.
కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయని ప్రభుత్వం
మద్దతు ధర పొందలేకపోయిన 80 శాతం రైతులు
తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్న పరిస్థితి
ధాన్యం అమ్ముకున్నాక నింపాదిగా కేంద్రాల ప్రారంభం
వేచి ఉన్న రైతులకూ తరుగు పేరుతో అన్యాయం
యాసంగి ధాన్యం అమ్మకాల్లో రైతులు దగాపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. మార్చి మూడో వారంలో మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ మూడో వారం వరకు చడీచప్పుడు లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో రైతులు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. మద్దతు ధరకంటే తక్కువకే అమ్ముకొని నష్టపోయిన దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ధాన్యం పోరుతో అంతిమంగా పాలమూరు రైతాంగం నిలువునా నష్టపోయింది.
- మహబూబ్‌నగర్, ఆంరఽధజ్యోతి ప్రతినిధి
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోళ్లలో చేసిన జాప్యం వల్ల రైతులు నష్టపోయారు. ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్నారు. వరికి ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-1 రకాలకు క్వింటాల్‌కు రూ.1930, కామన్ రకాలకు క్వింటాల్‌కు రూ.1910 ఉంది. ప్రైవేట్ వ్యాపారులు, మార్కెట్లలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1,400 నుంచి రూ.1,600 చెల్లించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ సీజన్లో 99,179 ఎకరాల్లో వరి సాగవగా, 2,20,146 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. స్థానిక వినియోగం పోను 1,87,146 మెట్రిక్ టన్నుల ఽధాన్యం రైతులు అమ్ముకోవాల్సి ఉండగా, ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌ల ద్వారా కనీసం 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కేంద్రాల ప్రారంభంలో తీవ్ర జాప్యం ఏర్పడటంతో ధాన్యం వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40,162 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. ఈ జిల్లాలో రైతుల వద్ద ధాన్యం దాదాపు అయిపోవడంతో ఈవారంలో నవాబుపేట, మడ్జిల్ మినహా మిగిలిన కేంద్రాలన్నీ మూసివేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం ఉత్పత్తితో పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో కేవలం 21 శాతం ధాన్యానికి మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో మద్ధతు ధర దక్కింది.
నారాయణపేట జిల్లాలో ఈ సీజన్లో 95,932 ఎకరాల్లో వరి సాగయ్యింది. 2,11,050 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. అందులో స్థానిక అవసరాలు పోను 1,79,393 మెట్రిక్ టన్నులు రైతుల నుంచి కొనాల్సి ఉంటే, ఇప్పటివరకు కేవలం 30,659 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ జిల్లాలోనూ సీజన్ ఆరంభం నుంచి కేంద్రాలు లేకపోవడంతో రైతులు అక్కువ ధరలకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారు. ఈ జిల్లాలో నికరంగా మద్దతు ధర కేవలం 17 శాతం ధాన్యానికే దక్కింది.
తరుగు పేరుతో మరింత నష్టం
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల మెజారిటీ రైతులు నష్టపోగా, మద్దతు ధరకు అమ్ముకున్న వారికి కూడా సంతృప్తి దక్కడం లేదు. మిల్లుల వద్ద రోజుల తరబడి అన్లోడింగ్ చేయకుండా తరుగు పేరుతో కోతలు విధిస్తున్నారు. తేమ ఉందని, మట్టిపెడ్డలు ఉన్నాయని, తాలుందనే సాకుతో బస్తాకు రెండు కేజీల వరకు కోత విధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ ప్రకారం క్వింటాల్‌కు ఐదు కిలోలవరకు తరుగుకు అంగీకరిస్తేనే కొన్ని మిల్లుల్లో ధాన్యం దింపుకుంటున్నారని, రోజుల తరబడి వేచి ఉండలేక ఆ తరుగుకు అంగీకరించి ధాన్యం దింపి వస్తున్నామని దేవరకద్ర మండలానికి చెందిన ఒక రైతు, నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన మరో రైతు ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లో వివరించారు. ఇదే సమయంలో కొందరు దళారులు కర్ణాటక నుంచి తక్కువ ధరకు ధాన్యంకొని, ఇక్కడి సరిహద్దు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల పేరున అమ్ముకుని మద్దతు ధర పొందుతున్నారని తెలుస్తోంది. ఇటీవల దామరగిద్దలో పట్టు బడ్డ ధాన్యం, నారా యణపేట జిల్లా సరిహద్దుల వద్ద పట్టుబడుతున్న ధాన్యమే అందుకు ఉదాహరణగా చెప్పొ చ్చు.